
మానవత్వమే మహా విజేత!
అందుకే... అంత బాగుంది!
సేవియర్ (1998)
ఎన్. శంకర్
ప్రముఖ దర్శకుడు
తారాగణం: డెన్నిస్ క్వెయిడ్, స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్, నస్టాస్జౌ కిన్‌స్కీ, నటాషా నిన్‌కోవిక్, సెర్గెజ్ ట్రిపునోవిక్
రచన: రాబర్ట్ ఓర్ ; సంగీతం: డేవిడ్ రాబిన్స్ ; నిర్మాతలు: అలివర్ స్టోన్, జేనట్ యాంగ్ ;
దర్శకత్వం: ప్రెడ్రగ్ ఆంటోనిజెవిక్ ; విడుదల: 1998 నవంబర్ 20 ; సినిమా నిడివి: 103 నిమిషాలు ;
నిర్మాణ వ్యయం: కోటి అమెరికన్ డాలర్లు (దాదాపు 60 కోట్ల రూపాయలు)
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా నా కళ్లు వెతికేది సినిమాలు, పాటలనే! ఆయా ప్రాంతాల కలెక్షన్‌ను సేకరించడం నాకు మొదటి నుంచీ అలవాటు. విదేశాల నుంచి మా బంధువులు ఎవరు వచ్చినా నాకు డీవీడీలు గిఫ్ట్‌గా తెస్తుంటారు. కొన్నేళ్ళ క్రితం అమెరికా నుంచి మా బావ వస్తూ నా కోసం 15 డీవీడీలు తెచ్చాడు. అప్పుడు ‘జయం మనదేరా’ సినిమా ప్లానింగ్‌లో ఉన్నా. ఆ టైమ్‌లోనే ఈ 15 డీవీడీలొచ్చాయి. వాటిల్లో నుంచి ఓ హాలీవుడ్ సినిమా తీసి ప్లే చేశాను. ఆ సినిమా చూస్తూ కూర్చున్నవాణ్ణి కూర్చున్నట్టే ఉండిపోయాను. ఆకలిదప్పులు కూడా మరచిపోయాను. సినిమా అయిపోయాక కూడా ఆ అనుభూతి నుంచి బయటకు రాలేకపోయాను.
నిజం చెప్పాలంటే, రెండ్రోజుల పాటు నన్ను ఆ సినిమా వెంటాడుతూనే ఉంది. ఆ దెబ్బతో వారం రోజుల పాటు ఎవరికీ చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా ఓ చోటకు వెళ్లిపోయాను. ఆ సినిమా కథాంశం, నేపథ్యం, దాని వెంట ఓ తీగలాగా, ప్రవాహంలాగా భారతదేశం-నక్సలిజం, ప్రజలూ, పోరాటాలూ, ఫ్రెంచ్ విప్లవం, వియత్నాం విప్లవం... ఇలాంటి అంశాలన్నీ నన్ను చుట్టుముట్టేశాయి. ఆ మూడ్‌లోనే ఓ స్క్రిప్టు రెడీ చేసేశాను కూడా! అయితే అది మామూలు కథ కాదు. రెండు, మూడు రాష్ట్రాల వాళ్లకు బాగా తెలిసిన హీరోకైతేనే అది కరెక్ట్. కానీ వాళ్లు ఇలాంటి కథను ఇష్టపడతారో లేదోననే సందేహం. అందుకే ఆ స్క్రిప్టును తాత్కాలికంగా పక్కన పెట్టేశాను. కానీ ఎప్పటికైనా ఆ కథతో సినిమా చేస్తాను. అది ఖాయం!
నన్ను అంతలా కలవర పెట్టిన ఆ సినిమా పేరు - ‘సేవియర్’ (1998). ఈ సినిమా కథ గురించి, మేకింగ్ గురించి చెప్పే ముందు అలివర్ స్టోన్ గురించి చెప్పాలి. అతనే ఈ సినిమాకు మూలసూత్రధారి. జానెట్ యాంగ్‌తో కలిసి ఈ సినిమా నిర్మించాడు. ఈ తరహా సినిమాలు నిర్మించడంలో అలివర్ స్టోన్ సిద్ధహస్తుడు. అంతకు ముందు వియత్నాం యుద్ధం మీద కూడా సినిమా తీశాడు. ఏ ప్రాంతపు నేపథ్యంలో సినిమా తీస్తే, ముందు అక్కడకు వెళ్లిపోయి, అక్కడ మెరికల్లాంటి వాళ్లను ఎంచుకుని వాళ్లతోటే సినిమా తీస్తాడు. అందుకే అతని సినిమాలన్నీ అంత నేచురల్‌గా ఉంటాయి.
‘సేవియర్’ విషయానికొస్తే - ఇదొక వార్ ఫిల్మ్. బోస్నియా దేశంలోని రెండు తెగల మధ్య సంఘర్షణ నేపథ్యంలోని కథ ఇది. బోస్నియాకు చెందిన రచయిత, దర్శకుడు, కథానాయికతోనే ఈ సినిమా తీశారు. బోస్నియా యుద్ధం సందర్భంగా ఒక సెర్బియన్ మహిళకూ, ఆమెకు అప్పుడే పుట్టిన శిశువుకూ రక్షణగా నిలిచి, వారిని ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళిన ఒక అమెరికన్ కిరాయి సైనికుడి గురించిన కథ ఇది.
ఇప్పుడు ఈ సినిమా కథ గురించి మరింత వివరంగా చెబుతాను... జోష్వా రోజ్ (డెన్నిస్ క్వెయిడ్) ప్యారిస్‌లో ఎంబసీ అధికారి. భార్య (నస్‌టస్జా కిన్‌స్కీ) అంటే అతనికి పంచప్రాణాలు. కొడుకైతే ఆరో ప్రాణం. ఓ రోజు రెస్టారెంట్‌లో వాళ్లతో గడిపి, పని మీద బయటకు వస్తాడు. అంతే... మటాష్. ఇస్లామిక్ తీవ్రవాదులు బాంబు పేల్చడంతో సర్వం భస్మీపటలం. శవాలు.. రక్తం.. భారీ విధ్వంసం. కళ్ళెదుటే భార్య, బిడ్డ చనిపోతారు. రోజ్ గుండె పగిలిపోతుంది. పగతో రగిలిపోతాడు.
ఓ మందిరంలోకి చొరబడి అక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్లందర్నీ కాల్చిపారేస్తాడు. ఆ నేరాన్ని తప్పించుకోవడం కోసం ‘గై’ అనే మారు పేరుతో ‘ఫ్రెంచ్ ఫారిన్ లీజియన్’లో చేరతాడు. అతని వెంటే అతని మిత్రుడు పీటర్ (స్టెలన్ స్కార్స్‌గార్డ్) కూడా అదే బాట పడతాడు. బోస్నియా దేశంలో సెర్బ్‌లకూ, ఇస్లామిక్ తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో సెర్బ్‌ల తరఫున గై పోరాడుతూ ఉం టాడు. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది. అందులో భాగంగా ఖైదీలను పరస్పరం అప్పగించుకుంటారు.
వీళ్ల దగ్గరకొచ్చిన సెర్బ్‌లలో ఒక గర్భవతి ఉంటుంది. ఆమె పేరు ‘వెరా’. తీవ్రవాదుల చేతుల్లో అత్యాచార ఫలితంగా ఆమె గర్భం ధరిస్తుంది. వెరాకు ఆడపిల్ల పుడుతుంది. ఆ పిల్ల ముఖం కూడా చూడదు ఆమె. పాలివ్వడానికి కూడా అసహ్యించుకుంటుంది. కానీ గై మాత్రం ఆ పసిపిల్లను అపురూపంగా చూసుకుంటుంటాడు. వెరాను ఆమె కుటుంబం దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. వెరా తల్లితండ్రులు వెరానూ, ఆమె బిడ్డనూ సంరక్షించడానికి ససేమిరా అంటారు. దాంతో వాళ్లిద్దర్నీ తీసుకుని కారులో బయలుదేరతాడు గై.
ఈ ప్రయాణంలో ఎన్నో సంఘటనలు... ఆ పాపను కారులో నుంచి విసిరేయాలనుకుంటుంది వెరా. ఇతనేమో పాలు పట్టిస్తాడు. పాపాయి మలమూత్ర విసర్జన చేస్తే, శుభ్రం చేస్తాడు. పాల కోసం గొర్రెల వెనుక పరిగెడతాడు. పాపను శత్రువులు కాల్చేయబోతుంటే ఆ తూటాకు తాను గాయపడతాడు. ఈ తల్లినీ, బిడ్డనూ ఎలాగైనా సురక్షిత ప్రాంతానికి చేర్చాలని గై నిశ్చయించుకుంటాడు. ఐక్యరాజ్య సమితి సేఫ్‌జోన్ అయిన స్ల్పిట్‌కు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాడు.
ఆ సమయంలో ముస్లిమ్ బలగాలు వెరాను కాల్చి పారేస్తాయి. కళ్ల ముందే వెరా ప్రాణాలు విడుస్తున్నా, పాప కోసం అంతా మౌనంగా భరిస్తాడు. చివరకు పాప బాధ్యతను తానే స్వీకరిస్తాడు. దాంతో సినిమా అయిపోతుంది. కులం... మతం... ప్రాంతం... వీటన్నిటి కన్నా మానవత్వం గొప్పదని చాటి చెప్పే సినిమా ఇది. ఈ సినిమాకు అంతలా ఎందుకు కనెక్ట్ అయ్యానో నాకే తెలియదు. సినిమా చూసినప్పుడల్లా నాలో ఏవో ప్రకంపనలు కలిగేవి! ప్రాంతాల మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య, అసమానతల మధ్య, అనుబంధాల మధ్య జరిగే యుద్ధంలో విజేతగా నిలిచేది ఎప్పుడూ మానవత్వమే.
ఒక మనిషిని తెలియని దుఃఖం కబళించినపుడు ఎలా ఉంటుందో అంతుపట్టదు. అలాగే ధైర్యం తాలూకు శక్తి కూడా మనకు తెలీదు. ఈ సినిమా తీయడానికి అలాంటి ధైర్యమూ, దుఃఖమూ ముడిసరుకులుగా ఉపయోగపడ్డాయేమో! నా జీవితంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. వికారాబాద్ అడవుల్లో ‘ఎన్‌కౌంటర్’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు సూపర్‌స్టార్ కృష్ణ గారికి అంత పోలీసు నిఘా మధ్య కూడా గన్ ఎలా పట్టుకోవాలో నక్సలైట్లు చూపించి మరీ వెళ్లారు. ‘శ్రీరాములయ్య’ సినిమా సమయంలో నాకు ప్రతిరోజూ బెదిరింపులే. ఇప్పుడు కూర్చుని అవన్నీ తలచుకుంటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ధైర్యం తాలూకు శక్తి అంటే ఇలానే ఉంటుందేమో!
2008లో సెర్బియన్లకు స్వాతంత్య్రం వచ్చింది. వాళ్లు కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఆ పోరాట నేపథ్యంలో అద్భుతమైన మానవీయ కోణంలో ‘సేవియర్’ సినిమా తీయడమంటే మాటలు కాదు. 1992 - 1995 మధ్య కాలంలో బోస్నియా యుద్ధం ప్రాతిపదికగా తీసిన ఈ సినిమాలో యుద్ధంలోని విధ్వంసాన్నీ, మనుషుల ప్రవర్తననూ, పైశాచికత్వంలోని పరాకాష్ఠనూ దర్శకుడు ఎంతో గొప్పగా తీశాడు. ఈ యుద్ధం తీవ్రత ఎలా అయిపోతుందంటే - చివరకు పసిపిల్లలను చంపడానికి కూడా వెనుకాడరు.
ఓ సన్నివేశంలో వృద్ధురాలి వేలును కత్తిరిస్తారు. చూస్తే వణుకు వచ్చేస్తుంది. గర్భిణి అని కూడా చూడకుండా వెరాను హింసిస్తారు. పొట్ట మీద తంతారు. ఆమెకు స్వేచ్ఛ దొరికినా, ఆమె కడుపులో పరాయి జాతి వాడి బిడ్డ పెరుగుతుందని తెలిసి ఆమె తల్లితండ్రులే కన్నబిడ్డ అనే బంధాన్ని సైతం వదిలేసుకోవడానికి సిద్ధమవుతారు. తల్లిదీ అదే ధోరణి. నిజం చెప్పండి... ఈ జాతుల ఘర్షణకూ, ఆ పసిపాపకు ఏమైనా సంబంధం ఉందా? చివరకు వీళ్లెవరితోనూ సంబంధం లేని గై ఆ పాపకు జీవితాన్నివ్వడానికి తన జీవితాన్ని రిస్కు చేస్తాడు.
మానవత్వం గొప్పతనం అదే!
మాంటెనెగ్రోలో చిత్రీకరించిన ఈ ‘సేవియర్’ చిత్రాన్ని 1998లో కాన్స్ చలనచిత్రోత్సవంలో, అలాగే 1998లో సోచీ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఈ సినిమా రీ-రికార్డింగ్ చాలా బాగుంటుంది. సాంకేతిక విలువలూ సూపర్బ్. పైకి ఏదో వార్ మూవీలాగా, ట్రావెల్ మూవీలాగా అనిపిస్తుంది కానీ అడుగడుగునా హ్యూమన్ ఎమోషన్స్ కనబడకుండా కనిపిస్తాయి. గై, వెరాల మధ్య ప్రేమ పుడుతుందేమో, వీళ్లిద్దరూ ఏకమవుతారేమోనన్న జనరల్ సైకాలజీ మనల్నీ వెంటాడుతుంది. కానీ దర్శకుడు మాత్రం ఎన్నో మెట్లు పైన ఆలోచించి, సినిమాటిక్‌గా కాకుండా, చాలా నేచురల్‌గా కథను డీల్ చేశారు.
వెరా పాత్ర పోషించిన నటాషా నిన్‌కోవిక్ గుర్తుండిపోతుంది. ఫ్యాకల్టీ ఆఫ్ డ్రామా ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన ఆమె ఎక్కువగా టీవీ సీరియల్స్‌లో నటించారు. సినిమాలు తక్కువ చేసినా, అన్నీ బ్రహ్మాండమైనవే. ‘సేవి యర్’, ‘ద ప్రొఫెషనల్‘, ‘ద ట్రాప్’ చిత్రాలకు ఉత్తమ నటిగా పురస్కారాలు గెలుచుకున్నారు.ఇక హీరో డెన్నిస్ క్వెయిడ్‌కు హాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. ‘బ్రేకింగ్ ఎవే’, ‘ద రూకీ’, ‘వింటేజ్ పాయింట్’, ‘ఫుట్‌లూజ్’, ‘ఫ్రీక్వెన్సీ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.
ఈ చిత్ర దర్శకుడు ప్రెడ్రగ్ ఆంటోనిజెవిక్ కూడా సెర్బియా జాతీయుడైన దర్శక - రచయిత. ఆయన తీసిన రాజకీయ కథా చిత్రం ‘ది లిటిల్ వన్’ (1992). అది చూసిన నిర్మాత అలివర్ స్టోన్ తన దగ్గర ఉన్న రాబర్ట్ ఓర్ రాసిన స్క్రీన్‌ప్లేను ఆయనకు పంపారు. బోస్నియాలోని ఒక అమెరికన్ కిరాయి సైనికుడి నిజజీవిత కథ ఆధారంగా అల్లుకున్న స్క్రీన్‌ప్లే అది. ఆ యుద్ధం సందర్భంగా ఒక ఫొటోగ్రాఫర్‌కు సహాయకుడిగా పనిచేసిన అనుభవం ఓర్‌ది. అందుకే, అతను ఆ కథను అంత బాగా రాయగలిగాడు. ఇలాంటి కథలు పుట్టడం కష్టం. వాటిని తెరపైకి ఎక్కించడం ఇంకా కష్టం. అందుకే ‘సేవియర్’ని అనుభవంలోకి తెచ్చుకుంటూ, చూస్తాం. హ్యాట్సాఫ్ టు ‘సేవియర్’!
సంభాషణ: పులగం చిన్నారాయణ
మారణహోమాన్ని కళ్లకు కట్టిన ఆంటోని...
సెర్బియాకు చెందిన ్రప్రెడ్రగ్ ఆంటోనిజెవిక్ టీవి షోలు, సీరియళ్ల రూపకర.్త దర్శకునిగా ఆయన తొలి చిత్రం ‘ది లిటిల్ వన్’. ఆ తర్వాత చేసిన చిత్రం ‘సేవియర్’. 1992 నుంచి 1995 వరకూ సెర్బియన్లకు, ముస్లింలకు మధ్య జరిగిన యుద్ధానికి కదిలిపోయి, ్రప్రెడ్రగ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. స్క్రీన్‌ప్లే రచయిత రాబర్ట్ ఓర్ బోస్నియాలో యుద్ధం జరిగే సమయంలో ఫొటో జర్నలిస్ట్‌కు సహాయకునిగా పనిచేశారు. ఆయన అనుభవాల సమాహారంతో మారణ హోమాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. ఆ తర్వాత ‘హార్డ్ క్యాష్ ’, ‘లిటిల్ మర్డర్’, ‘బ్రేకింగ్ ఎట్ ద ఎడ్’్జ చిత్రాలను తెరకెక్కించారు. చేసింది తక్కువ చిత్రాలే అయినా ప్రెడ్రగ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.