Tollywood Director N Shankar Land Case Solved By High Court, Deets Inside - Sakshi
Sakshi News home page

Director Shankar Land Case: దర్శకుడు శంకర్‌కు భూ కేటాయింపు.. సమర్థించిన హైకోర్టు

Published Sat, Jul 8 2023 5:14 PM | Last Updated on Sat, Jul 8 2023 6:56 PM

Tollywood Director Land case Solved By high Court - Sakshi

ప్రముఖ సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌కు ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్ల గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది. సినిమా, టీవీ స్టుడియో నిర్మాణంతో పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. స్టూడియో నిర్మాణం కోసం శంకర్‌ వినతిపత్రం అందజేసిన తర్వాతే రాష్ట్ర కేబినెట్‌ భూ కేటాయింపుపై నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం నేరుగా భూమి కేటాయించిందన్న పిటిషనర్‌ వాదనను తప్పుబట్టింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 75 సబబేనని తీర్పు వెలువరించింది.

(ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్‌ వస్తుంది: మాళవిక

భూ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని.. ఈ క్రమంలోనే సినీ రంగానికి, క్రీడాకారులకు కేటాయిస్తుందని చెప్పింది. గతంలోనూ పలువురు ప్రముఖులకు భూములు కేటాయించిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించింది. సుప్రీంకోర్టు కూడా సినీ, క్రీడా.. తదితర రంగాల ప్రముఖులకు ఆయా రంగాల అభివృద్ధి కోసం భూమి కేటాయించడాన్ని సమర్థించినట్లు గుర్తుచేసింది.

 మోకిల్ల గ్రామం సర్వే నంబర్‌ 8లో ఎకరం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను ప్రభుత్వం శంకర్‌కు కేటాయిస్తూ 2019లో జీవో నంబర్‌ 75 జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కరీంనగర్‌కు చెందిన జె.శంకర్‌ 2020లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ పూర్తి కావడంతో బుధవారం తీర్పును రిజర్వు చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీ ధర్మా సనం శుక్రవారం తుది ఉత్తర్వులు వెలువరించింది. 

సినీ పరిశ్రమను ప్రోత్సహించే సదుద్దేశంతోనే స్టూ డియో నిర్మాణం కోసం శంకర్‌కు ప్రభుత్వం భూమి కేటాయించింది. ఇతర ఏ పనులకు వినియోగించ కూడదన్న నిబంధన కూడా విధించింది. బలహీన వర్గానికి చెందిన శంకర్‌ 40 ఏళ్లుగా సినీ పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.

ఆయనకు భూమి కేటాయించే నాటికి అక్కడ ఎకరం మార్కెట్‌ విలువ రూ.20 లక్షలు మాత్రమే ఉంది. స్టూడియో నిర్మాణంతో పలువురు కళాకారులను సినీ రంగానికి అందించిన వారమవుతాం. చట్ట ప్రకారమే అన్ని నిబంధనలను పాటిస్తూ భూ కేటాయింపు జరిగిందని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. స్టుడియో నిర్మాణానికి భూమి కేటాయించడాన్ని సమర్థించింది.

(ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement