
కోలీవుడ్ దివంగత ప్రఖ్యాత నటుడు శివాజీగణేశన్ ఇంటిని జప్తు చేయాల్సిందిగా చైన్నె హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ ఆయన రెండో కుమారుడు, నటుడు ప్రభు దాఖలు చేసిన పిటీషన్‌ను తాజాగా కోర్టు కొట్టివేసింది. శివాజీగణేశన్ పెద్ద కొడుకు రామ్‌కుమార్ వారసుడు దుష్యంత్ నిర్మాతగా మారి 'జగజాల కిల్లాడి' చిత్రాన్ని నిర్మించాడు. అందుకోసం ధన భాగ్యం ఎంటర్‌ప్రైజెస్ సంస్థ నుంచి తీసుకున్న అప్పు చెల్లించలేదు. దీంతో ఆ సంస్థ చైన్నె హైకోర్టును ఆశ్రయించింది. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా రూ.9.38 కోట్లు చెల్లించాలని నిర్మాత దుష్యంత్‌కు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన దుష్యంత్ వారి అప్పు చెల్లించలేదు. ఈ కారణంతో శివాజీగణేశన్ ఇంటిని జప్తు చేయాల్సిందిగా కోద్దిరోజుల క్రితం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శివాజీగణేశన్ ఇంటిపై తనకు ఎలాంటి హక్కులు లేవని దుష్యంత్, తన తండ్రి రామ్‌కుమార్ కోర్టుకు తెలిపారు. అయితే, ఆ ఇంటి హక్కులు తనకు మాత్రమే ఉన్నాయని శివాజీగణేశన్ రెండో కుమారుడు, నటుడు ప్రభు కోర్టుకు వెల్లడించారు. ఇంటి జప్తు తీర్పును రద్దు చేయాలని న్యాయస్థానంలో ప్రభు పిటీషన్ దాఖలు చేశారు. అయితే, సరైన ఆధారాలు లేవంటూ నటుడు ప్రభు పిటీషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

ధనభాగ్యం ఎంటర్‌ప్రైజస్ సంస్థ తరఫున వాదించిన న్యాయవాది ఇలా చెప్పుకొచ్చారు. చైన్నె వంటి నగరంలో కోట్లు విలువ చేసే ఇంటి హక్కులు శివాజీగణేశన్ పెద్ద కొడుకుకు లేవంటే నమ్మశక్యంగా లేదన్నారు. అసలు ఆ ఇంటి హక్కులు పూర్తిగా నటుడు ప్రభుకే చెందినవా..? అనేది విచారించాలి. అంత వరకు శివాజీగణేశన్ ఇంటి జప్తు తీర్పును రద్దు చేయరాదని ఆయన వాదించారు. దీంతో ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం నటుడు ప్రభు పిటీషన్‌ను కొట్టి వేసింది.