విశాఖ నాకు సొంతిల్లులాంటిది: నటి
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ‘విశాఖ నాకు సొంత ఇల్లు లాంటిది. ఇక్కడే నా మొదటి సినిమా షూటింగ్ జరిగింది. ఏఎన్‌ఆర్, కృష్ణ, చిరంజీవి, నాగార్జున తదితర స్టార్స్‌తో నటించా. నా కుమార్తెలను సినిమాల్లో తీసుకొచ్చే ఆలోచన లేదు. సీరియల్స్‌లో నటిస్తూ హ్యాపీగా ఉన్నా.’ ఇలా చాలా విషయాలను సీనియర్ నటి యమున ‘సాక్షి’తో పంచుకున్నారు. తెలుగులో దాదాపు 70 చిత్రాల్లో నటించిన ఆమె జాలాది జయంతి వేడుకల్లో పాల్గొనడానికి నగరా నికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో చిట్‌చాట్..
సీరియళ్లలో బాగా బిజీ అయినట్టు ఉన్నారు.
ప్రస్తుతం రెండు సీరియళ్లలో నటిస్తున్నాను. ఇప్పటివరకు ఐదు సీరియళ్లలో నటించాను. సినిమాల్లో నా నటన ఎంతో మందిని ఏడిపిస్తే.. సీరియళ్ల ద్వారా నవ్విస్తున్నాను.
టాలీవుడ్‌లో ఎలా అవకాశం వచ్చింది?
నేను తమిళ సినీ రంగం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాను. ఆ సినిమాకు డైరెక్టర్ బాలచందర్. తెలుగులో నా మొదటి సినిమా మౌనపోరాటం. ఆ సినిమాలో అమాయకపు అమ్మాయి పాత్ర కోసం పేపర్‌లో నా ఫొటో చూసి డైరెక్టర్ ఎంపిక చేశారు.
మీకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు?
మౌన పోరాటం, జడ్జిమెంట్, ఎర్ర మందారం, పుట్టింటి పట్టు చీర, మామగారు. అప్పట్లో కుటుంబ కథా చిత్రాల్లో హీరోయిన్ అంటే యమున అన్నంతలా గుర్తింపు వచ్చింది.
స్టార్ హీరోలతో నటించారు కదా.. ఆ విశేషాలు?
ఏఎన్‌ఆర్‌తో కాలేజీ బుల్లోడు సినిమాలో నటించాను. ఆయనతో నటించడం నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తాను. కృష్ణ, చిరంజీవి, నాగార్జున తదితర స్టార్ హీరోలతో నటించడం చాలా సంతోషంగా ఉంది.
మీకు బాగా గుర్తుండిపోయే సంఘటన?
చెన్నైలో ఓ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నాను. ఆ కార్యక్రమానికి కమల్‌హాసన్ కూడా హాజరయ్యారు. ఆయన్ని కలిసి నేను.... అని చెప్పేలోపు.. నువ్వు యమున కదా.. మౌనపోరాటం చూశాను. చాలా బాగా చేశావ్ అని అభినందించారు. ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన.
మామగారు సినిమా వదులుకోవాలని అనుకున్నారట.. నిజమేనా?
మామగారు, ఎదురింట్లో పెళ్లాం.. పక్కింట్లో మొగుడు సినిమాలకు ఒకేసారి అవకాశం వచ్చింది. మామగారు సినిమాలో నాతో పాటు మరో హీరోయిన్‌కు అవకాశం ఉంది. అందుకే ఆ సినిమా వదులుకుందా మని అనుకున్నా.. డైరెక్టర్ పట్టుబట్టి ఈ సినిమాలో నటింపజేశారు. ఇప్పుడు యమున అంటే మామగారు సినిమాయే గుర్తుకొస్తుంది. ఈ సినిమా వదులుకుని ఉంటే జీవితంలో చాలా బాధపడి ఉండేదాన్ని..
విశాఖతో మీ అనుబంధం?
నాకు విశాఖ సొంత ఇళ్లులాంటిది. ఆర్కేబీచ్, అరకు, ఎర్ర మట్టి దిబ్బలు, తదితర ప్రాంతాల్లో 10 సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. మౌనపోరాటం కూడా విశాఖలోనే షూటింగ్ జరిగింది.
మీ కుమార్తెలను సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చే ఆలోచన ఉందా?
నాకు విశేష్టి, కౌషిక్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారిని సినీ పరిశ్రమలోకి తెచ్చే ఆలోచన లేదు.