‘షో మ్యాన్’కు నివాళి | Shah Rukh Khan pays tribute to showmnan Raj Kapoor on his TV show | Sakshi
Sakshi News home page

‘షో మ్యాన్’కు నివాళి

Published Tue, Mar 3 2015 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

‘షో మ్యాన్’కు నివాళి

‘షో మ్యాన్’కు నివాళి

ఎంత ఎత్తుకు ఎదిగినా చరిత్రనూ, వెనుకటి తరాల వారి కృషినీ మర్చిపోకుండా ఉంటేనే వర్తమానాన్నీ, భవిష్యత్తునూ అందంగా తీర్చిదిద్దుకోగలం. ప్రముఖ హిందీ హీరో షారుఖ్ ఖాన్‌కు ఈ సంగతి బాగా తెలిసినట్లుంది. అందుకే, తాజాగా ఒక టీవీ రియాలిటీ షోలో భారతీయ సినీసీమలో ‘షో మ్యాన్’గా సుప్రసిద్ధుడైన నటుడు - దర్శక - నిర్మాత రాజ్‌కపూర్‌ను స్మరించుకున్నారు. ‘ఇండియా పూఛేగా సబ్‌సే షానా కౌన్?’ అనే టీవీ రియాలిటీ షో చిత్రీకరణ సాగుతున్న సమయంలో పోటీదారుల్లో ఒకరు సర్కస్‌లో జోకర్ తరహా ముక్కుతో కనిపించగానే షారుఖ్ పాత సినిమా సంగతులు గుర్తుచేసుకున్నారు.
 
  సర్కస్‌లోని ఒక జోకర్ జీవిత కథ చుట్టూ తిరుగుతూ రాజ్‌కపూర్ తీసిన సినీ కళాఖండం ‘మేరా నామ్ జోకర్’ (1970)నూ, రాజ్‌కపూర్ - దిలీప్ కుమార్ - దేవానంద్‌ల త్రయం వెండితెరను ఏలిన హిందీ సినీ స్వర్ణయుగాన్నీ షారుఖ్ ప్రస్తావించారు.  గమ్మత్తేమిటంటే, ఇటీవలే బుల్లితెరపై ప్రీమియర్ వేసిన ఈ టీవీ షోను చిత్రీకరించింది కూడా రాజ్‌కపూర్‌కు చెందిన ఆర్.కె. స్టూడియోలోనే! కేవలం 24 ఏళ్ళ వయసులోనే సొంత స్టూడియో స్థాపించి, 1948లోనే ‘ఆగ్’ చిత్రంతో ఆ రోజుల్లో అతి పిన్నవయసులోనే దర్శకుడైన రాజ్‌కపూర్ నటన, నిర్మాణం, దర్శకత్వాల్లో తనదైన ముద్ర వేసి, ఎన్నో ఆణిముత్యాలను అందించిన విషయాన్ని షారుఖ్ గుర్తు చేసుకున్నారు.
 
  నెత్తి మీద టోపీ, చేతిలో గొడుగుతో రాజ్‌కపూర్, నర్గీస్‌తో కలసి కనిపించిన సూపర్‌హిట్ సాంగ్ ‘ప్యార్ హువా ఇక్‌రార్ హువా...’ అందరికీ తెలిసిందే. అదే పద్ధతిలో ఆ మధ్య ‘రబ్ నే బనా దీ జోడీ’ చిత్రంలో ‘ఫిర్ మిలేంగే చల్తే చల్తే...’ అంటూ షారుఖ్ అభినయించారు. పాత తరంలోని మంచిని గుర్తించి, గ్రహించి, ఆచరణలో పెట్టడమే అసలైన నివాళి అని షారుఖ్ తన చర్యల ద్వారా జ్ఞాపకం చేశారు కదూ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement