
సోషియో ఫాంటసీ...
అలానాటి అందాల తార, సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్, మిస్తీ చక్రవర్తి జంటగా రూపొందుతోన్న చిత్రం ‘శరభ’. కేఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నరసింహారావు ఎన్. దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహాదేవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘108 నరసింహ స్వామి పుణ్యక్షేత్రాల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని ఆరంభించడం విశేషం. నటీ నటులు, సాంకేతిక వర్గం చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభమైంది.
ప్రముఖ దర్శకులు ఎన్.శంకర్ వద్ద 20 ఏళ్లు కో-డెరైక్టర్‌గా పనిచేసిన నరసింహారావు చెప్పిన కథ నచ్చడంతో, ఆయన డెరైక్షన్ లో ఈ చిత్రం నిర్మిస్తున్నా. ఇదొక సోషియో ఫాంటసీ చిత్రం’’ అన్నారు. ‘‘నరసింహ స్వామి చరిత్రలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తున్నాం. ఈ నెల 21న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రమణ సాల్వ, సంగీతం: కోటి, కో ప్రొడ్యూసర్: సురేష్ కపాడియా.