ట్రాక్టర్ల మీద వెళ్లి మరీ సోగ్గాణ్ణి చూస్తున్నారు : నాగార్జున
‘‘మొదటి రోజు కన్నా ఈ సినిమాకు కలెక్షన్స్ రెండో రోజు బాగా పెరిగాయి. విజయవాడ, కడపల్లో ఎక్స్‌ట్రా షోస్ కూడా వేస్తున్నారు’’ అని నాగార్జున చెప్పారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠి ముఖ్యతారలుగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం సక్సెస్ మీట్ ఆదివారం జరిగింది.
నాగార్జున మాట్లాడు తూ- ‘‘నేను ‘మాస్’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో డ్యాన్స్ చేశాను. అది హిట్. ఆ తర్వాత ‘సోగ్గాడే...’ పాటల వేడుకలోనూ స్టెప్పులు వేశాను. ఈ సినిమాకు మంచి రిజల్ట్ వస్తుందని ముందే తెలుసు. నేను ఊహించినదే జరిగింది. మొదటి మూడు రోజులు 15 కోట్లు వసూలు చేసింది. నా సినిమాల్లో హయ్యస్ట్ కలెక్షన్స్ వచ్చిన చిత్రమిదే. పూర్వం బండ్లు కట్టుకుని సినిమాలకు వెళ్లేవాళ్లని విన్నాను.
చాలా కాలం తర్వాత ట్రాక్టర్ల మీద ఈ సినిమాకు వెళుతున్నారని వింటున్నా. పంచెకట్టయితే మళ్లీ ఓ ఫ్యాషన్ స్టేట్‌మెంట్ అయ్యేలా ఉంది. నేనూ ఇకనుంచి పంచె కట్టాలనుకుంటున్నా. అంతలా నచ్చేసింది’’ అన్నారు. ‘‘ప్రతి ఊరిలోనూ కనీసం నలుగురు బంగార్రాజులు ఉంటారు. అలాగే ప్రతి మనిషిలోనూ ఓ బంగార్రాజు ఉంటాడు. అలా ఇన్‌స్పైర్ అయి బంగార్రాజు పాత్రను క్రియేట్ చేశా’’ అని కల్యాణ్ కృష్ణ తెలిపారు. అనూప్ రూబెన్స్, లావణ్యా త్రిపాఠి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.