బాలీవుడ్ రక్తంలో త్రివర్ణాలు ఉన్నాయి.దేశభక్తి తిలకం దిద్దుకుంది హిందీ సినిమా.‘జైహింద్’ అని జయధ్వానం చేస్తూ థియేటర్లలో జోష్ నింపేది హిందీ సినియాయే. యుద్ధాలు బార్డర్ల మీదే కాదు... మన గుండె అంచుల్లో కూడా ఉంటాయని చాటి చెప్పిన వీర సైనికుడు, దేశం మొత్తానికి పెద్ద కొడుకు, దేశభక్తికి తార్కాణం హిందీ సినిమా. పుల్వామా ఘాతుకం తర్వాత గట్టిగా అరవాలనిపించింది. గుండెల్లోని బాధ ప్రతీకారాన్ని కోరుతోంది. మనసులోని కోపాన్ని చూపించాలని ఉంది. అందుకే బాలీవుడ్ చూపించిన దేశభక్తిని మీకు చూపిస్తున్నాం.
‘పుల్వామా’ రహదారి మన సైనికుల రక్తంతో ఎర్రబడింది. 40 మంది సైనికులు ఆ దారిన విధులకు వెళుతూ ద్రోహుల కిరాతకానికి అసువులు బాసారు. దేశం కళ్లల్లో అశ్రువులు నింపారు. వారి త్యాగం ఏ బదులుతో సమం చేయగలం? దేశం వారికి జోహార్లు అర్పిస్తోంది. జేజేలు పలుకుతోంది. గుండెల మీద క్యాండిళ్లు వెలిగించి బరువెక్కిన హృదయంతో మౌనం పాటిస్తోంది. ప్రజలతో పాటు బాలీవుడ్ కూడా సందర్భం వచ్చిన ప్రతిసారీ సైనికుడి పట్ల తన గౌరవాన్ని చాటింది.
అతడి గొప్పతనాన్ని సినిమాలుగా తీస్తూ వచ్చింది. 1962 చైనా యుద్ధం గురించి ‘హకీకత్’ సినిమా 1971 పాకిస్తాన్ యుద్ధం గురించి ‘బోర్డర్’ సినిమా తీసింది. 1999లో కార్గిల్ యుద్ధం గురించి ‘లక్ష్య’ సినిమా ఎక్కుపెట్టింది. 2016లో పాకిస్తాన్‌పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ గురించి తాజాగా ‘ఉరి’ సినిమాతో శత్రువునే కాదు సక్సెస్‌ను కూడా హిట్ చేసింది. అయితే సైనికుడు ఉన్నవి మాత్రమే దేశభక్తి సినిమాలు అనుకోనక్కర్లేదు. దేశ భద్రత కోసం, సమగ్రత కోసం, స్ఫూర్తి కోసం ప్రాణాంతకమైన ఆపరేషన్స్ నిర్వహించిన సినిమాలు కూడా దేశభక్తి సినిమాలు అని భావించాలి. సైనికుడితో తోడు నిలిచి ‘జైహింద్’ అని నినదించిన సినిమాలు ఇవి.
సర్ఫరోష్ (1999)
దేశంలోకి ఆయుధాలు వస్తుంటాయి. ఎవరో ఆగంతకులో ఉగ్రవాదులో వాటిని ఉపయోగించి తీవ్రమైన ప్రాణనష్టం, ఆస్తినష్టం చేస్తుంటారు. అసలు ఈ ఆయుధాలు ఎక్కణ్ణుంచి వస్తాయి... ఆ దారి ఏమిటి అనే అంశాన్ని తీసుకుని తీసిన సినిమా ‘సర్ఫరోష్’. దేశ సరిహద్దుల నుంచి రాజస్తాన్ ద్వారా లోపల ఉన్న కొందరు దేశద్రోహుల సహాయంతో ఆయుధాలు ఇక్కడకు వస్తున్నాయని ఒక పోలీస్ ఆఫీసర్ కనిపెట్టి ఆ రాకెట్‌నంతా ధ్వంసం చేయడమే ఈ సినిమా.
ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయం నమోదు చేసింది. ఇందులో పాకిస్తానీ సింగర్‌గా నటించిన నసీరుద్దీన్ షా దేశ విభజన సమయంలో నష్టపోయిన తన కుటుంబం గురించి ప్రతీకారంగా భారత్‌పై ద్వేషం పెంచుకుని ఉగ్రవాదానికి సాయం చేస్తుంటాడు. ఈ సినిమా సోనాలి బింద్రేకు కూడా చాలా పేరు తెచ్చింది. ‘జిందగీ మౌత్ నా బన్‌జాయే’... అనే పాట సోను నిగమ్ గొంతు ద్వారా పెద్ద హిట్ అయ్యి ఇప్పటికీ ఆగస్టు 15న వినిపిస్తూనే ఉంటుంది.
రంగ్ దే బసంతి (2006)
సరిహద్దులో సైనికుడు ఉంటాడు సరే, సైనికుడికి మద్దతుగా ఉండాల్సిన పాలనా యంత్రాంగం ఎలా ఉంది? వారి కోసం ఆయుధాలు కొనుగోలు చేయాల్సిన మంత్రులు, అధికారులు నిజాయితీగా ఉన్నారా? నాసిరకం మిగ్ విమానాలు కొనుగోలు చేయడం వల్ల చాలా మంది పైలట్లు ప్రాణాలు విడిచారన్న వాస్తవం మన చరిత్రలో ఉంది. సైనికుడి ప్రాణాలంటే మీకు అంత అలుసా? అని కోపగించుకున్న ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులు ఎలాంటి ఆగ్రహాన్ని ప్రకటించారన్నది ఈ సినిమా. ‘రంగ్ దే బసంతి’ సినిమా చాలా శక్తిమంతంగా లోపలి శత్రువును చూపించింది. సైనికులను అడ్డం పెట్టుకొని బాగుపడుతున్న పెద్ద మనుషులను తెర మీదకు తెచ్చింది. ఆమిర్‌ఖాన్, సిద్ధార్థ, మాధవన్, సోహా అలీ ఖాన్ తదితరులు నటించిన ఈ సినిమా ఎ.ఆర్. రహెమాన్ సంగీతం వల్ల కూడా హిట్ అయ్యింది. ప్రజలలో కూడా చాలా చైతన్యం తీసుకు వచ్చిన సినిమాగా దీనిని చెప్పుకోవచ్చు.
బ్లాక్ ఫ్రైడే (2007)
మత కలహాలు అంతర్గత రుగ్మత కావచ్చు. దేశ ప్రజలతో లోపలి శక్తులే ఆడే ఆట కావచ్చు. కాని ఆ వ్యవహారంలో మాఫియా ఎంటర్ అయితే? బయటి నుంచి శక్తులు లోపల మారణకాండ సృష్టిస్తే? 1993లో ముంబైని దద్దరిల్ల చేసి వందలాది మంది మృత్యువుకు కారణమైన సీరియల్ బ్లాసింగ్స్ వెనుక ఉన్న అసలు కారణాలను సవివరంగా చూపించిన సినిమా ‘బ్లాక్ ఫ్రైడే’. పాకిస్తాన్‌లో ఉన్న దావుద్ ఇబ్రహీం, ముంబైలోని టైగర్ మెమెన్ ఏ కారణం చేత ఈ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశారో అందులో హిందు ముస్లిం తేడా లేకుండా ఎంత మంది అమాయకులు బలయ్యారో ఈ సినిమా పొల్లుపోకుండా చూపిస్తుంది. ఈ దేశానికి ప్రధాన శతృవు పొరుగు దేశం కాదని దేశంలోని అవిద్య, మూర్ఖత్వం కొందరు స్వార్థపరులకు ఎలా ఉపయోగపడుతుందో ఇందులో చూడవచ్చు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సినిమా తీశాడు. గాఢమైన సినిమాలు చూడాలనుకునేవారు తప్పక చూడాల్సిన సినిమా ఇది.
ఏ వెన్స్ డే (2008)
ఉగ్రవాద చర్యలు అంటే ఏమిటి? సామాన్యులను బలిగొనడమే. నేతలు, పాలకులు ఎప్పుడూ గట్టి రక్షణలో ఉంటారు. ఉగ్రవాద చర్యలకు సులభంగా దొరికిపోయే జీవులు సామాన్యులు. కాని సామాన్యుడు దీనిని సరి చేయలేడా? సామాన్యుడు చోద్యం చూస్తూ ఉండాల్సిందేనా? ఏం కాదు. దేశం కోసం సామాన్యుడు తెగిస్తే ఉగ్రవాదం వంటి విష వలయాలు ఎలా తునాతునకలు అవుతాయో ‘ఏ వెన్స్‌డే’ సినిమాలో దర్శకుడు నీరజ్ పాండే చూపించాడు. ఇందులో సామాన్యుడైన నసీరుద్దీన్ షా ప్రభుత్వం విచారణలో ఉంచిన ముగ్గురు ఉగ్రవాదులను, వారు తప్పించుకుపోనున్నారని గ్రహించి, చాలా ప్లాన్డ్‌గా మట్టుపెడతాడు. అతడిని అరెస్టు చేయదగ్గ అవకాశం ఉన్నప్పటికీ పోలీస్ ఆఫీసర్ అనుపమ్ ఖేర్ విడిచిపెడతాడు. దేశం సురక్షితంగా ఉండాలంటే పోలీసు వ్యవస్థ మాత్రమే కాదు ప్రజలు కూడా స్పందించాల్సి ఉంటుంది అని క్రియేటివ్ మీడియమ్ ద్వారా చెప్పిన సినిమా ఇది.
డి డే (2013)
దేశం కోసం ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏమేం ఆపరేషన్స్ చేస్తుందో సామాన్యులకు తెలిసే అవకాశం లేదు. పాకిస్తాన్‌లో ఉన్న దావుద్ ఇబ్రహీమ్‌ను ప్రాణాలతో పట్టుకుని రావాలంటే రా ఏజెంట్స్ ఎన్ని కష్టాలు, ప్రయత్నాలు, సాహసాలు చేయవలసి వస్తుందో ఊహాత్మకంగా అయినా సరే చాలా రియలిస్టిక్‌గా చూపిన సినిమా డి డే. ఇందులో డి అంటే దావుద్. ఆ పాత్రను ప్రసిద్ధ నటుడు రిషి కపూర్ పోషించాడు. ఆశ్చర్యం ఏమంటే పాకిస్తాన్ వెళ్లి దావుద్‌ను అరెస్ట్ చేసినా అతను ధైర్యంగా ఉంటాడు. సిస్టమ్‌లోని లొసుగులను వాడుకుని బయటపడతానని అంటుంటాడు. అందుకే అధికారులు అతణ్ణి మట్టుపెడతారు. ఎందరో గొప్ప అధికారులు మనం సాయం సంధ్యవేళ ఆరామ్‌గా టీ తాగుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి పని చేస్తుంటారని ఈ సినిమా చూపుతుంది.
బేబీ (2015)
2008లో జరిగిన ముంబై దాడులు దేశాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. సముద్రం ద్వారా పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబైలోని తాజ్ హోటల్‌తో సహా అనేక చోట్ల విచక్షణా రహితంగా మారణకాండ సృష్టించారు. దీని సూత్రధారులను వెతికి పట్టుకోవడానికి దేశ అంతర్గత వ్యవహారాల శాఖ రహస్యంగా ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ టాస్క్ వింగ్ పేరే ‘బేబీ’. ఈ వింగ్ ప్రధానాధికారిగా డానీ, ఏజెంట్లుగా అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, రానా దగ్గుబాటి తదితరులు నటించారు. దుబాయ్‌లో ఉన్న పాక్ సూత్రధారిని ప్రభుత్వాల ప్రమేయం లేకుండా, అత్యంత రహస్యంగా పట్టుకుని రావడం ఈ మిషన్ లక్ష్యం. రోమాంచితంగా సాగే ఈ సినిమా భార్యాపిల్లలను వదిలిపెట్టి దేశం కోసం పని చేసే అధికారుల గొప్పతనాన్ని చూపిస్తుంది. వారు అనుభవించే టెన్షన్, ప్రాణాంతక క్షణాలకు ఖరీదు కట్టలేమనిపిస్తుంది.
రెయిడ్ (2018)
సైనికుల ప్రాణాలు తీయడం, విధ్వంసాలు సృష్టించడం ఎంత పెద్ద దేశద్రోహమో ట్యాక్స్ ఎగ్గొట్టి నల్లధనాన్ని దాచుకోవడం కూడా అంతే పెద్ద ద్రోహం. ఆ సంపద రక్షణ కోసం రాజకీయాల్లో దిగి పదవులు పొందడం, అధికారులను తమ దరిదాపులకు కూడా రాకుండా చూసుకోవడం నేటికీ దేశవ్యాప్తంగా సాగుతున్నదే. ఇప్పుడన్నా మీడియా రక్షణ ఉంది. 1980లలో ఏం చేసినా అడిగే నాథుడు లేడు. అలాంటి రోజులలో కాన్పూర్‌లోని ఒక రాజకీయ నాయకుడి ఇంటిపై దాడి చేసి ఆ రోజులలోనే 100 కోట్ల రూపాయల విలువైన డబ్బు, బంగారం, వెండిని సీజ్ చేసిన అధికారి కథను ‘రెయిడ్’లో చూడొచ్చు. అజయ్ దేవ్‌గణ్ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిగా నటించాడు. ప్రాణాలకు, ఉద్యోగానికి ప్రమాదం అని తెలిసినా దాడి నిర్వహించిన ఆ అధికారి కూడా నిజమైన దేశభక్తుడే కదా.
రాజీ (2018)
పురుషులే కాదు ఎందరో స్త్రీలు కూడా దేశం కోసం త్యాగాలు చేశారు. 1971 నాటి పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆ దేశ రహస్యాలు కనుగొనేందుకు అక్కడ అధికారి భార్యగా వెళ్లిన ఒక భారతీయ ముస్లిం యువతి ఎటువంటి సవాళ్లను ఎదుర్కొందో చూపిన కథ ‘రాజీ’. భార్యగా ఒకవైపు, భారతీయురాలిగా ఒకవైపు, పాకిస్తాన్ కోడలిగా ఒకవైపు నలిగిపోతూ దేశం కోసం తన ధర్మాన్ని నిర్వర్తించిన యువతిగా ఆలియా భట్ నటించి హర్షధ్వానాలు అందుకుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా వచ్చిన ఒక నవలను ఈ సినిమా కోసం ఉపయోగించుకున్నారు. కరణ్ జొహర్ 35 కోట్లతో నిర్మిస్తే ప్రజలు 195 కోట్లు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment