‘వజ్రకాయ’ ‘లీ’ ‘సాహెబా’ చిత్రాలతో కన్నడ ప్రేక్షకులకు దగ్గరైన నభా నటేష్... ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసుకుంటుంది. ‘నన్ను దోచుకుందువటే’ అనిపించేస్తుంది. ‘నటన నా జీవన విధానం’ అంటున్న నటేష్ గురించి కొన్ని విషయాలు...
ఆ గాలి ఆ నేల...
చిన్నప్పటి నుంచే ఆటపాటల్లోనే కాదు చదువులోనూ శభాష్ అనిపించుకునేది నభా నటేష్. ఆమె స్వస్థలం కర్టాటకలోని శృంగేరి. అక్కడ ‘కళల దేవత’ శారదాంబ కొలువై ఉన్నారు. ఈ నేల గాలిసోకడం వల్ల కావచ్చు...తనకు సహజంగానే కళల పట్ల ఆసక్తి పెరిగిందంటోంది నటేష్. అది ఏ భాష అయినా సరే సినిమాలు చూడటం అంటే విపరీతమైన ఇష్టం. అయితే తాను నటి కావాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు.
అదుగో కాదు ఇదిగో
ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్‌లోకి వచ్చింది. యాక్టింగ్ కోర్స్ చేసింది. నాటకాల్లో నటించింది. ఈ క్రమంలోనే నటనపై ప్రత్యేక ఆసక్తి పెరిగింది. ఇదే ఆమెను సినిమాల్లోకి తీసుకువచ్చింది. కన్నడ సినిమా ‘వజ్రకాయ’ నటేష్ తొలిచిత్రం. శివరాజ్‌కుమార్ సరసన నటించింది. ఈ సినిమా తరువాత కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చినప్పటికీ తొందరపడలేదు. తెలుగులో నటేష్ తొలిచిత్రం ‘అదుగో’. ఈ సినిమా విడుదలకు ముందే ‘ఇదిగో’ అంటూ రెండో చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ విడుదలైంది.
ఎందుకంటే...
నటేష్ భోజన ప్రేమికురాలు. వర్కవుట్‌లు అంటే ఇష్టమేగానీ ‘క్రాష్ డైట్’ అంటే అస్సలు ఇష్టం ఉండదు. తాను డైట్‌లో ఉన్నప్పుడల్లా ఇంట్లో వాళ్లు కూడా ఉండాల్సిందేనట. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటారా...సింపుల్! ఇంట్లో రుచికరమైన వంటలేవీ వండరు. కాబట్టి టెంప్ట్ అయ్యే ఛాన్సే లేదు కదా!
బీడీలు తాగింది!
తాను చేసే పాత్రను పండించడానికి ఎంతైనా కష్టపడతానంటుంది నటేష్. ఒక సినిమా కోసమైతే బీడీలు తాగడం కూడా నేర్చుకుంది. పొగాకు వాసనకు భోజనం కూడా సరిగ్గా చేసేది కాదట. హార్స్‌రైడింగ్ కూడా అలవోకగా నేర్చేసుకుంది. బీడీలు తాగాల్సి వచ్చినా, బుల్లెట్ రైడింగ్ చేయాల్సి వచ్చినా...అదంతా పాత్ర కోసమే అంటుంది నటేష్. బియ్యపు గింజ మీద లాగే ‘మంచి పాత్ర’ మీద కూడా పేరు రాసి ఉంటుందనే నమ్మకం నటేష్‌లో ఉంది.
బ్రో!
కాలేజీరోజుల్లో ‘టామ్ బాయ్’లా ఉండేది. తన ఫ్రెండ్స్‌గ్యాంగ్‌లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఉండేవాళ్లు. అబ్బాయిలు నటేష్‌ను ‘బ్రో’ అని పిలిచేవాళ్లట.
ఎప్పుడైనా ఒకసారి కాలేజీ రోజుల్లోకి వెళితే అబ్బాయిలెవరూ తనకు ప్రపోజ్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంటుందట! ఇంతకీ ఈ అమ్మడికి ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం? కాస్త సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే చాలునట!
Comments
Please login to add a commentAdd a comment