
మగాడి శాడిజానికి మగువ ఈసడింపు ఇది కథ కాదు
నాటి సినిమా
ఆమెకు తల్లి లేదు.
తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు.
బొంబాయిలో పెళ్లి చేసుకున్న ఒక మోసగాడు నడిరోడ్డు మీద వదిలిపెట్టాడు.
గతంలో ప్రేమించినవాడు మళ్లీ చేరువ అవుతాడనుకుంటే అదీ జరగలేదు.
తనను ఇష్టపడే మరొకడు ధైర్యం చేసి ఆ మాట చెప్పడు.
ముగ్గురు మగవాళ్లు – ఒక స్త్రీ.
అప్పుడే ఆమెకు అద్భుతమైన సపోర్టు దొరికింది.
కొడుకు దుర్మార్గం తెలుసుకున్న అత్తగారు కోడలికి సపోర్టుగా నిలిచి ‘మెడలో ఆ తాళిబొట్టు ఎందుకమ్మా... తీసి పారెయ్’ అంటుంది.
ఇన్ని ఘటనలు ఎక్కడా జరగవు.
అందుకే ఇది కథ కాదు.
కూ... ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్... రైలు బయలుదేరింది. జననమనే మొదలు నుంచి మరణమనే గమ్యం వరకు ప్రయాణం. మధ్యలో ఎన్నెన్ని స్టేషన్లు. ఎన్నెన్ని అనుభవాలు. ఎన్నెన్ని ధైర్యాలు. ఎన్నెన్ని దుఃఖాలు. వీటన్నింటినీ పాస్ చేసుకుంటూ వెళ్లాలి. కాని స్త్రీ విషయంలో అలా కాదు. అక్కడ డ్రైవర్ మగవాడు. గార్డ్ మగవాడు. స్టేషన్ మాస్టర్ మగవాడు. టికెట్ కౌంటర్‌లో కూర్చునేది మగవాడు. ట్రైన్ ఎక్కించేది దించేది కూడా మగవాడే. ఆమె జీవితానికి అతడే శాసనకర్త. అతడు ఏడిపిస్తే ఆమె ఏడ్వాలి. నవ్వడానికి అనుమతినిస్తే నవ్వాలి. ఎంత దారుణం ఇది. కాని– ఈ కథలోని జయసుధ అలా కాదు. ఆమె నిబ్బరం సామాన్యమైనది కాదు. మగాడిలోని జంతువుకు ఆమె ధిక్కరింపు ఒక చావుదెబ్బ. ఆమె చిర్నవ్వు– అతడి ముఖంపై కాండ్రించి ఊసిన ఉమ్ము.
ఫస్ట్ స్టేషన్:
‘చావే అన్నింటికీ పరిష్కారమైతే నేను ఇప్పటికి ఎన్నిసార్లు చనిపోవాలో’ అంటుంది జయసుధ (పాత్ర పేరు సుహాసిని) ఈ సినిమా ప్రారంభమైన వెంటనే రైలు ప్రయాణంలో. ఆమె ముంబై నుంచి మద్రాసుకు ఉద్యోగం ట్రాన్స్‌ఫర్ మీద వెళుతూ ఉంటుంది. కొద్ది పాటి లగేజ్. తోడుగా ఏడాది కొడుకు. ఒంటరి స్త్రీ. సాటి ప్రయాణికులకు, ప్రేక్షకులకు కూడా కుతూహలం. ఈమె కథ ఏమిటి అని. కాని ఆ కథ తెలుసుకుంటే ఇలా కూడా కథ ఉంటుందా... ఇది కథ కాదు... మగవాడి దుర్మార్గం అని అనుకుంటారు. జయసుధ క్లాసికల్ డాన్సర్. తనలాగే మంచి కళాకారుడు, ఫ్లూటిస్ట్ అయిన శరత్‌బాబు (పాత్ర పేరు భరణి)ని ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కాని ఇంతలో తండ్రికి బొంబాయి ట్రాన్స్‌ఫర్ కావడంతో జయసుధ అక్కడికి వెళ్లిపోతుంది.
శరత్‌బాబుని పెళ్లి చేసుకోవడానికి ఆమె రాసిన ఉత్తరాలు అతడికి అందవు. ఇంతలో బొంబాయిలోనే పెద్ద ఉద్యోగి అయిన చిరంజీవి (పాత్ర పేరు సుగుణాకర్‌రావు) ఆ కుటుంబానికి పరిచయం అవుతాడు. జయసుధను పెళ్లి చేసుకుంటానంటాడు. జయసుధ అమాయకంగా, నిజాయితీగా తాను ఇంకొకరిని ప్రేమించానని, ఆఖరు ఉత్తరం రాసి చూస్తానని అతడు కనుక స్పందించకపోతే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. చిరంజీవి ఆమె నిజాయితీని మెచ్చుకుంటాడు. చివరి ఉత్తరానికి కూడా శరత్‌బాబు నుంచి స్పందన రాదు. జయసుధ, చిరంజీవిల పెళ్లి జరిగిపోతుంది.
ఫస్ట్ జోల్ట్: జయసుధ శరత్‌బాబుని మర్చిపోయింది. చిరంజీవిని మనస్ఫూర్తిగా స్వీకరించింది. అతడు మాత్రం ఆమెను ఎంతో క్రియేటివ్‌గా హింసించడం మొదలుపెట్టాడు. ఆమె మంచి మూడ్‌లో ఉండగా ‘ఇప్పుడు నాకెలా ఉందో తెలుసా. నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకోవాలని ఉంది. ఎంత గట్టిగా అంటే నీ మాజీ ప్రియుడు గుర్తుకు వచ్చేంత గట్టిగా’ అని అంటూ ఉంటాడు. ఇంట్లో ధూపం వేస్తే ఎవరైనా మెచ్చుకుంటారు. అతడు మాత్రం ఏమిటి ఈ దరిద్రం అని ఆ ధూపంలో నీళ్లు పోస్తాడు. ఎంతో ఆదరంగా వంట చేసి వడ్డిస్తే ‘ఇది వంట కాదు పెంట’ అని ఈసడించుకుంటాడు. సుహాసిని ముఖాన్నే డార్ట్ బోర్డ్‌గా చేసి చుట్టూ డార్ట్స్ విసురుతూ ఆమెను భయభ్రాంతం చేస్తుంటాడు. బోర్ కొడితే సిగరెట్టు కాల్చి ఆమె ఒంటి మీద వాతలు పెడుతుంటాడు. అది పెళ్లి ప్రయాణం కాదు పైసాచిక ప్రయాణం.
యాక్సిడెంట్: కొడుకు పుట్టాడు. కాని ఆ పిల్లవాణ్ణి చూసినా అతడికి ఈసడింపే. ఎత్తుకోడు. ముద్దాడడు. చివరకు అనకూడని మాట కూడా అనేశాడు. ‘ఒకవైపు నుంచి చూస్తే నాలా ఉన్నాడు. ఇంకో వైపు నుంచి చూస్తే ఇంకోలా ఉన్నాడు’ అంటాడు. జయసుధ ఆ మాటకు కదిలిపోతుంది. అతణ్ణి చంపేద్దామన్నంత కోపం వస్తుంది. ఆ కోపం చూసి అతడు ‘ఏం... గుడ్లురుముతున్నావ్. విడాకులు ఇచ్చి పారేయమంటావా?’ అంటాడు. విడాకులు అతడి దృష్టిలో స్త్రీకి శిక్ష. కాని ఆమె మాత్రం ‘ఇవ్వు. స్త్రీకి దానికి మించిన రక్షణ లేదు’ అని నిబ్బరంగా విడాకులను స్వీకరిస్తుంది. బిడ్డతో సహా బయటపడుతుంది. ఒక మజిలీ పూర్తయ్యింది. రెండో మజిలీలోకి వెళ్లాలి.
పక్క కంపార్ట్‌మెంట్: జయసుధ మద్రాస్ చేరుకుంటుంది. ఒక ఇంట్లో దిగుతుంది. ఏ ఇంట్లో దిగుతుందో ఆ ఇంటి పక్కనే శరత్‌బాబు ఉంటాడు. ఒకప్పటి శరత్‌బాబు. తను ప్రేమించిన శరత్‌బాబు. జయసుధకు అతణ్ణి చూసి ఎంతో ఓదార్పుగా అనిపిస్తుంది. అతడు అవివాహితుడిగా ఉంటాడు. ఆమె ఉత్తరాలు అందకపోవడం వల్లనే ఆమెను గతంలో పెళ్లి చేసుకోలేకపోయానని చెబుతాడు. వాళ్లిద్దరూ మళ్లీ స్నేహితులవుతారు. జయసుధ మనసులో ఎన్నో ఆశలు. మళ్లీ జీవితం బాగుంటుందని... బాగుపడుతుందని.
ట్రైన్‌లో పాటగాడు: ఏ రైలు ప్రయాణంలో అయినా ఎవరో ఒక పాటగాడు తగిలి నాలుగు పాటలు పాడి మనసు రంజింప చేసి చిల్లర పట్టుకుపోతుంటాడు. ఈ ప్రయాణంలో కూడా ఒక పాటగాడు ఉన్నాడు. పేరు కమలహాసన్ (పాత్ర పేరు జనార్థన్). మలయాళీ. జయసుధ ఆఫీస్‌లో కొలీగ్. ఆమెకు అతడే ఇల్లు చూపిస్తాడు. ఆమె పనిలో సాయపడుతుంటాడు. ఆమెను ఎంతో ఆదరువుగా ఉంటూ మూగగా ఆరాధిస్తుంటాడు. అతడికి వెంట్రిలాక్విజమ్ తెలుసు. ‘జూనియర్’ అనే డాల్‌ను అడ్డం పెట్టుకుని తన మనసులోని మాట జయసుధకు చేరవేస్తుంటాడు. కాని ఆమె దానిని ఒక ఆట అనుకుంటుందే తప్ప సీరియస్‌గా తీసుకోదు.
దేవుడు పంపిన కో పాసింజర్: ఈ కథలో ఒక ముఖ్యమైన కో పాసింజర్ ఉంది. ఆమె సుగుణాకర్‌రావు తల్లి (నటి లీలావతి). మద్రాసులోనే ఉంటుంటుంది. బొంబాయిలో ఉన్న కొడుకు తనకు ఏ మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకుని బిడ్డను కనడమే కాకుండా కోడలిని హింసించి, విడాకులిచ్చి తరిమేయడం తెలుసుకుని ఆమె విలవిలలాడిపోతుంది. ఇంత నీఛమైన కొడుకుతో ఉండటం కంటే దేవత లాంటి కోడలితోనే ఉండటం మేలని ఆమెకు సేవ చేయడమే కొడుకు చేసిన పాపానికి విరుగుడు అని భావించి మారు పేరుతో కోడలి దగ్గర పని మనిషిగా చేరుతుంది. ఆమె చేరినప్పటి నుంచి సుహాసినికి ఎంతో బలం. ఆమె వల్లే తను తిరిగి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ధైర్యం తెచ్చుకుంటుంది.
చైన్ లాగిన పాత నిందితుడు
అంతా సిద్ధమైంది. భరణి, సుహాసినీల పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫలానా తేదీన రిజిస్టర్డ్ మేరేజ్. కాని ఇంతలో మాజీ భర్త చిరంజీవి ఊడిపడతాడు. తనను వదిలిపెట్టిన జయసుధ సుఖంగా రెండో పెళ్లి చేసుకోబోతోందని తెలిసి రగిలిపోతాడు. ఆమె ఆనందాన్ని ఎలాగైనా భగ్నం చేయడానికి మేక వన్నె పులిలా వేషం మారుస్తాడు. తాను మారిపోయాననీ తిరిగి ఏలుకుంటాననీ జయసుధకు కబురు పెడతాడు. అంతేకాదు శరత్‌బాబు మనసు మార్చి, నువ్వు పెళ్లి చేసుకుంటే తప్ప ఆమె నాతో తిరిగి కాపురానికి రాదు అని చెప్పి, అతడికి ఇది వరకే పరిచయం ఉన్న మరో అమ్మాయి (సరిత)తో నిశ్చితార్థం చేస్తాడు. ఇదంతా ఎందుకు? ‘జయసుధ కళ్లల్లో రెండు కన్నీటి బొట్లు చూడటానికి’. ఇప్పుడు జయసుధ అన్ని విధాలుగా అన్యాయమైంది. శరత్‌బాబుకి దూరమైంది. మాజీ భర్త మోసానికి మరోసారి బలైంది. అయినప్పటికీ ఆమె ఏడ్వదు. ఏడుపు ఎందుకైనా ఏడ్వవచ్చు కాని మగవాడి దాష్టికానికి మాత్రం కాదు అని ఆమె అస్సలు ఏడ్వదు. ప్రయాణంలో కొన్ని మజిలీలు విఫలమవ్వచ్చు. కాని జీవితం చాలా ఉంటుంది. ఓటమి అంగీకరించ కుండా మరణాన్ని శరణు కోరకుండా ముందుకు సాగడమే పని అని ఆమె క్లయిమాక్స్‌లో మరో ఊరికి ట్రాన్స్‌ఫర్ చేయించుకుని బయలుదేరుతుంది. కొద్దిపాటి సామాను, కొడుకు, ఒంటరి స్త్రీ.
కాని ఈసారి ఆమెకు ఒక తోడు ఉంది. వేరెవరో కాదు– అత్తగారు. ‘నేనూ నీతోనే వస్తానమ్మా. నీతోనే ఉండిపోతానమ్మా’ అని ఆమె అంటుంది. ‘స్త్రీకి స్త్రీ శత్రువు’ అనేది మగాడి మాట. ఇక్కడ మాత్రం ‘స్త్రీకి స్త్రీయే తోడు’ అంటుంది జయసుధ. ఆ ఇద్దరు ఆడవాళ్లు మగవాళ్లు నిర్దేశించిన ప్రయాణాన్ని ధిక్కరించి తమ ప్రయాణాన్ని తాము మొదలుపెడతారు. స్త్రీల అంతులేని కథ కొనసాగుతూనే ఉంది. అప్పటికీ ఇప్పటికీ... బహుశా ఎప్పటికీ.
కె.బాలచందర్ స్త్రీవాద కథ
ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘పెళ్లయిన ఆడదానికి ఇల్లు దొరకాలంటే ఆమెకు మొగడన్నా ఉండాలి. లేదా ఆమె వితంతువు అయినా అయి ఉండాలి’ అని. విడాకులు పొందిన ఒంటరి స్త్రీకి ఇల్లు దొరకదు అని ఆ డైలాగ్‌కు అర్థం. ఈ సినిమా 1979లో వచ్చింది. ఆ రోజుల్లో సమాజం అలా ఉండేది అంటే మరి ఈ రోజుల్లో మారిందా? విడాకులు పొందిన ఒంటరి స్త్రీలకు ఇవాళైనా ఇల్లు దొరుకుతూ ఉందా? ఇది మగ సమాజం. మగతోడు ఉంటేనే స్త్రీకి విలువ ఇచ్చే సమాజం. అలా అక్కర్లేదు అని చెప్పడానికి కె.బాలచందర్ ఈ సినిమా తీశాడు. మగవాడి నుంచి విముక్తమై కూడా స్త్రీ బతకగలదు, బిడ్డల్ని సాకగలదు, ధైర్యంగా తన కాళ్ల మీద తాను నిలబడగలదు అని ఆయన ఈ సినిమా ద్వారా చెప్పాడు. అందుకే బాలచందర్ తీసిన సినిమాల్లో స్త్రీవాద స్టేట్‌మెంట్ ఇచ్చిన సినిమాగా ఇది గుర్తింపు పొందింది. ‘అంతులేని కథ’ తర్వాత ఆయన తీసిన మరో శక్తివంతమైన సినిమా ఇది.
హిట్ సాంగ్స్
బాలచందర్, ఎం.ఎస్.విశ్వనాథన్ కాంబినేషన్ అంటే పాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ఆత్రేయ రచన అంటే చెప్పే పనే లేదు. ఇందులో పాటలు హిట్. సరిగమలు గలగలలు ∙జోలపాట పాడి ఊయలూపనా గాలికదుపు లేదు కడలికంతు లేదు జూనియర్... ఇటు అటు కాని హృదయం తోటి... ఇప్పటికీ ఈ పాటలు రేడియోలో మోగుతూనే ఉన్నాయి. ‘గాలికదుపు లేదు’ పాటలో ‘గంగ వెల్లువ కమండలంలో ఇమిడేనా ఈ ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేనా’ అనడం ఆత్రేయకే చెల్లు. అలాగే ఈ సినిమాలో గణేశ్‌పాత్రో రాసిన డైలాగ్స్‌కూడా పెద్ద హిట్.
ఇది జీవితం
ఈ సినిమాలో జయసుధ జీవితంలోకి ముగ్గురు వ్యక్తులు వస్తారు. ఎవరైతే ఆమె జీవితాన్ని బాగు చేయడో అతనే జీవిత భాగస్వామి అవుతాడు. ఎవరైతే ఆమెకు అండగా ఉండాలనుకుంటారో వాళ్లు దగ్గర కాలేరు. నిజ జీవితంలో అలాంటి భర్తలూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులూ ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులూ ఆమెను వేరే దృష్టి కోణంతో చూడరు. వారి మధ్య అనుబంధం చాలా హుందాగా ఉంటుంది. బాలచందర్‌గారు గ్రేట్ డైరెక్టర్. మామూలుగా పెద్ద డైరెక్టర్ల గురించి ఒక ఒపీనియన్ ఉంటుంది. వాళ్లు యాక్ట్ చేసి చూపిస్తారని, ఆర్టిస్టులు అలాగే చేయాలని. కానీ, బాలచందర్‌గారు సీన్ చెప్పి మేం ఎలా నటిస్తున్నామో చూసేవారు. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా మా నటన ఉంటే ఓకే అనేవారు. ‘ఇది కథ కాదు’ కథ కాదు.. జీవితం. అందుకే అందరి మనసులనూ తాకింది.
– శరత్‌బాబు, ‘భరణి’ పాత్రధారి
చిరంజీవి నెగటివ్ రోల్
‘ఇది కథ కాదు’ తమిళంలో మొదట ‘అవర్‌గళ్’గా నిర్మితమైంది. బాలచందర్ ఇందులో ముఖ్యపాత్రల్ని సుజాత, రజనీకాంత్, కమలహాసన్‌కు ఇచ్చాడు. తెలుగులో సుజాత పాత్ర జయసుధకు దక్కింది. రజనీకాంత్ పాత్ర చిరంజీవికి వచ్చింది. తమిళంలో రజనీకాంత్ వేసిన నెగటివ్ పాత్రకు చాలా పేరు వచ్చింది. అయితే ఆ ప్రభావంలో పడకుండా చిరంజీవి సొంతగా తన ధోరణిలో చాలా బాగా పాత్రను పండించడం మనం చూస్తాం. డైలాగ్ విరుపులోకాని, ఈజ్‌లో కాని, బాడీ లాంగ్వేజ్‌లో కాని చిరంజీవి చూపిన కన్విక్షన్ సామాన్యం కాదు. చిత్రమేమిటంటే ఈ సినిమాలో వీరిని భార్యాభర్తలుగా యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ ఆ తర్వాతి కాలంలో ఈ జోడీ పట్ల మక్కువ చూపలేదు. చిరంజీవి, జయసుధ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలు అతి తక్కువ. విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘మగధీరుడు’ (1986) సినిమాలో వీరిద్దరు జోడీగా వేస్తే అది ఫ్లాప్ అయ్యింది. ఆతర్వాత చిరంజీవి పక్కన జయసుధను పెట్టే సాహసం ఎవరూ చేయలేదు.
– కె