మట్టి వాసనలో ఒక మాధుర్యం ఉంటుంది. గాలిలో.. ఆకుల సవ్వడిలో.. రాలే చినుకులో... ప్రకృతిలోని ప్రతి ధ్వనిలో.. వినిపించే సహజమైన మ్యూజిక్ అది. ఇప్పుడు ఇదే మట్టిలోంచి... మంత్రముగ్ధం చేసే ఒక పాట వినిపిస్తోంది. మట్టిలోంచి అధాటుగా మొలకెత్తిన ఆ పాట గుండెకు హత్తుకుంటోంది. నిన్న.. ‘బేబీ’.. నేడు శాంతాబాబు మరికొన్ని స..రి..గ..మ..ల మధురిమలు.
బేబీ
ఇటీవలి సెన్సేషన్ బేబీ. తూర్పుగోదావరి జిల్లా వడిసలేరుకి చెందిన బేబీ, మొదట తన ఇంటి పక్కనే ఉంటున్న రాణి అనే అమ్మాయి పాడిన పాటలో దోషాలు చెప్పింది. అక్కడే నీళ్ల బకెట్ పెట్టుకుని, ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ అంటూ పాట మొత్తం పాడేసింది. ఆ పాటను అక్కడే ఉన్న వీరబాబు అనే స్థానిక గాయకుడు తన ఫోన్‌లో షూట్ చేసి, యూ ట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ పాట వైరల్ అయ్యింది. వెంటనే బేబీని ‘సాక్షి’ పలకరించింది. సాక్షిలో బేబీతో ఇచ్చిన ఇంటర్వ్యూ బేబీ జీవితాన్ని మార్చేసింది. సంగీత దర్శకులు కోటి ‘బోల్ బేబీ బోల్’లో పాడిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ బేబీని స్వయంగా కలవాలనుకున్నారు. అంతే. తనంత తానుగా బేబీని ఇంటికి పిలిపించుకున్నారు చిరంజీవి. తను స్వరపరచిన ‘ఓ చెలియా నా ప్రియ చెలియా’ పాట పాడిన బేబీని తాను చూడాలని ఎ.ఆర్.రెహమాన్ సైతం అన్నారని ఆమె చెబుతున్నారు. వాయిస్ టెస్ట్‌కి చెన్నై రమ్మని కూడా రెహమాన్ అన్నారట. ఇక ఆర్‌పి పట్నాయక్ కూడా ఆమెకు అవకాశం ఇస్తానన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా బేబీ నిన్న జానకిని కూడా కలిశారు.
వెంకట లక్ష్మి
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో చిన్న చిల్లరకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు వెంకటలక్ష్షి్మ. దానికి తోడుగా బుర్రకథలు కూడా చెప్పేవారు. ఆ వీడియోలను యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేసేవారు. అలా దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దృష్టిలో పడ్డారు. ‘రంగస్థలం’ సినిమాలో ‘జిల్ జిల్ జిల్ జిగేల్ రాణి..’కి పాడటానికి ఓ డిఫరెంట్ వాయిస్ కోసం ఆ ఇద్దరూ వెతుకుతున్న సమయంలో వెంకటలక్ష్షి్మ బుర్రక£ý వీడియోను యూట్యూబ్‌లో చూశారు. ఆ పాటకు ఆమె వాయిస్ అయితే బావుంటుందని భావించారు. పాట రికార్డ్ చేయడం కోసం వెంకటలక్ష్షి్మకి విశాఖ నుంచి చెన్నైకు టిక్కెట్ వేశారు చిత్రబృందం. చెన్నైలో రెండు రోజుల పాటు రికార్డ్ చేసిన ఈ పాట రెండు తెలుగురాష్ట్రాలను ఎంత ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. వెంకటలక్ష్షి్మకి బోల్డంత పాపులార్టీ వచ్చేసింది.
శివనాగులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జానపదాల ద్వారా శివ నాగులు ఫేమస్. ‘రేలారే రేలా..’ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత ఐడియా సూపర్ సింగర్ కార్యక్రమంలో ఒక సింగర్స్ గ్రూప్‌కు మెంటర్‌గా ఉండేవారు శివనాగులు. చంద్రబోస్ ఆ షో జడ్జిగా వ్యవహరించేవారు. అలా శివనాగులుకు చంద్రబోస్‌తో పరిచయం ఏర్పడింది. కొత్త కొత్త వాయిస్‌లను, వాళ్లు పాడే వీడియోలన్నీ దేవిశ్రీప్రసాద్‌కు చూపించడం చంద్రబోస్ అలవాటు. అలా సూపర్ సింగర్ సమయంలో శివనాగులు గొంతును దేవిశ్రీ ప్రసాద్‌కు వినిపించారు. ‘రంగస్థలం’ సినిమాకి ఓ ఫోక్ వాయిస్ కోసం వెతుకుతుంటే శివ నాగులు వాయిస్ నచ్చడంతో, ‘ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా...’ పాడే అవకాశం లభించింది. ఆ పాట సూపర్ హిట్. ఈ సినిమా తర్వాత నాలుగైదు సినిమాల్లో పాడే అవశాలు వచ్చాయి. ‘సిల్లీ ఫెల్లోస్’ సినిమాలో పాడే అవకాశం వచ్చినప్పటికీ ఆ సమయంలో అమెరికా వెళ్లడంతో ఛాన్స్ మిస్ అయిందట. రీసెంట్‌గా ‘యాత్ర’ సినిమాలో పాడిన పాటకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తారట ఆయన. ఆ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాశారు.
పెంచల్‌దాస్
‘దారిచూడు దుమ్మూ చూడు మామ.. దున్నపోతుల బైరే చూడు...’ పాట తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలోని ఆ పాట విడుదలయ్యాక అందరి మదిలో ఒక్కటే ప్రశ్న.. ఆ పాట రాసిందెవరు? అంత చక్కగా పాడిందెవరు?. జానపదం పాటని అంత అద్భుతంగా రాసి, మహాద్భుతంగా పాడారు పెంచల్‌దాస్. ఆ పాట విడుదల వరకూ ఆయనెవరో తెలియదు. కడప జిల్లా చిట్వేలి మండలం దేవమాచుపల్లికి చెందిన పుట్టా పెంచల్‌దాస్‌కి రంగస్థల కళాకారుడిగా, బాతిక్ చిత్రకారుడిగా పేరుంది. పెనగలూరు మండలం చక్రంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తుండే ఆయనకి ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో తొలి అవకాశం ఎలా వచ్చింది? తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఆర్ట్స్ ఆడిటోరియంలో జరిగే రచయితల సభలో పాటలు పాడినప్పుడు దర్శకుడు మేర్లపాక గాంధీ తండ్రి మురళీ దృష్టిలో పడ్డారు పెంచల్‌దాస్. సినిమా పాటలకు అవకాశం ఇప్పిస్తానని మేర్లపాక గాంధీకి పరిచయం చేశారు. దాస్ పాట విని, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాకి అవకాశం ఇచ్చారు గాంధీ. కానీ, అనారోగ్య కారణాల వల్ల పాడలేకపోయారు. ఆ తర్వాత ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేస్తున్నప్పుడు 20నిమిషాల్లో పాట రాసి, పాడతావా అని పెంచల్‌దాస్‌ని మేర్లపాక గాంధీ అడిగితే, ‘దారిచూడు దుమ్మూచూడు మామ..’ పాట రాశారు. ఆ పాట రెండు లైన్లు విని ఓకే చేసి దాస్‌ని మద్రాసుకు తీసుకెళ్లారు. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళకు గొ నచ్చడంతో ‘దారి చూడు..’కి అవకాశం ఇచ్చారు. అలా పెంచల్‌దాస్‌కి సినిమా దారిలో తొలి అడుగు పడింది.
చంద్రలేఖ
చంద్రలేఖ ప్రస్తుతం మలయాళంలో చాలా బిజీగా ఉన్న గాయని. కేరళలోని ఆదూర్‌కి చెందిన చంద్రలేఖ ఒక సాధారణ గృహిణి. ఏ మాత్రం సంగీత పరిజ్ఞానం లేని అతి సామాన్యురాలు. ఒకసారి తన రెండు సంవత్సరాల బాబుని ఎత్తుకుని, ‘రాజహంసమే’ పాట తన్మయంగా పాడింది. అలా పాడుతున్నప్పుడు బంధువుల అబ్బాయి ఒకరు ఆమె పాటను సెల్ ఫోన్‌లో రికార్డు చేసి, యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆ పాట వైరల్ అయ్యింది. ఆమె గొప్పదనాన్ని నెటిజన్లు గుర్తించారు. ఎంతటి మధురగళం అనుకున్నారు. ఆమె పాటను యూ ట్యూబ్‌లో విరగబడి చూశారు. ఆమె సన్నిహితులకు మాత్రమే ఆమె పాడుతుందని తెలుసు. ఈ పాటతో మలయాళీలకు దగ్గర అయిపోయింది. బిజిపాల్, రతీష్ వేగా వంటి ప్రముఖులు కూడా ఆమెకు అవకాశం ఇచ్చారు. కిందటి సంవత్సరం ఆమెకు ‘అవలుక్కెన్న అలగియా ముగం’ చిత్రంలో ‘ఎన్నడ కన్నా’ అనే మొదటి తమిళ పాట పాడే అవకాశం వచ్చింది. ఈ పాటను వైరముత్తు రచించారు. డేవిడ్ షోన్ స్వరపరిచారు. ఇది జరిగి ఐదేళ్లు. పెద్ద పెద్ద సంగీత దర్శకుల నుంచి వచ్చిన అవకాశాలు వినియోగించుకుంది చంద్రలేఖ.
శాంతాబాబు
కాసరగోడ్ జిల్లా నీలేశ్వరం పంచాయతీ పరిధిలోని నవోదయపురం శాంతాబాబు స్వస్థలం. మేకులు తయారుచేసే ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తోంది. ఆమె భర్త కూడా కూలీనే. శాంతాబాబుకు ఒక కూతురు, కొడుకు. కూతురు పీజీ చదువుతోంది. కొడుకు ప్లంబర్. శాంతా పదవ తరగతి వరకు చదువుకుంది. రెండేళ్ల కిందట పూర్వవిద్యార్థుల సమ్మేళనం సందర్భంగా నజీమ్ అర్షద్ అనే గాయకుడి కచేరి పెట్టారు. బృందగానంలో శాంతాబాబూ కూడా గొంతు కలిపింది. ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు సమ్మేళనానికి హాజరైన కొందరు పూర్వ విద్యార్థులు. వైరల్ అయింది. ఆ తర్వాత శాంతాబాబుతో ఆల్బమ్స్ చేయడానికి చాలా మంది ముందుకొచ్చారు. అలా నాలుగు ఆల్బమ్స్‌లో పాడింది. అయితే మణి అప్‌లోడ్ చేసిన పాటను రీసెంట్‌గా మలయాళ నట, గాయక, దర్శకుడు నదీర్షా చూశాడు. శాంతాబాబు స్వరం ఆయనెంతగానో నచ్చింది. ఆమె ఆల్బమ్స్‌లో పాడినట్టుకూడా తెలుసుకొని వాళ్ల ద్వారా శాంతా ఫోన్ నంబర్ తీసుకుని ఆమెను సంప్రదించాడు. ‘‘నా సినిమాలో పాట పాడతారా?’’ అని అడిగాడు. ఆశ్చర్య పోవడం శాంతా వంతయింది. మొత్తానికి నదీర్షా విన్నపాన్ని మన్నించి ఆయన సినిమాలో పాడేందుకు ఒప్పుకుంది శాంతా. ఇప్పుడు ఆమె శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంటోంది.
వినసొంపుగా కొత్త గొంతులు
ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతోంది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ఇలాంటి కొత్త గొంతులతో సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కళకళలాడుతోంది. విషయం ఉన్నవాళ్లను ఎవరూ ఆపలేరు. ఏ మూల ఉన్నా వెలుగులోకి వస్తారు. కొత్తనీరు ఎప్పుడూ రుచిగా ఉన్నట్టే కొత్త గొంతులు కూడా వినసొంపుగా ఉంటాయి.
– సింహా, గాయకుడు
ముగ్గురు మాణిక్యాలు
‘రంగస్థలం’ సినిమాకి అన్ని పాటలూ నేనే రాశాను. నేను, దర్శకుడు సుకుమార్, సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ రెడీ అవ్వగానే.. ముఖ్యంగా రెండు పాటలకు ఇప్పటివరకూ పరిచయం లేని గొంతు, అది కూడా పల్లె గొంతుతో పాడిస్తే బాగుంటుందనుకున్నాం. అవి ‘జిల్ జిల్ జిల్ జిగేలురాణి...’, ‘ఆ గట్టునుంటావా నాగన్న..’. ఈ పాటలకు తగ్గ గొంతుని వెతకడం మొదలుపెట్టాం. ఏటూరి నాగారంకి చెందిన రేలా కుమార్‌ని, మహబూబ్‌నగర్‌కి చెందిన శివ నాగులుని సుకుమార్, దేవీకి పరిచయం చేశాను. ఈ ఇద్దరూ టీవీ షోస్‌కి పాడుతుంటారు. అలా వాళ్లు నాకు పరిచయమయ్యారు. ఈ ఇద్దరితో పాటు సుకుమార్‌గారు కూడా ఒక ఫీమేల్ వాయిస్‌ని గుర్తించారు. ఆమె గురించి వాకబు చేసి, పిలిపించాం. ఆమె విజయనగరం జిల్లాకి చెందిన వెంకటలక్ష్మి. ‘జిల్ జిల్ జిల్ జిల్ జిగేలురాణి..’ పాటలోని ఫీమేల్ వాయిస్ ఈమెదే. మేల్ వాయిస్ రేలా కుమార్‌ది. ‘ఆ గట్టునుంటావా..’ పాడినది శివనాగులు. ఈ ముగ్గురి వాయిస్‌లను టెస్ట్ చేసి, దేవి ఓకే అన్నారు. మామూలుగా మన మధ్య తిరుగుతున్నవారిని పరిచయం చేయడం కామన్. అయితే ఇలాంటి పాటలకు మట్టిలో మాణిక్యాల గొంతులు న్యాయం చేస్తాయి.
– చంద్రబోస్, సినీ గేయ రచయిత
Comments
Please login to add a commentAdd a comment