గేమ్ ఆఫ్ థ్రోన్స్ లీక్: ఇంటి దొంగల పనే!
ముంబై: అమెరికన్ ఫాంటసీ, యాక్షన్ సీరిస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లీక్ చేసినందుకుగానూ నలుగురు వ్యక్తులను ముంబై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాల్లో ప్రసారం అవుతున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ అంటే అభిమానులు పడిచచ్చిపోతారు. ఆరు సిరీస్‌లతో అలరించిన ఈ సీరియల్ తాజాగా ఏడో సిరీస్‌ను ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ నాలుగో ఎపిసోడ్‌ను అధికారికంగా ప్రసారం చేయకముందే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. పైరసీ సీడీలు కూడా మార్కెట్లోకి రావడం ఈ సీరిస్ అభిమానులను ఆశ్చర్యానికిలోను చేసింది.
ఎపిసోడ్ లీక్ కావడంపై స్థానికంగా ప్రసారం చేసే ముంబైకి చెందిన ఓ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హాట్‌స్టార్ కంపెనీకి వెండర్‌గా పనిచేసే ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీకి చెందిన ఉద్యోగులు అధికారిక అకౌంట్ల వివరాలను కొందరికి వెల్లడించి పైరసీకి పాల్పడినట్లు తెలుస్తోంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్7 ఇప్పటికే అభిమానులను కట్టిపడేస్తోంది.