
మా సార్ మనసు తంగమ్’ అని సూర్య అభిమానులు కాలరెగరేస్తున్నారు. అంటే.. మా సార్ మనసు బంగారం అని అర్థం. ఇంతకీ సూర్య సార్ అంతలా ఏం చేశారంటే... అభిమానుల కాళ్ల మీద పడ్డారు. వాటమ్మా వాటీజ్ దిస్సమ్మా... ఎక్కడైనా హీరోల కాళ్ల మీద అభిమానులు పడతారు కానీ, అభిమానుల కాళ్ల మీద హీరో పడతాడా? అంటున్నారా? పడ్డారండి. మరి.. సూర్య తంగమ్ కదా. ఈ హీరోగారు నటించిన ‘తానా సేంద కూట్టమ్’ (తెలుగులో ‘గ్యాంగ్’) ఇవాళ రిలీజ్ కాబోతోంది. చెన్నైలో సూర్య ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ వేడుకకు అభిమానులు హాజరయ్యారు. కొందరు ఫ్యాన్స్ వేదిక ఎక్కి సూర్య కాళ్ల మీద పడబోయారు. వెంటనే సూర్య వాళ్ల కాళ్లను టచ్ చేశారు. ఇది ఊహించని ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
సూర్య అలా ఎందుకు చేశారంటే... ఇక ఎప్పుడూ ఫ్యాన్స్ తన కాళ్ల మీద పడకూడదని. అదే విషయం వాళ్లతో అన్నారు. ఇటీవల ‘ఫ్యాన్స్ మీట్’లో రజనీకాంత్ కూడా ఇదే చెప్పారు. ‘‘దేవుడు, అమ్మానాన్నల కాళ్ల మీద పడాలి. అంతేకానీ డబ్బున్నవారనో, పేరున్నవారనో, ఫేమస్ అనో, అధికారం ఉన్నవారనో.. ఇతరుల కాళ్ల మీద పడకూడదు’’ అని రజనీ పేర్కొన్నారు. సూర్య కూడా అదే అన్నారు. కాకపోతే మరింత బలంగా తన మాటలు అభిమానుల మనసుల్లో నాటుకుపోవాలని తాను కూడా వాళ్ల కాళ్ల మీద పడ్డారు. ఫ్యాన్స్ కాళ్లను టచ్ చేయడం మాత్రమే కాదు.. వాళ్లతో కలసి డ్యాన్స్ కూడా చేశారు సూర్య. ఇప్పుడు చెప్పండి.. సూర్యని ఆయన అభిమానులు ‘తంగమ్’ అనొచ్చు కదా. పైగా సూర్య పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అందుకే ‘మా బాబు బంగారం’ అని ఫ్యాన్స్ చెప్పుకుంటుంటారు.
Comments
Please login to add a commentAdd a comment