
50, 60 కథలు విన్నాను కానీ..
తమిళసినిమా: తన అగరం ఫౌండేషన్ ద్వారా పలువురికి విద్యాదానం చేస్తున్న నటుడు సూర్య. హీరోగా ప్రముఖ స్థానంలో కొనసాగుతున్న ఈయన ఇప్పుడు నిర్మాతగానూ రాణించాలన్న నిర్ణయంతో 2డి ఎంటర్‌టెయిన్‌మెంట్స్ సంస్థను ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా తన భార్య ప్రధాన పాత్రలో నటించిన 36 వయదినిలే చిత్రాన్ని నిర్మించి విజయం సాధించారు. తాజాగా పాండిరాజ్ దర్శకత్వంలో పసంగ-2 చిత్రం, తాను హీరోగా మలయాళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో 24 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వీటిలో పసంగ-2 చిత్రం ఈనెల 27న తెరపైకి రానుంది. ఈ చిత్రం గురించి సూర్య మాట్లాడుతూ విద్య, బాలల ఇతివృత్తాలతో మంచి చిత్రాలు నిర్మించాలన్న ఉద్దేశంతో తన పిల్లలు దియా, దేవ్ పేర్లు కలిసే విధంగా 2డి ఎంటర్‌టెయిన్‌మెంట్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించానన్నారు. ఈ సంస్థలో చిత్రం చేయడానికి సుమారు 50, 60 కథలు విన్నా మంచి కథ అమరలేదన్నారు. అలాంటి సమయంలో దర్శకుడు పాండిరాజ్ ఒక సీడీ ఇచ్చి ఇలాంటి కథతో మీ సంస్థలో చిత్రం చేస్తే బాగుంటుందని అన్నారన్నారు. బాలల గురించి ఆయన రెండేళ్ళు పరిశోధన చేసి తయారు చేసిన కథ అదని తెలిపారు.
ఇలాంటి కథతో చిత్రం చేయాలన్నది తన ఉద్దేశం కావడంతో పసంగ-2 చిత్రాన్ని నిర్మించినట్లు వెల్లడించారు. ఇందులో పలువురు బాలబాలికలు ప్రధాన పాత్రలు పోషించారని చెప్పారు.తాను ఒక సాధారణ వ్యక్తిగా నటించినట్లు తెలిపారు. చిత్రం చూసిన ప్రేక్షకులు ఒక మంచి ప్రయోజనకరమైన అంశాన్ని గ్రహిస్తారని సూర్య పేర్కొన్నారు. అమలాపాల్, బింధుమాదవి ముఖ్యపాత్రల్ని పోషించిన పసంగ-2 చిత్రం ఈ నెల 27 తెరపైకి రానుంది. సూర్య హీరోగా నటిస్తున్న 24 చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్లను ఈ నెల 24న విడుదల చేయనున్నారు.