ఆ కాల్ ఎత్తితే.. అసభ్య వీడియోలు: నటి | Tejaswi Prakash Says Her WhatsApp Hacked | Sakshi
Sakshi News home page

ఆ వీడియో కాల్స్‌ ఎత్తవద్దు: నటి

Published Mon, Nov 4 2019 1:53 PM | Last Updated on Mon, Nov 4 2019 1:57 PM

Tejaswi Prakash Says Her WhatsApp Hacked - Sakshi

హిందీ బుల్లితెర నటి తేజస్వీ ప్రకాశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన ఫోన్‌ హ్యాకింగ్‌ బారిన పడటంతో.. ఆమె ఫోన్‌ నుంచి స్నేహితులకు అసభ్య వీడియో కాల్స్‌ వెళ్లాయి. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న తేజస్వీ దయచేసి ఎవరూ తన వాట్సాప్‌ నుంచి వచ్చే వీడియో కాల్స్‌ ఎత్తవద్దని తెలిపారు. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌తో ఆమె మాట్లాడుతూ... ‘ నేను నిన్న సీరియల్ షూటింగ్‌లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి నుంచి కాల్‌ వచ్చింది. ఫోన్‌ ఎత్తగానే అతడు అత్యంత అసభ్యంగా వికృత చర్యలకు పాల్పడుతూ కనిపించాడు. ఒక్కసారిగా అసహ్యం పుట్టింది. అప్పుడు నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు. అతడు నా ఫోన్‌ను హ్యాక్‌ చేసి నా స్నేహితులతో చాట్‌ చేసి వాళ్లకు కూడా ఇలాగే అసభ్య వీడియో కాల్స్‌ చేశాడు’ అని పేర్కొన్నారు.

ఈ విషయం గురించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న తేజస్వీ... తన తోటి నటీమణులకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. తన ఫోన్‌ నుంచి ఈ కాల్స్‌ వెళ్లడంతో వాళ్లు షాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు. తనేంటో పూర్తిగా తెలిసిన వాళ్లు కాబట్టి తనను తప్పుగా అర్థం చేసుకోలేదని .. అయితే ఈ ఘటన తననెంతో మానసిక వేదనకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని... హ్యాకర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా వెంటనే ఫిర్యాదు చేయలేకపోతున్నానని వెల్లడించారు. కాగా ‘స్వరాగిణీ’ సీరియల్‌లో రాగిణిగా నటించిన తేజస్వీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement