'బిగ్' బ్రదర్ ను ఆపగలరా? | The Jungle Book Crosses 150 Crore Mark In India | Sakshi
Sakshi News home page

'బిగ్' బ్రదర్ ను ఆపగలరా?

Published Fri, Apr 29 2016 10:39 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

'బిగ్'  బ్రదర్ ను ఆపగలరా?

'బిగ్' బ్రదర్ ను ఆపగలరా?

‘ది జంగిల్ బుక్’
 వసూళ్లు- ఇండియాలో ఇప్పటికే రూ. 150 కోట్లు దాటాయి. త్వరలో 200 కోట్లు దాటుతుందని అంచనా.
 ఇండియాలో ఇది15వ
 బిగ్గెస్ట్ గ్రాసర్

 
 షారుఖ్ ‘ఫ్యాన్’
 వసూళ్ళు-
 ఇండియాలో ఇప్పటికి రూ. 80 కోట్లే.

 
 నాగార్జున ‘ఊపిరి’
  తెలుగు, తమిళాల్లో కలిపి వరల్డ్ వైడ్ ఇప్పటికి రూ.
 50 కోట్ల పైగా షేర్

 
 పవన్ కల్యాణ్
 ‘సర్దార్ గబ్బర్‌సింగ్’
 వరల్డ్ వైడ్ ఇప్పటికి రూ. 50 కోట్ల పైగా షేర్

 
 విజయ్ పోలీస్ (తేరి)
 ఇప్పటికి సుమారు
 రూ. 5 కోట్లు

 
 ఇరవై ఏళ్ళ క్రితం ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా రిలీజైనప్పుడు అమెరికా అన్నయ్య చూసి ఇండియాలో ఉన్న తమ్ముడికి కథ చెప్పాడు. అప్పుడు తమ్ముడనుకున్నాడు- ‘అన్నయ్య ఎంత అదృష్టవంతుడు. మనకంటే ముందే మంచి మంచి సినిమాలు చూసేస్తున్నాడు’ అని. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. హాలీవుడ్ సినిమాలు వారం, పదిహేను రోజుల ముందే ఇండియాలో రిలీజవుతున్నాయి. అంటే తమ్ముడు సినిమా చూసేసి, ‘బిగ్ బ్రదర్’ అమెరికాకి కథ చెప్తున్నా డన్న మాట. ఇది చాలా గ్రేట్ అనుకొని ఇండియా వాళ్లమంతా చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడే ‘బిగ్’ ట్విస్ట్. ఇండియన్ బాక్సాఫీస్ మార్కెట్‌ను కొల్లగొట్టడానికే ఈ వ్యూహం అంతా. అది అమెరికా బాబూ... ఏమైనా దోచేస్తుంది.
 
 ఈ సమ్మర్‌లో ఇండియాలో అతి పెద్ద హిట్ సినిమా ఏంటి? బాలీవుడ్ బాద్‌షాగా పేరున్న షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫ్యాన్’? పోనీ, ఉత్తరాదిలోనూ రిలీజైన దక్షిణాది హీరో పవన్‌కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’? తమిళ ‘ఇళయ దళపతి’ (యూత్ స్టార్) విజయ్ నటించిన ‘తేరి’ (తెలుగులో ‘పోలీస్’)?
 
 ఇవేవీ కావు... ఈ సమ్మర్‌లో - ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది మొత్తం మీద - ఇప్పటి దాకా అతి పెద్ద హిట్ సినిమా ‘ది జంగిల్ బుక్’. ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళ, హిందీల్లో డబ్బింగై దేశవ్యాప్తంగా రిలీజైన ఈ హాలీవుడ్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విశేషం ఏమిటంటే - డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో కన్నా వారం రోజుల ముందే ఇండియాలోని జనం ముందుకు తీసుకురావడం!
 
 గత చరిత్ర చూస్తే - అమెరికాలో రిలీజైన కొద్ది వారాల తరువాత కానీ హాలీవుడ్ సినిమాలు భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు వచ్చేవి కావు. కానీ, అంతర్జాతీయ బాక్సాఫీస్ పెరిగిపోవడంతో స్టూడియోలు ఇప్పుడు రెండు వేర్వేరు రిలీజ్ డేట్ల వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా, చైనా లాంటి మార్కెట్లలో దీన్ని స్పష్టంగా అనుసరిస్తున్నాయి.
 
 కొన్నేళ్ళుగా భారతీయ మార్కెట్‌పై కన్ను
 అమెరికాలో కన్నా ముందే ఇండియాలో కోట్ల కొద్దీ వసూళ్ళను తాజా ‘ది జంగిల్ బుక్’ కొల్లగొట్టింది. అయితే, అమెరికాలో కన్నా ముందే ఇక్కడ హాలీవుడ్ సినిమా రిలీజ్ అవడం ఇదే తొలిసారి కాదు. గమనిస్తే, ఇలా మన దగ్గరే ముందర రిలీజవుతున్న హాలీవుడ్ చిత్రాల సంఖ్య కొన్నేళ్ళుగా పెరుగుతూ వస్తోంది. ‘ది ఎవెంజర్స్’ సిరీస్‌లో మొట్టమొదటి పార్ట్‌ను 2012లో డిస్నీ సంస్థ అమెరికాలో కన్నా ముందే ఇండియాలో రిలీజ్ చేసింది. 2011 చివరలో రిలీజైన ‘మిషన్ ఇంపాజిబుల్ - ఘోస్ట్ ప్రొటోకాల్’ సినిమా కోసమైతే హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ తొలిసారిగా ఇండియాకు వచ్చారు. ముంబయ్‌లో స్పెషల్ ప్రమోషనల్ ప్రీమియర్ వేస్తే, దాదాపు 1500 మంది ఫ్యాన్స్‌తో కలసి చూడడానికి క్రూజ్ ముంబయ్‌కి వచ్చారు. అమెరికాలో కన్నా వారం రోజుల ముందే ఇక్కడ ఆ సినిమా రిలీజైంది.
 
 ఆ మధ్య వార్నర్ బ్రదర్స్ వారి ‘హాబిట్ 3’, ‘జర్నీ2- ది మిస్టీరియస్ ఐలండ్’, డిస్నీ సంస్థ తీసిన ‘ఎవెంజర్స్ - ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’, ఇంకొద్దిగా వెనక్కి వెళితే ‘ట్రాన్స్‌ఫార్మర్స్ - డార్క్ ఆఫ్ ది మూన్’, ‘క్వాంటమ్ ఆఫ్ సొలేస్’, ఫాక్స్ స్టార్ వారి ‘క్రానికల్స్ ఆఫ్ నార్నియా - వాయేజ్ ఆఫ్ ది డాన్ ట్రీడర్’, యానిమేషన్ చిత్రం ‘రియో’ కూడా అమెరికా కన్నా ముందే భారత్‌కు వచ్చేశాయి! ‘ది ఎడ్వంచర్స్ ఆఫ్ టిన్‌టిన్ - ది సీక్రెట్ ఆఫ్ ది యూనికార్న్’ అయితే, అమెరికాలో కన్నా ఏకంగా ఆరు వారాల ముందు ఇక్కడ రిలీజైంది.
 
 
 మార్కెట్ లెక్కల్ని బట్టి మారుతున్న డేట్స్
 ఇండియాలో సినిమాకు వెళ్ళడమనేది కుటుంబం, స్నేహితులు - అంతా కలసి బయటకెళ్ళి విహారంలా జరుపుకొనే పండగ లాంటిది. అందుకే, పిల్లల పరీక్షలు, బాలీవుడ్ భారీ రిలీజ్‌లు, సెలవులెప్పుడున్నాయి, క్రికెట్ లాంటి ఆటల పోటీలు ఎప్పుడున్నాయి లాంటి మార్కెట్ లెక్కలు కూడా హాలీవుడ్ చిత్రాల రిలీజ్ డేట్స్‌ను మార్చేస్తున్నాయి. ‘ది జంగిల్ బుక్’ కథ ఇక్కడి ప్రేక్షకులకు సుపరిచితం. ఏప్రిల్ మొదటి వారానికల్లా పిల్లల పరీక్షలు అయిపోతాయి కాబట్టి, వేసవి సెలవుల్లో వీలైనన్ని ఎక్కువ రోజుల్ని సొమ్ము చేసుకోవాలని ‘జంగిల్ బుక్’ సినిమాను అమెరికాలో కన్నా ముందే ఇక్కడ రిలీజ్ చేసేశారు.
 
 రానున్న ‘ఇన్‌ఫెర్నో’ సినిమా రెండు వారాల ముందే ఇండియన్ ఆడియన్స్‌ను పలకరించనుంది. టామ్ హాంక్స్, ఇర్ఫాన్ ఖాన్‌లు నటిస్తుంటే, అకాడెమీ అవార్డ్ గెలిచిన దర్శకుడు రాన్ హోవర్డ్ తీస్తున్న ‘ఇన్‌ఫెర్నో’ అమెరికా (రిలీజ్ రానున్న అక్టోబర్ 28) కన్నా రెండు వారాల ముందే అక్టోబర్ 14న ఇండియాలో రిలీజవుతోంది. ఇర్ఫాన్ ఖాన్ భారతీయ సంతతి వాడు కావడం అందుకు ఒక కారణం. కాగా, దీపావళికి వస్తున్న భారీ బాలీవుడ్ చిత్రాలతో పోరును తప్పించుకోవడానికి ముందే ‘ఇన్‌ఫెర్నో’ను రిలీజ్ చేయాలనుకోవడం రెండో కారణం.
 అయితే, హాలీవుడ్ సినిమాలన్నిటికీ ఇదే మంత్రం పనిచేయదు. కేవలం నూటికి 5 నుంచి 10 సినిమాలు మాత్రమే ఇలా ఇక్కడ ముందుగా రిలీజవుతున్నాయి.
 
 అయితే, హాలీవుడ్‌కు ఆనందదాయకమైన విషయం ఏమిటంటే - జేమ్స్ కామెరాన్ ‘అవతార్’ ఒకప్పుడు భారత్‌లో రూ. 145 కోట్ల మేర మొత్తం వసూలు చేస్తే అదో పెద్ద విషయం. కానీ, ఇవాళ ఇండియాలో వంద కోట్ల మార్కు దాటే హాలీవుడ్ సినిమాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే రూ. 150 కోట్లు దాటేసిన ‘జంగిల్ బుక్’ తాజా అంచనాల ప్రకారం మనదేశంలోనే ఈజీగా 200 కోట్ల మైలురాయి దాటనుంది. మన దేశ సినీ మార్కెట్‌లో ఇవాళ్టికీ స్థానిక సినిమాల వాటాయే ఎక్కువ (దాదాపు 90శాతం). కానీ, హాలీవుడ్ సినిమాల పట్ల ఆసక్తి ఏటా 10 నుంచి 12 శాతం పెరుగుతున్నట్లు నిపుణుల అంచనా. ఇన్ని సానుకూలతలున్నప్పుడు హాలీవుడ్ సినిమా మన దగ్గర ముందు రిలీజవడమే కాదు... కేవలం మనల్ని దృష్టిలో పెట్టుకొనే హాలీవుడ్ సినిమాలు తీసే రోజూ త్వరలోనే వస్తుందేమో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement