వనమంత మానవత్వం | A Child Alone in the Forest of Wild Animals | Sakshi
Sakshi News home page

వనమంత మానవత్వం

Published Wed, Apr 17 2019 1:53 AM | Last Updated on Wed, Apr 17 2019 1:53 AM

A Child Alone in the Forest of Wild Animals - Sakshi

‘మన మధ్యే పెరగినా వాడికీ జీవితం ఉండాలి. మనుషుల మధ్య జీవించాలి’ అని అడవిలోని జంతువులన్నీ అనుకున్నాయి.‘మీలోనే మనుషులు కనపడుతున్నారు. నాకు మీరే జీవితం’ అని అడవిలోనే ఉండిపోయాడు మోగ్లీ.వనమంత మానవత్వాన్ని మన కళ్లకు కట్టింది ‘ది జంగిల్‌ బుక్‌’.

మీరు 90ల కాలం నాటి పిల్లలా? అయితే, జంగల్‌ బుక్‌ అని పేరు వినగానే మీ చెవుల్లో ఓ పాట సందడి చేస్తుండాలి. ‘జంగిల్‌ జంగిల్‌ బాత్‌ చలీ హై పతా చలా హై... అరె చడ్డీ పెహన్‌కే ఫూల్‌ కిలాహై..’ అంటూ ఓ కుర్రాడు అటవీ జంతువులతో కలిసి చేసే విన్యాసాలూ కళ్ల ముందు మెదులుతూ ఉండాలి. ఆ విన్యాసాలను అప్పటి పిల్లలందరూ కళ్లప్పగించి చూశారు. ఇప్పటికీ కిడ్స్‌ చానెల్స్‌లో నాటి జంగిల్‌బుక్‌ వీరుడు మోగ్లీ అల్లరి చేస్తూనే ఉన్నాడు.

90 ల కాలంలో దూరదర్శన్‌లో ఏడాది పాటు వచ్చిన ఈ సీరియల్‌ అప్పటి పిల్లలకు ఓ మంచి ఫ్రెండ్‌ అయ్యింది. వన్యమృగాలున్న అడవిలో ఒంటరిగా ఒక పిల్లవాడు, ఆ పిల్లవాడు అక్కడి జంతువుల్లో ఒకడిగా పెరగడం.. అబ్బురంగా చూశారు. ఆ అటవీ ప్రపంచంలో తామూ తిరిగారు. వన్యప్రాణులతో దోస్తీ కట్టారు. ఆటలు ఆడారు. పాటలు పాడారు. నాటి–నేటి పిల్లల ప్రియనేస్తం మోగ్లీని మరో మారు పరిచయం చేసుకుందాం.

మొట్టమొదటి యానిమేషన్‌ సీరియల్‌
అప్పట్లో పిల్లల కోసం ప్రత్యేక ఛానళ్లేవీ లేవు. పిల్లల కోసం ప్రత్యేకించి ప్రోగ్రాములూ లేవు. అప్పుడొచ్చింది జంగిల్‌బుక్‌. దూరదర్శన్‌లో సోప్‌ సీరియల్స్‌ స్టార్ట్‌ అయిన తొమ్మిదేళ్లకు ఎంటర్‌ అయ్యింది ఈ యానిమేషన్‌ సీరియల్‌. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు పిల్లలతో పాటు పెద్దలనూ తన ముందు కూచోబెట్టింది. 

మూలం రడ్‌ యార్డ్‌
ఆంగ్ల రచయిత్‌ రడ్‌ యార్డ్‌ కిప్లింగ్‌ జంగిల్‌బుక్‌ సృష్టికర్త. రడ్‌యార్డ్‌ ఇండియాలో పుట్టి, ఇంగ్లండ్‌లో పెరిగిన వ్యక్తి. 1894లో  ‘ది జంగిల్‌ బుక్‌’ రాశాడు. ఈ పుస్తకం ఆధారంగా మోగ్లీ స్టోరీస్‌ను వాల్ట్‌ yì స్నీ అంతర్జాతీయంగా అన్ని దేశాలకూ పరిచయం చేసింది. 1989లో జపాన్‌లో మొదటిసారి వచ్చిన ఈ యానిమేషన్‌ సీరియల్‌ అదే సంవత్సరం హిందీ డబ్బింగ్‌తో మన దేశంలో ప్రసారమై ఎంతగానో ప్రాచుర్యం పొందింది. 52 ఎపిసోడ్లతో ఏడాది పాటు పెద్దలనూ, పిల్లలను అలరించింది ఈ సీరియల్‌.

మోగ్లీ అనే పిల్లవాడి కథ
చాలా చిన్నగా ఉన్నప్పుడు తల్లితండ్రి నుంచి తప్పిపోయి దట్టమైన అడవికి చేరుకుంటాడు మోగ్లీ. ఒకచోట పడి ఉన్న మోగ్లీని బగీరా అనే నల్ల పులి కనిపెడుతుంది. మోగ్లీని అకెలా, అలెగ్జాండర్‌ అనే తోడేళ్ల దగ్గరికి తీసుకెళ్తుంది బగీరా. అకేలాకి చిన్న చిన్నపిల్లలు ఉంటారు. తన పిల్లలతో పాటు మోగ్లీని కూడా పెంచుతుంటుంది. రోజూ తోడేలు పిల్లలతో ఆడుకుంటూ పెరుగుతుంటాడు మోగ్లీ. బగీరా అనే నల్ల పులి, బాలూ అనే ఎలుగుబంటి, కా అనే పైథాన్‌..లు మోగ్లీ స్నేహితులు. జంతువులతో ఆడుకుంటూ, జంతువుల మధ్య ఉండటంతో త్వరగానే అడవి జీవులతో కలిసిపోతాడు మోగ్లీ. ‘కా’ టీచర్‌గా మోగ్లీకి కొండలు, చెట్లు ఎక్కడం, ఊడలు పట్టుకొని ఊగడం.. వంటి ఎన్నో విషయాల్లో తర్ఫీదు ఇస్తుంది. ఒక రోజు అర్ధరాత్రి అడవిలోని జంతువులన్నీ గాఢనిద్రలోకి జారుకుంటాయి.

రాత్రిపూట మనుషుల్ని తినే షేర్‌ఖాన్‌ అనే పులి అడవిలోకి చొరపడుతుంది. ముందుగానే పసిగట్టిన బగీరా మోగ్లీ గురించి ఆలోచిస్తుంది. అడవిలో ఉంచడం మంచిది కాదని, మనుషులున్న చోటుకు చేర్చాలని మోగ్లీని తీసుకొని బయల్దేరుతుంది. మోగ్లీని తినాలనే ప్రయత్నం చేస్తున్న షేర్‌ఖాన్‌ నుంచి  బగీరా కాపాడుతుంది. ఒకానొక సమయంలో మోగ్లీకి అడవిలో గుర్తింపు సమస్య ఎదురవుతుంది. విలన్లయిన జంతువుల నుంచి ప్రమాదం ఉంటుందని, మనుషులు ఉన్న చోటుకి చేరుస్తామని మోగ్లీ స్నేహితులు చెబుతారు. ఎవరు ఎంత నచ్చజెప్పినా అడవిలోనే ఉంటానంటాడు మోగ్లీ. అడవి జంతువులతోనే జీవిస్తుంటాడు. ఆ తరం నుంచి ఈ తరం వరకు, హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది ది జంగిల్‌బుక్‌. 
 
మోగ్లీ వయసు సుమారు 6 నుంచి 10 ఏళ్ల మధ్యన ఉంటుంది. అడవిలో ఎన్నో సాహసవిన్యాసాలు చేస్తుంటాడు. మోగ్లీ పనులు ఒక్కోసారి ఆలోచించేలా, మరోసారి నవ్వు తెప్పించేలా ఉంటాయి. జంతువుల పట్ల ప్రేమగా ఉంటాడు. ఇవన్నీ ఆ వయసు పిల్లలను బాగా కట్టిపడేశాయి. పెద్దలను కూడా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. కల్మషం లేని ప్రేమకు ముగ్దులవనిది ఎవరు. ఒక్క మన దేశంలోనే కాదు, ‘ది జంగిల్‌ బుక్‌’ ప్రపంచ దేశాల్లోని పిల్లలందరికీ పరిచయమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement