ఇండియాలో రికార్డు బద్దలుకొడుతున్న ది జంగిల్ బుక్
ముంబయి: ఇండియన్ బాక్సాపీసు వద్ద హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' రికార్డు సృష్టిస్తోంది. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ వారం రోజుల్లో దాదాపు రూ.70 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఎప్పుడో 1894లో ఒక నవలగా విడుదలైన జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. మొత్తం ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
అడవిలో ఓ నల్లపిల్లికి దొరికిన పిల్లాడిని తిరిగి మనుషులతో జత చేసే క్రమంలో భాగంగా చోటుచేసుకున్న పరిణామాలే ఈ జంగిల్ బుక్. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు. ఒక్క గురువారమే ఈ చిత్రం దేశ వ్యాప్తంగా దాదాపు పది కోట్లు వసూలు చేసి మొత్తం వారం రోజుల వసూళ్లలో రూ.74.08 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ 8న భారత్ లో ఈ సినిమా విడుదలైంది. కాగా, ఇప్పటి వరకు మన దేశంలో విడుదలైన ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇంతపెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టలేదు.