వెండితెరపై గణిత మాంత్రికుడి సంచలనం
భగవంతుడి ఆమోదం లేనిదే ఏ ఆలోచనా సూత్రంగా మారదు.. లోకానికి అది ఉపయోగపడదు: శ్రీనివాస రామానుజన్
సినిమా పేరు: ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ
జానర్: బయోగ్రాఫికల్ డ్రామా
దర్శకత్వం, స్క్రీన్ ప్లే: మ్యాథ్యూ బ్రౌన్
ఆధారం: రాబర్ట్ కనిగెల్ రాసిన 'ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ' పుస్తకం
నటీనటులు: దేవ్ పటేల్, దేవికా భిసే, జెర్మీ ఇరోన్స్, స్టీఫెన్ ఫ్రే తదితరులు
సంగీతం: కోబే బ్రౌన్
సినిమాటోగ్రఫీ: ల్యారీ స్మిత్
ఎడిటింగ్: జేసీ బాండ్
విడుదల: ఇండియాలో ఏప్రిల్ 28, 2016. (యూకేలో ఈ నెల 8న విడుదలైంది. వాస్తవానికి టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(సెప్టెంబర్ 17, 2015)లోనే ఈ సినిమాను విడుదలచేశారు)
నిడివి: 108 నిమిషాలు
భాష: ఇంగ్లీష్
సర్ ఆల్బర్ట్ ఐజక్ ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్.. భౌతిక, ఖగోళ శాస్త్రవేత్తలుగా ప్రపంచఖ్యాతి పొందిన ఈ ఇద్దరూ ఆయా శాస్త్రాలకు వెన్నెముకైన గణిత శాస్త్రంలోనూ మేధావులు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీయే సర్వస్వంగా వారు చేసిన పరిశోధనలు, ఆవిష్కరించిన సూత్రాలు ప్రపంచాన్ని సరికొత్త దిశలోకి నడిపాయి. ఆ ఇద్దరి సరసన శ్రీనివాస రామానుజన్ పేరు కూడా ఉండాలని, ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదని 'ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ' సినిమా చూసిన తర్వాత అనిపిస్తే బహుశా ఆ భావన తప్పుకాదేమో!
భారతీయ గణిశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ జీవితంపై రూపొందించిందే 'ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ' సినిమా. శ్రీనివాస రామానుజన్ గా 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ దేవ్ పటేల్, లండన్ లో ఆయనకు అన్నీ తానై నడిపించిన ఫ్రొఫెసర్ జి.హెచ్.హార్డీగా జెర్మీ ఇరోన్స్, సతీమణిగా దేవికా భిసే నటించిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు, మేధావుల మెచ్చుకోళ్లతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత్ లో గురువారం విడుదలైంది.
కథేంటి?
దక్షిణ భారతదేశంలోని ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించి, బాల్యం నుంచే కష్టాలు అనుభవించి, ఎలాంటి శిక్షణ లేకుండా కేవలం స్వీయ సాధనతో గణితశాస్త్రంలో అతి క్లిష్టమైన సమస్యలు పరిష్కరించగల మేథస్సున్న శ్రీనివాస రామానుజన్ తనను తాను పాశ్చాత్య ప్రపంచం ముందు ఎలా ఆవిష్కరించుకున్నాడు? ఎలాంటి ఆవిష్కరణలు చేశాడు? ఆ క్రమంలో రామానుజన్ కేంబ్రిడ్జ్ కు వెళ్లేందుకు మూల కారకుడైన ఫ్రొఫెసర్ హెచ్ జి హార్డీతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? భిన్న దృవాలైన ఈ ఇద్దరూ కొత్తకొత్త ఆవిష్కరణలతో ఒకరినొకరు ఎలా ఖంగుతినిపించుకున్నారు?.. లాంటి ప్రశ్నలకు దృశ్యరూపక సమాధానమే 'ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ' సినిమా. ఇందులో ప్రధానంగా రామానుజన్, హార్డీల 'లెక్కల' అనుబంధాన్నే హైలెట్ చేశారు దర్శకుడు మ్యాథ్యూ బ్రౌన్.
భగవంతునిపై అచంచల విశ్వాసాన్ని కనబర్చే రామానుజన్ 'ఏ ఆలోచనైనా దేవుని ఆమోదం పొందనిదే సూత్రంగా మారదు' అని వాదిస్తాడు. ఈ స్టేట్ మెంట్ ను నిష్కర్షగా కొట్టిపారేసే హార్డీ హేతువాది. 'అన్ని ఆవిష్కరణలకు హేతువే మూలం' అని రామానుజన్ తో అంటాడు. భగవంతుడు తన ద్వారా చేయిస్తోన్న ఒక్కో పరిశోధన, వాటి అద్భుత ఫలితాలను వివరిస్తూ, అది దేవుడే చేయించాడని హార్డీని నమ్మించడానికి ప్రయత్నించే రామానుజన్, నమ్మిక మనిషిని ఎంతదూరం తీసుకెళుతుందో ప్రత్యక్షంగా చూస్తూ కూడా చివరివరకు దేవుణ్ని నమ్మని హార్డీల పాత్రలే ఈ సినిమాకు మూలం. ప్రాణం. విదేశాలకు వెళ్లి 'మైలపడి' వచ్చిన తమను బంధువులు ఆదరిస్తారా? తమకు పుట్టిన బిడ్డలకు పెళ్లిళ్లు అవుతాయా? అని కంగారుపడే రామానుజన్ సతీమణి జానకీ అమ్మాళ్ పాత్ర, హార్డీ సహాధ్యాయులు మరికొందరు సినిమాను మరింత రక్తికట్టిస్తారు.
ఎలా తీశారు?
లెక్కల మనిషి మీద సినిమా తీయడానికి ఏముంటుంది? డ్రామా పండుతుందా? ఇంతక ముందు గణిత శాస్త్రవేత్త జాన్ నాష్ జీవితం ఆధారంగా రూపొందించిన 'ఎ బ్యూటిఫుల్ మైండ్' కలెక్షన్ల తోపాటు ఆస్కార్ అవార్డులనూ కొల్లగొట్టింది. నాష్ స్కిజోఫ్రీనియా పేషెంట్ కాబట్టి ఆ సినిమాలో నాటకీయత ఉంటుంది. మరి రామానుజన్ లైఫ్ లో డ్రమెటికల్ పాయింట్ ఏంటి? దేవుడు. అవును. సాధారణంగా శాస్త్రవేత్తలెవ్వరూ (అప్పట్లో) దేవుణ్ని నమ్మేవారు కాదు. రామానుజన్ కు మాత్రం దేవుడు, ఆయన మనుషులకు నిర్ధేశించిన శాసనాలపట్ల అచంచల విశ్వాసం. ఆ విశ్వాస ప్రకటనే తన పరిశోధనలని బలంగా నమ్ముతాడాయన. ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి దాదాపు 12 ఏళ్లు పట్టిందట దర్శకుడు మ్యాథ్యూకు! పుస్తకం ఆధారంగా తీయబోయే సినిమా స్క్రీన్ ప్లేకు ఇంత సమయం తీసుకోవడం ఎందుకు? అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం తెరపైనే కనిపిస్తుంది. 20వ శతాబ్ధపు తొలినాళ్లలో కేంబ్రిడ్జ్ వర్సిటీ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు మ్యాథ్యూ. అక్కడి క్లాస్ రూమ్ లు, బెంచ్ లు, దుస్తులు, ఆఖరికి బ్లాక్ బోర్డ్ పై రాసే చాక్ పీస్ కూడా అప్పటికాలానిదిలా చూపించేందుకు దర్శకుడు తీవ్రంగా శ్రమించాడు. బహుశా 12 ఏళ్లు సాగిన స్క్రీన్ ప్లే రచన కాబట్టి తన సినిమాలోని అణువణువునూ అద్భుతంగా ఆవిష్కరించడలిగాడు మ్యాథ్యూ. మూలస్తంభాలైన రామానుజన్, హార్డీ పాత్రలకు దేవ్ పటేల్, జెర్మీ ఇరోన్స్ ప్రాణప్రతిష్టచేశారు. దాదాపు అన్ని విదేశీ, దేశీ పత్రికలు, మీడియా సంస్థలు మంచి రేటింగ్స్ ఇచ్చాయీ సినిమాకు.
రామానుజన్ గా మాధవన్ !
మొదట ఈ సినిమాలో రామానుజన్ పాత్రకు మాధవన్ ను ఎంపిక చేశారట. 2012లోనే మ్యాథ్యూ చెప్పిన 'ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ' స్క్రిప్ట్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట మాధవన్. అయితే రామానుజన్ పాత్రను ఎవరైనా అంతర్జాతీయ గుర్తింపు పొందిన నడుడితో చేయిస్తే సినిమాకు ప్లస్ అవుతుందనే ఆలోచనతో చివరికి దేవ్ పటేల్ ను ఎంపిక చేశారు. 'స్లమ్ డాగ్ మిలియనీర్' హిట్ తర్వాత దేవ్ పటేల్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం వల్లే అతనికి ఈ చారిత్రక సినిమాలో లభించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
రామానుజన్ జీవితం (బ్రీఫ్ గా)
గణిత మేధావిగా ప్రపంచ ఖ్యాతిగాంచిన శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 1887, డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు. తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ చీరల దుకాణంలో గుమస్తాగా పని చేసేవారు. తల్లి కోమలటమ్మాళ్ గృహిణి. 1909, జులై 14వ తేదీన రామానుజన్ కు జానకీ అమ్మాళ్ అనే తొమ్మిదేళ్ళ బాలికతో వివాహమైంది. చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. తాన సిద్ధాంతాలను.. అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కి చూపడం, ఆయన వాటిని తనకు తెలిసిన గణిత శాస్త్రవేత్తల దగ్గరకు పంపించడం, అలా అవి బాంబే ప్రొఫెసర్ సల్ధానా అతని సిద్ధాంతాలను చూడటం జరిగింది. చాలా మందికి రామానుజన్ సిద్ధాంతాలు అర్థంకాలేదు. ఎందుకంటే అప్పటికవి అడ్వాన్స్డ్ థియరీస్!
కేంబ్రిడ్జ్ కు చెందిన ప్రొఫెసర్ హార్డీ రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. 1914, మార్చి 17న ఇంగ్లండ్ కు వెళ్లిన రామానుజన్ కు శాఖాహారపు అలవాట్ల వల్ల అక్కడ సరిగా భోజనం చేసేవారు కాదు. దీనికతోడు విపరీతంగా శ్రమించేవారు. తక్కువ సమయంలోనే 32 పరిశోధనా పత్రాలు సమర్పించాడు. శరీరం క్రమంగా వ్యాధిగ్రస్థమైంది. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నపుడు కూడా హార్డీతో 1729 సంఖ్య ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యపర్చారు. ఈ సంఘటన గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగాన్ని, అంకిత భావానికి నిదర్శనం. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రామానుజన్ 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. అనేక రకాల వైద్యం చేయుంచుకున్నా ఆయన కోలుకోలేక పోయాడు. 1920, ఏప్రిల్ 26న కన్నుమూశారు. ప్యూర్ మేథమెటిక్స్ లో నంబర్ థియరీలపై రామానుజన్ చేసిన పరిశోధనలు.. స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనలు పురోగమించడానికి ఉపయోగపడ్డాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్-తీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాలు కొన్ని ఇప్పటికీ అపరిష్కృతం గానే ఉండటం గమనార్హం.