
ఇప్పటికీ నేను చాలా చిన్నదాన్ని: నటి
ముంబై: లోఫర్ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన భామ దిశా పటానీ. ఆ మూవీ ఆమెకు అంతగా కలిసిరాకపోవడంతో వెంటనే బాలీవుడ్ బాట పట్టింది. భారత పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ జీవిత కథాంశం ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం 'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ'లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు జోడీగా నటించింది. ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని మీడియా ప్రశ్నలకు తన మనసులో మాట బయటపెట్టింది. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోకరమైన విషయం. సినిమాలు సక్సెస్ అవుతాయి.. ఫెయిల్ అవుతాయి.. వాటి గురించి అంతగా పట్టించుకోను. అయినా సూపర్ స్టార్ అయిపోవాలని నేను కలల కనలేదుగా అంటోంది ఈ ముద్దుగుమ్మ.
'మూవీలలో నటించడమే నా పని. కెమెరా ముందుకు రాగానే మెరుగ్గా నటించేందుకు ప్రయత్నిస్తాను. ఇంకా చెప్పాలంటే మూవీ ఇండస్ట్రీకి నేను చాలా చిన్నదాన్నే. బాలీవుడ్ లో కేవలం ఒకే మూవీ చేశాను. దిగ్గజ నటుడు జాకీచాన్ తో నటించిన 'కుంగ్ ఫు యోగా' వచ్చే జనవరి 28న విడుదల అవుతుంది. మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అదే ఫార్ములాను ఎప్పటికీ ఫాలో అవుతాను' అని దిశా పటానీ చెప్పుకొచ్చింది.