
ఒకే సినిమా నిర్మించి.. విడుదలకు ముందే ఆత్మహత్య
కొల్లాం: ఎన్నో కలలతో అజయ్ కృష్ణన్ (29) సినీ రంగంలోకి అడుగు పెట్టి, తొలి సినిమా నిర్మించాడు. చిత్రం బాగా రాలేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తాను నిర్మించిన తొలి చిత్రం ప్రివ్యూను చూసి నచ్చకపోవడంతో ఆదివారం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అసిఫ్ అలీ, ఉన్ని ముకుందన్లు ముఖ్యపాత్రలో ‘అవరుడే రవుకల్’ అనే చిత్రాన్ని అజయ్ కృష్ణన్ నిర్మించారు. ఆ చిత్రం ప్రివ్యూను కొచ్చిలో రెండు రోజుల కిందే చూశారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చిత్రం విజయం సాధించడం కష్టమని పలుమార్లు తల్లిదండ్రులకు కూడా చెప్పినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం ఆయన రూ.4 కోట్లు ఖర్చు చేసి, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.