
త్వరలో తెరపైకి ఉరుధికోల్
తమిళసినిమా: ఉరుధికోల్ చిత్రం యూఏ సర్టిఫికెట్‌తో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. బాలనటుడిగా మంచి పేరు తెచుకున్న కిశోర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఉరుధికోల్. నటి మేగ్నా నాయకిగా నటించిన ఇందులో అఖిలేష్, కాళీవెంకట్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఏపీకే.ఫిలింస్, జై స్నేహం ఫిలింస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అయ్యనార్ దర్శకుడు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి.
చివరికి రివైజింగ్ కమిటీకి వెళ్లి యూఏ సర్టిఫికెట్‌తో బయట పడింది. దీని గురించి చిత్ర దర్శకుడు అయ్యనార్ తెలుపుతూ అన్ని వర్గాల వారు చూడాలన్న భావంతోనే ఉరుధికోల్ చిత్రాన్ని తెరకెక్కించినట్లు పేర్కొన్నారు.అంతే కానీ ఎవరూ అసహ్యించుకునే విధంగానో, ఎవరి మనసులను గాయపరిచేవిధంగానో చిత్రం ఉండదని అన్నారు. తుది ఘట్టంలో వయిలెన్స్ ఎక్కువగా ఉందన్న అభిప్రాయంతోనే సెన్సార్ బృందం ఉరుధికోల్ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ ఇచ్చిందని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.