
డిసెంబర్‌లో వేలైక్కారన్
వేలైక్కారన్ చిత్ర విడుదల దాదాపు మూడు నెలల వెనక్కి వెళ్లిపోయింది.
తమిళసినిమా: వేలైక్కారన్ చిత్ర విడుదల దాదాపు మూడు నెలల వెనక్కి వెళ్లిపోయింది. శివకార్తికేయన్, నయనతార తొలిసారిగా కలిసి నటిస్తున్న క్రేజీ చిత్రం వేలైక్కారన్. ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. ఇంతకుముందు రెమో వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన 24 ఏఎం.స్టూడియోస్ పతాకంపై ఆర్‌డీ.రాజా నిర్మిస్తున్న తాజా చిత్రం వేలైక్కారన్.
భారీ అంచనాలను సంతరించుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత ముందుగానే వెల్లడించారు. తాజా పరిణామాల కారణంగా చిత్ర విడుదల డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఒక ప్రకటనలో వెల్లడించారు. అందుకు కారణాలను తెలుపుతూ వేలైక్కారన్ చిత్రం టాకీ పార్టును పూర్తి చేసుకుందని, అయితే ఇంకా రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉందని తెలిపారు.
అదే విధంగా తనీఒరువన్ వంటి సంచలన విజయం సాధించిన చిత్ర దర్శకుడు మోహన్‌రాజా తాజా చిత్రం కావడంతో అన్ని అంశాలు చాలా బలంగా ఉండాలని ఆశించడంతో ఆ దిశగా వర్క్ జరుగుతోందన్నారు. సెన్సార్ బోర్డు నూతన నిబంధనల ప్రకారం చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రావడానికి మూడు లేక నాలుగు వారాలు పడుతుందని తెలిపారు.ఇకపోతే అక్టోబర్‌లో దీపావళి పండగ సందర్భంగా ఇప్పటికే పలు చిత్రాలు బరిలో ఉన్నాయని, నవంబర్‌లో ఎలాంటి పండగలు లేకపోవడంతో వేలైక్కారన్ చిత్రాన్ని క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు నిర్మాత వివరించారు.