
సీనియర్ నటుడు సీకే విశ్వనాథ్ కన్నుమూత
ప్రముఖ సినీ రచయిత, నటుడు చిలుకోటి కాశీవిశ్వనాథ్ మరణించారు. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో విశాఖపట్నం వెళ్తుండగా ఆయనకు ఖమ్మం సమీపంలో గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. కాశీ విశ్వనాథ్ మృతదేహాన్ని రైల్వే అధికారులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్తున్నట్లు తెలిసింది.
దాదాపు 70 సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. దాసరి నారాయణరావు, రేలంగి నరసింహారావు, రాజాచంద్ర, విజయ బాపినీడు తదితరుల సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు.
గత కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి, ప్రముఖ రచయిత సత్యమూర్తి, మరో రచయిత శ్రీనివాస్ చక్రవర్తి, అనూప్ రూబెన్స్ తల్లి, నాటకరంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు, విలక్షణ నటుడు, హీరో రంగనాథ్, నృత్యదర్శకుడు భరత్ కన్నుమూశారు.