ఆ హీరో అమాయకుడిలా కనిపించాడు : డైరెక్టర్
త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం 'ఎ ఫ్లయింగ్ జాట్' కోసం అమాయకంగా కనిపించే వ్యక్తి కోసం చాలా ప్రయత్నించానని ఆ మూవీ డైరెక్టర్ రెమో డిసౌజా తెలిపాడు. ఆ కారణంగానే తన మూవీలో బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాఫ్ కు అవకాశం ఇచ్చానని వెల్లడించాడు. ఇందుకోసం టైగర్ అరంగేట్ర మూవీ 'హీరోపంటి'లో నటించక ముందే అతడితో తన మూవీ గురించి చర్చించానన్నాడు. హీరో టైగర్ ష్రాఫ్ ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్లలో బిజిబిజీగా గడుపుతున్నాడు.
తన వద్ద ఓ సూపర్ హీరో తరహా కథ సిద్ధంగా ఉందని చెప్పగానే టైగర్ ఒప్పేసుకున్నాడని డిసౌజా హర్షం వ్యక్తంచేశాడు. ఈ మూవీలో టైగర్ సరసన జాక్వెలైన్ ఫెర్నాండేజ్ కనిపించనుంది. అయితే కీలకపాత్రలో నాథన్ జోన్స్ నటించాడు. వాస్తవానికి ఇలాంటి తరహా మూవీలు చేస్తున్నామంటే నాన్సెన్స్ అంటారు. కానీ ఇదే తరహా సూపర్ హీరో సినిమాలను హాలీవుడ్ లో తీస్తే మాత్రం కచ్చితంగా ఇష్టపడతారని డైరెక్టర్ అభిప్రాయపడ్డాడు. వ్యక్తుల ఆలోచనధోరణిలో మార్పు వస్తే ఎన్నో మంచి చిత్రాలు తీసేందుకు అవకాశం ఉంటుందన్నాడు. 'ఎ ఫ్లయింగ్ జాట్' మూవీ ఈ 25న విడుదల కానుంది.