పారితోషికం ఒక్క పైసా కూడా తీసుకోను
'కెరీర్ ప్రారంభంలో నా పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పేవారు. ఆ తర్వాత నా వాయిస్ లో ఉన్న మాస్ ఇమేజ్ ను గుర్తించింది రాంగోపాల్ వర్మ. కథేంటో.. సినిమా ఏంటో కూడా పెద్దగా తెలీదు. కానీ హాలీవుడ్ దర్శకదిగ్గజం స్టీవెన్ స్పీల్బర్గ్ మూవీ కావడంతో డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకున్నాను' అని టాలీవుడ్ నటుడు జగపతిబాబు అన్నారు. బేసిక్ గా తాను యానిమేషన్ మూవీలు చూడనని, అలాంటి తరహా సినిమాల కంటే రియాల్టీ ఉండే వాటినే చూస్తానని చెప్పుకొచ్చాడు.
స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో రిలయన్స్, డిస్నీ సంస్థలు నిర్మించిన ఫాంటసీ చిత్రం ‘ది బిఎఫ్‌జి’. ది బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ అనేది ఉపశీర్షిక. జగపతిబాబు మాట్లాడుతూ.. ఈ మూవీలో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పిన తాను పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నాడు. కేవలం దిగ్గజ దర్శకుడు స్పీల్బర్గ్ తో ఒక్క ఫొటో దిగితే అదే తనకు బిగ్ రెమ్యూనరేషన్ అని పేర్కొన్నాడు. తన జీవితంలో వచ్చిన బెస్ట్ డబ్బింగ్ అవకాశమని, ఆ ప్రాజెక్టులో తాను భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.
అయితే తన డ్రీమ్(స్పీల్బర్గ్ తో ఫొటో దిగడం) ఇంకా పూర్తి కాలేదన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో తండ్రి పాత్రలో, క్రేజ్ ఉన్న విలన్ పాత్రల్లో మెప్పిస్తోన్న జగపతి, తనకు చాలా డిమాండ్ ఉన్నా హాలీవుడ్ దర్శకుడిపై ఉన్న అభిమానంతోనే పారితోషికం తీసుకోనని చెప్పడం విశేషం.