మహేశ్‌బాబు తొలి సినిమా టైటిల్ ‘రాజకుమారుడు’. సూపర్‌స్టార్ కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రాజైతే ఆయన కుమారుడు రాకుమారుడే అవుతాడు కదా అని అభిమానులు ఆ టైటిల్ చూసి సంబర పడ్డారు. ఆ తర్వాత మహేశ్ ‘బాబీ’, ‘నాని’ వంటి సాఫ్ట్ టైటిల్స్‌తో సినిమాలు చేశారు. గుణశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఒక్కడు’ మహేశ్ సినిమాల్లో టాప్ టైటిల్‌గా నిలిచిందని చెప్పవచ్చు. దాని కొనసాగింపుగా తెలుగులో అనేక ‘ఒక్కడు’ టైటిల్స్ వచ్చాయి. మహేశ్‌కు కృష్ణవంశీ ‘మురారి’ టైటిల్ ఇస్తే పూరి జగన్నాథ్ ‘పోకిరి’ టైటిల్ ఇచ్చారు. ఇక శ్రీకాంత్ అడ్డాల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి డిఫరెంట్ టైటిల్‌ని ఇచ్చి మహేశ్‌బాబు మీద సుతారమైన తెలుగు మల్లెల వాన కురిపించారు. అయితే అన్ని టైటిల్స్ కూడా మహేశ్‌కు సులువైపోలేదు. త్రివిక్రమ్ ‘ఖలేజా’ టైటిల్ పెడితే అది చిక్కుల్లో పడింది. అదే టైటిల్‌ను వేరొకరు రిజిస్టర్ చేసుకుని ఉండటంతో చివరకు సినిమాను ‘మహేశ్ ఖలేజా’గా విడుదల చేయాల్సి వచ్చింది.
మహేశ్ వంటి హీరోల పై ‘శ్రీమంతుడు’ వంటి పాత తరహా టైటిల్స్ పెట్టడం రిస్క్‌తో కూడిన పని. కానీ ‘శ్రీమంతుడు’ పెద్ద హిట్ అయ్యి సిరి తెచ్చి పెట్టింది. ఇక అదే దర్శకుడు శివ కొరటాల దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను’ టైటిల్ కూడా ఎంతో ఆకట్టుకుని సినిమాను హిట్ చేసింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు లేటెస్ట్ సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అనేదానిపై కుతూహలం చోటు చేసుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ హీరోగా ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ గురువారం రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అనధికారిక వార్త ఏంటంటే.. ఈ సినిమాకు ‘రిషి’ అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో జోరుగా షికారు చేస్తోంది. ఇప్పటికే రివీల్ చేసిన అక్షరాలు ఆర్, ఐ, యస్, హెచ్ బట్టి సినిమా టైటిల్ ‘రిషి’ అయ్యుండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ‘మహర్షి’ కూడా కావచ్చని అంటున్నారు. అయితే ఇది సినిమా టైటిలా? లేకపోతే సినిమాలో మహేశ్ బాబు క్యారెక్టర్ పేరా? ఒకవేళ పేరే అయితే దాన్నే టైటిల్‌గా పెడతారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ‘అల్లరి’ నరేశ్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో స్టూడెంట్‌గా మహేశ్ గడ్డం, జుట్టుతో కనిపించనున్న సంగతి తెలిసిందే.
టైటిల్స్ స్పెషలిస్ట్ వంశీ
దర్శకుడు వంశీ తెలుగులో కొత్త కొత్త టైటిల్స్ పెట్టి ప్రేక్షకులను మెప్పించగలరనే పేరు సంపాదించారు. ‘లేడీస్ టైలర్’, ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్‌ట్రూప్’, ‘డిటెక్టివ్ నారదా’, ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను’, ‘దొంగరాముడు అండ్ పార్టీ’, ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘ఏప్రిల్ 1 విడుదల’... ఇలాంటి టైటిల్స్ అన్నీ ఆయన సృష్టించినవే. అయితే తిట్లని టైటిల్స్ చేయవచ్చని గ్రహించిన దర్శకుడు మాత్రం పూరి జగన్నాథ్. ‘ఇడియట్’, ‘పోకిరి’, ‘దేశముదురు’, ‘రోగ్’, ‘లోఫర్’... ఇవన్నీ ఆయన టైటిల్స్.
‘సామ్రాట్’, ‘సాహస సామ్రాట్’
తెలుగు ఇండస్ట్రీలో సినిమాల టైటిల్స్ కోసం ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టడం, ఆ టైటిల్స్ కోసం ప్రయత్నించడం చాలాకాలం నుంచి ఉంది. గతంలో చిరంజీవి నటించిన సినిమా కోసం ప్రేక్షకులకే కొన్ని టైటిల్స్ ఇచ్చి ఎక్కువ మంది కోరుకున్న టైటిల్‌ను పెట్టారు. ఆ సినిమా పేరు ‘విజేత’. బాలకృష్ణ, రమేశ్‌బాబు (కృష్ణ కుమారుడు) ఒకేసారి మొదలెట్టిన సినిమాలకు ‘సామ్రాట్’ టైటిల్ అనుకున్నారు. అయితే దాని రిజిస్ట్రేషన్ రమేశ్‌బాబు నిర్మాతల దగ్గరే ఉండటంతో ‘సాహస సామ్రాట్’ పేరుతో బాలకృష్ణ సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చింది. జె.డి. చక్రవర్తి హీరోగా ‘పేరు లేని సినిమా’ను అనౌన్స్ చేసి ఒక క్రేజ్ సృష్టించాక దానికి ‘పాపే నా ప్రాణం’ పేరుతో విడుదల చేశారు. ఇటీవల ‘కత్తి’ సినిమా టైటిల్ కోసం కూడా గిరాకీ ఏర్పడింది. ఆ టైటిల్ దొరకని కల్యాణ్‌రామ్ తన సినిమాను ‘కల్యాణ్‌రామ్ కత్తి’గా రిలీజ్ చేయాల్సి వచ్చింది. కమెడియన్ సప్తగిరి దగ్గర ఉన్న ‘కాటమరాయుడు’ టైటిల్‌ను పవన్ కల్యాణ్ తీసుకుని అందుకు బదులుగా సప్తగిరి సినిమాను ప్రోత్సహించడం చూశాం.
టైటిల్ సెంటిమెంట్
కె.విశ్వనాథ్ తన టైటిల్స్‌ను ‘ఎస్’ అక్షరం మీద పెట్టాలనుకుంటారన్న సెంటిమెంట్ ఉంది. ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘సప్తపది’, ‘శృతిలయలు’, ‘స్వర్ణకమలం’... ఇలా ‘ఎస్’ టైటిల్‌తో మొదలైన ఆయన సినిమాలన్నీ హిట్. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎస్.గోపాలరెడ్డికి తన సినిమాలన్నీ ‘మ’ అక్షరంతో మొదలవ్వాలన్న సెంటిమెంట్ ఏర్పడింది. ‘మంగమ్మ గారి మనవడు’, ‘ముద్దుల కృష్ణయ్య, ‘ముద్దుల మావయ్య’, ‘మువ్వా గోపాలుడు’, ‘మా పల్లెలో గోపాలుడు’ ఇవన్నీ ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాలే. ఇక పురిట్లోనే సంధి కొట్టిన టైటిల్స్ కూడా ఉన్నాయి. దాసరి ‘ఉడుకు నెత్తురు’, చిరంజీవి ‘వజ్రాల దొంగ’, పవన్ కల్యాణ్ ‘సత్యాగ్రాహి’, బాలకృష్ణ ‘విక్రమసింహ భూపతి’... ఇవన్నీ ఆదిలోనే వీగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment