
గ్లామర్‌గా నటించడంలో తప్పులేదు అంటోంది నటి నివేదా పేతురాజ్. తొలి చిత్రం ఒరునాళ్ కూత్తు చిత్రంతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి ఈ మదురై చిన్నది. అయితే దుబాయ్‌లో పెరిగిన పక్కా మోడ్రన్ అమ్మాయి నివేదా అన్నది గమనార్హం. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. అందులో స్టార్ హీరో జయంరవితో రొమాన్స్ చేసే చిత్రం కూడా ఉంది. పనిలో పనిగా తెలుగులో కూడా అడుగుపెట్టేసింది. అలాంటి నివేదాపేతురాజ్ తాజా ముచ్చట్లు చూద్దాం. – తమిళసినిమా
ప్ర: నటుడు జయంరవికి జంటగా నటిస్తున్న టిక్ టిక్ టిక్ చిత్రంలో మీకు లవ్ సీన్సే లేవట నిజమేనా?
జ: నిజమే. ఈ చిత్రంలో జయంరవికి నాకు మధ్య లవ్ సీన్స్ ఉండవు. ఒక్కటి మాత్రం చెప్పగలను. టిక్ టిక్ టిక్ లాంటి చిత్రం ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలోనే వచ్చి ఉండదు.అంతరిక్షంలో జరిగే కథాంశంతో తెరకెక్కుతున్న సీరియస్ కథా చిత్రంలో లవ్ సీన్స్‌కు తావుండదు. ఇందులో నా పాత్ర కల్ప నాచావ్లా మాదిరిగా ఉంటుంది. నా అభిమానులు సంతోషించే విధంగా ఇందులో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటిస్తున్నాను. ప్రస్తుతానికి ఈ చిత్రం గురించి ఎక్కువ చెప్పలేను.
ప్ర: తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అయినట్లున్నారు?
జ: అవును. మెంటల్ మదిలో అనే తెలుగు చిత్రంలో శ్రీవిష్ణుకు జంటగా నటిస్తున్నాను. ఇది నా తొలి తెలుగు చిత్రం. తెలుగు భాషను కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను. అయితే సంభాషణలు మాత్రం ముందు రోజే తీసుకుని బట్టీ పట్టి పక్కాగా చెబుతున్నాను.అందులో చాలా స్ట్రాంగ్ అయిన నగర యువతి పాత్రలో నటిస్తున్నాను.
ప్ర: అక్కడ గ్లామర్‌గా నటించాలని ఒత్తిడి చేస్తారటగా?
జ: కథకు అవసరం అయితే గ్లామర్‌గా నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. అయినా గ్లామర్‌గా నటించడంలో తప్పేముంది. అయితే మెంటల్ మదిలో చిత్రంలో గ్లామర్‌కు ప్రాధాన్యత ఉండదు. మరో విషయం ఏమిటంటే నాకు ఎలాంటి దుస్తులు ధరించినా నప్పుతాయి. నా నటనాప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తున్నారు. నేనూ నా పాత్రలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నాను.
ప్ర: బీజూ దీవులు చుట్టొచ్చారట. ఆ అనుభవం గురించి?
జ: వెంకట్‌ప్రభు దర్శకత్వంలో పార్టీ చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో రెజీనా, సత్యరాజ్, జయరామ్, రమ్యకృష్ట, జై, శివ, వైభవ్ అంటూ సీనియర్ నటీనటులతో నటించడం మంచి అనుభవం. అందరం ఒకే చోట బసచేసి నటించడం చాలా జాలీగా ఉంది. అయితే నాకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ రాత్రుల్లో జరగడంతో పగులు దీవులన్నీ తిరిగి చూడలేకపోయాను. తదుపరి షెడ్యూల్‌లో ఆ దీవులన్నీ చుట్టిరావాలనుకుంటున్నాను.
ప్ర: ఈ రంగంలో ఏదైనా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారా?
జ: ఇతరులతో మనం ప్రవర్తించే విధం బట్టే మర్యాద అన్నది ఉంటుంది. సినిమారంగంలో షూటింగ్‌లో నాకు మంచి మర్యాద లభిస్తోంది. మంచిగా ట్రీట్ చేస్తున్నారు. నేనెవరితోనూ గొడవకు పోను. వృత్తిని ప్రేమిస్తూ చేస్తాను.
ప్ర: నటీమణులకు రక్షణ లేదనే ప్రచారం జరుగుతోంది. మీరేమంటారు?
జ: షూటింగ్ స్పాట్‌లోనైనా, బయట అయినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన రక్షణ బాధ్యతను మనమే వహించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment