
'ఆనాటి నా ఆలోచనే ఓ అద్భుతం'
ముంబై: జూహీచావ్లా.. ఒకనాటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్. తన అందంతోపాటు డ్యాన్సులతో కుర్రకారు మనసు దోచుకున్న జూహీ.. తన యుక్త వయసులోని మధురానుభూతులను మరోసారి తలుచుకుంటూ మురిసిపోతుంది. తాను 'మిస్ ఇండియా' గా కిరీటం గెలుచుకున్న నాటి జ్ఞాపకాలు నిజంగా అద్భుతమని తెలిపింది. తన 47 ఏళ్ల జీవితంలో మరిచిపోలేనిది ఏదైనా ఉంటే అది యుక్త వయసేనని పేర్కొంది.
'నేను 18 సంవత్సరాల ప్రాయంలో మిస్ ఇండియా పోటీకి వెళ్లాను. ఆ పోటీలో విజయం సాధించి మిస్ ఇండియా కిరీటాన్ని చేజిక్కించుకున్నా. మళ్లీ ఒకసారి వెనక్కు చూసుకుంటే.. పోటీకి వెళ్లాలని నాకు వచ్చిన ఆలోచన చాలా గొప్పది. ప్రీతిదాయకమైన జ్ఞాపకాలను ఆనాటి నా వయసు నాకిచ్చింది' అని జూహీ తెలిపింది. యుక్త వయసులో తీసుకునే నిర్ణయాలు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని జూహీ అభిప్రాయపడింది. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తరువాత జూహీకి బాలీవుడ్ ఆఫర్లు ఒకదాని వెంట వచ్చిపడ్డాయి. వరసుగా హిట్ లు సాధించిన జూహీ బాలీవుడ్ లో ఓ వెలుగువెలిగింది.