ఆర్టీసీకి సంక్రాంతి | income increased telangana rtc buses | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి సంక్రాంతి

Published Sun, Jan 21 2018 10:54 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

income increased telangana rtc buses - Sakshi

నల్లగొండ : సంక్రాంతి పండుగ ఆర్టీసీకి భారీగానే కలిసొచ్చింది. పండుగ సందర్భంగా రీజియన్‌ నుంచి ప్రత్యేకంగా 220 బస్సులు నడిపారు. హైదరాబాద్‌కు రోజూ వెళ్లే బస్సులతోపాటు అదనంగా నడపడటంతో రీజియన్‌కు సాధారణ రోజులతో పోలిస్తే ఆదాయం పెరిగింది. సoక్రాంతి రోజున మినహాయిస్తే ఈ నెల 11 నుంచి 19 వరకు రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోల నుంచి దూర ప్రాంతాలకు అదనపు బస్సులు తిప్పారు. పండుగ స్పెషల్‌ పేరుతో ప్రత్యేకంగా తిప్పిన బస్సుల్లో ప్రస్తుతం ఉన్న చార్జీలకు 30 శాతం అదనంగా వసూలు చేశారు. మిగిలిన బస్సుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేశారు. పండుగకు ముందు, తర్వాత కూ డా అదనపు బస్సులు నడపడటంతో నష్టాల్లో ఉన్న రీజియన్‌కు కొంత మేలు జరిగింది. గతేడాది సంక్రాంతితో పోలిస్తే ఈ ఏడాది రీజియన్‌కు రూ.1.03 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. గతేడాది పండుగ రోజుల్లో రీజియన్‌కు రూ.6.93 కోట్లు ఆదాయం రాగా ..ఈ ఏడాది అదే రోజుల్లో రూ.8.23 కోట్ల ఆదాయం సమకూరింది. దసరా, సంక్రాంతి పండుగలతో అదనపు ఆదాయాన్ని రాబట్టుకుంటున్న నల్లగొండ రీజియన్‌ అంతే వేగంతో మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు కేటాయించింది. దీంతోపాటు చెర్వుగట్టు బ్రహోత్సవాలకు  ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

మేడారం జాతరకు : లక్షలాది భక్తులు తరలివచ్చే మేడారం జాతరకు రీజియన్‌ నుంచి 350 బస్సులు కేటాయించారు. దేశంలోనే అతిపెద్ద జాతర కావడంతో భక్తుల రద్ధీ దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రీజియన్‌ల నుంచి మేడారానికి బస్సులు పంపిస్తున్నారు. అయి తే ఏటికేడు భక్తుల రద్ధీ పెరుగుతున్నందున బస్సు ల సంఖ్య కూడా పెంచారు. గతేడాది 320 బస్సులు పంపగా ఈ ఏడాది అదనంగా 30 బస్సులు పెంచా రు. జిల్లాలోని ఏడు డిపోల నుంచి పల్లెవెలుగు 279, ఎక్స్‌ప్రెస్‌ 52, డీలక్స్‌ 19 బస్సులు పంపుతున్నట్లు ఆర్‌ఎం విజ య్‌కుమార్‌ తెలిపారు. దేవరకొండ డిపోనుంచి 45, నల్లగొండ 55, నార్కట్‌పల్లి 40, మిర్యాలగూడ 50, కోదాడ41, సూర్యాపేట 55, యాదగిరిగుట్ట డిపో నుంచి–64 బస్సులు కేటాయిం చారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు మేడారంలోనే బస్సుల రాకపోకలు సాగిస్తాయి.

కొత్తగా మినీ బస్సులు....
రెండో విడత కింద నల్లగొండ రీజియన్‌కు కొత్తగా 15 మినీ బస్సులు మంజూరు చేశారు. దీంట్లో నల్లగొండ డిపోనకు–3, దేవరకొండ–3, మిర్యాలగూడ–2, కోదాడ–4, యాదగిరిగుట్ట డిపోనకు 3 బస్సులు కేటాయించారు. పల్లెవెలుగు బస్సుల స్థానంలో కొత్తగా మినీ బస్సులు ప్రవేశపెట్టారు. 31 సీట్ల సామర్ధ్యంతో ఉన్న మినీ బస్సుల్లో కండక్టర్లు ఉండరు. టిమ్స్‌ మిషన్‌లతోనే డ్రైవర్లే టిక్కెట్లు ఇస్తారు. ఈ బస్సుల్లో విద్యార్థులు ఎక్కేందుకు అనుమతి లేదు. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉన్న మార్గాలు, విద్యార్థులు తక్కువగా ఉన్న రూట్లలోనే మినీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. దీంతోపాటు పల్లెవెలుగు బస్సుకు కిలోమీటరకు అయ్యే ఖర్చు రూ.8లు కాగా, మినీ బస్సులకు రూ.7 మాత్రమే అవుతుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రయాణికుల రద్ధీ (ఓఆర్‌) పెంచేందుకు ఆర్టీసీ మినీ బస్సులను రోడ్ల మీదకు తీసుకొస్తోంది. ఈ బస్సుల రాకతో నష్టాల బాట నుంచి ఆర్టీసీ బయటపడే అ వకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement