సాక్షి, కటారా : జమ్మూకశ్మీర్‌లోని సుప్రసిద్ధ వైష్ణోమాత ఆలయానికి దుర్గా నవరాత్రుల సందర్భంగా భక్తులు పోటెత్తారు. నవరాత్రులు మొదలైన మూడురోజుల్లోనే అమ్మావారిని లక్షకు పైగా భక్తులు దర్శించారని అధికారులు వెల్లడించారు. రాజధాని జమ్మూకు 42 కిలోమీటర్ల దూరంలో.. కటారా బేస్ క్యాంప్‌కు దగ్గరగా ఉన్న ఆలయానికి.. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నవరాత్రుల్లో మొదటి రోజు గురువారం నాడు 40 వేలమంది, రెండోరోజు శుక్రవారం 27 వేల 500 మంది, మూడోరోజు శనివారం 40 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు రిజిస్ట్రేషన్ ఇన్‌చార్జి అధికారి మహేశ్ సింగ్ చెప్పారు. శుక్రవారం నాడు.. దక్షిణ జమ్మూలో టెర్రరిస్టులు బాంబులు పేల్చడంతో.. భక్తుల సంఖ్య తగ్గిందని ఆయన తెలిపారు.
నవరాత్రులు.. అందులోనూ భక్తులు అమ్మావారిని దర్శించుకునేందుకు విపరీతంగా వస్తుండడంతో.. టెర్రిరిస్ట్ దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వైష్ణోదేవి ఆలయానికి, భక్తులకు భారీ రక్షణ ఏర్పాట్లు చేశామని జమ్మూ కశ్మీర్ మంత్రి అజయ్ నందా ప్రకటించారు.