114 మంది పాకిస్తానీయులకు భారత పౌరసత్వం
అహ్మదాబాద్: భారత్ భిన్నత్వంలో ఏకత్వం ఉన్నదేశం. బ్రతుకు దెరువుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. ఎంతో మంది వలస జీవుల పాలిట కల్పతరువు అయ్యింది. విదేశాలనుంచి వచ్చిన ఆశ్రయం కల్పిస్తుంది. అలాంటి సంఘటనలు కోకొల్లలు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడినవారు ఎంతోమంది. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది.
పాకిస్తాన్ నుంచి వచ్చి గుజరాత్‌లో స్థిరపడిన 114 మందికి భారత పౌరసత్వం లభించింది. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతానికి చెందిన నందలాల్ మెఘానీ కుటుంబం 16ఏళ్ల క్రితం గుజరాత్ వలస వచ్చి ఇక్కడే స్థిరపడింది. ఈసందర్భంగా నందలాల్ మెఘానీ మాట్లాడుతూ నేరాలు, ఉగ్రదాడులులకు భయపడి తన భార్య, కుమారులతో ఇండియాకు వలస వచ్చినట్లు తెలిపారు. త్వరలో తన కోడలుకు కూడా భారత పౌరసత్వం కోసం ధరఖాస్తు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మెఘానీ ఆటో మొబైల్స్ వ్యాపారం చేసుకుంటుండగా ఆయన కుమారుడు మెడికల్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
మరో పాకిస్తానీయుడు కిషన్‌లాల్ అందానీ మాట్లాడుతూ 2005లో తన నలుగురు కుమారులతో కలిసి భారత్ వలస వచ్చినట్లు తెలిపారు. ఉగ్రవాద దాడులతో తాను ఉంటున్న థర్పాకర్ ప్రాంతం అట్టుడుకేదని, జీవనం గగనమైందని, ఆసమయంలో భారత వచ్చి స్థిరపడినట్లు తెలిపారు. ప్రస్తుతం తాము భారత్‌లో చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు.
భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం, భారత పౌరసత్వం కోరుతూ వచ్చిన దరఖాస్తులపై జిల్లా కలెక్టర్‌దే తుది నిర్ణయం. ఈ సందర్భంగా అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ వద్దకు భారత పౌరసత్వం కోరుతూ వందల్లో దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటి పరిశీలించి, విచారణ జరిపిన అనంతరం కలెక్టర్ అవంతిక సింగ్ 114 మందికి పౌరసత్వం జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో విడతలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 216 దరఖాస్తులను పరిశీలిస్తామని, వీటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.