16 మంది నేరస్తులు.. 81% కోటీశ్వరులు | 16 criminals, 95 crorepati mla's in panjab assembly | Sakshi
Sakshi News home page

16 మంది నేరస్తులు.. 81% కోటీశ్వరులు

Published Wed, Mar 15 2017 4:33 PM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM

16 మంది నేరస్తులు.. 81% కోటీశ్వరులు - Sakshi

16 మంది నేరస్తులు.. 81% కోటీశ్వరులు

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో 16 మంది నేరస్తులు ఉండగా.. మొత్తం ఎమ్మెల్యేలలో 81 శాతం మందికి పైగా కోటీశ్వరులే ఉన్నారు. ఈ వివరాలను అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) సంస్థ తెలియచేసింది. నామినేషన్ల దాఖలు సందర్భంగా వారు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఎమ్మెల్యేల నేరచరిత్ర​, ఆస్తులు, విద్య, వయసు వివరాలపై విశ్లేషించి ఒక సమగ్ర నివేదికను ఆ సంస్థ విడుదల చేసింది. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో  కాంగ్రెస్‌ పార్టీ 77, ఆమ్ ఆద్మీ పార్టీ 20, శిరోమణి అకాలీదళ్ 15,  బీజేపీ 3, ఇతరులు 2 స్థానాలు గెలుచుకున్నారు.

16 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులున్నాయి. ఇది మొత్తం సభ్యులలో 14%. వీరిలో 11 మందిపై సీరియస్‌ క్రిమినల్‌ కేసులు (దోపిడీ, దొంగతనం), హత్యానేరం, హత్యాయత్నం ఆరోపణలు ఉన్నవారు ముగ్గురు. ఇందులో ఇద్దరు కాంగ్రెస్కు చెందిన వారు కాగా, మరొకరు లోక్ ఇన్సాఫ్ పార్టీకి చెందినవారు. రాజా సాన్సీ నియోజక వర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్ బిందర్ సింగ్పై మహిళల మీద నేరం చేసిన కేసు నమోదై ఉంది.  2012లో నేర చరిత్ర ఉన్నవారు 16% కాగా తాజా ఎన్నికల్లో వారి సంఖ్య తగ్గింది. పార్టీల పరంగా చూస్తే 77 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్లో సీరియస్ క్రిమినల్ కేసులు ఏడుగురిపై, క్రిమినల్ కేసులు 9 మంది పైన ఉన్నాయి. 20 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలో సీరియస్ క్రిమినల్ కేసులు మరో ఒకరిపై , క్రిమినల్ కేసలు నలుగురిపై ఉన్నాయి. శిరోమణి అకాలీదళ్ పార్టీలో సీరియస్ క్రిమినల్ కేసులు ఒకరిపై, క్రిమినల్ కేసులు మరో ఒకరిపై ఉన్నాయని తెలిపింది.

కోటీశ్వరులు ఎక్కువే..: 117మంది ఎమ్మెల్యేలలో 95(81%) మంది కోటీశ్వరులు ఉన్నారు. 2012లో వీరి సంఖ్య 103(88%)గా ఉంది. అప్పటి ఎన్నికలతో పోలిస్తే రెండు శాతం తగ్గారు. పార్టీ పరంగా చూస్తే కాంగ్రెస్ నుంచి 67 (87%)మంది, అకాలీదళ్ నుంచి 15(100%) మంది, బీజీపీ నుంచి ఇద్దరు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 8మంది కోటీశ్వరులు ఉన్నారు. గత 2012 ఎన్నికల్లో సగటు​ ఎమ్మెల్యే ఆస్తి రూ.10.10 కోట్లు కాగా 2017లో రూ.11.78 కోట్లకు చేరింది. పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ సభ్యుల సగటు ఆస్తి రూ.12.43 కోట్లు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు రూ.8.33 కోట్లు, అకాలిదళ్ సభ్యులు రూ.14.54 కోట్లు, బీజేపీ సభ్యులు రూ.5.20 కోట్లు, లోక్ ఇన్సాఫ్ పార్టీ సభ్యులు రూ.10.14 కోట్లు సగటు ఆస్తులు కలిగి ఉన్నారు. కాంగ్రెస్కు చెందిన రానా గుర్జీత్ సింగ్ రూ. 169 కోట్లతో ప్రథమ స్థానంలో ఉండగా, అకాలీదళ్‌కు చెందిన సుఖ్బీర్ సింగ్ రూ.102 కోట్లతో రెండోస్థానంలో, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అమన్ అరోరా రూ.65 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఏడాదికి తమకు కోటికి పైగా ఆదాయం ఉందని చెప్పిన వాళ్లు ఆరుగురు ఉన్నారు. వారిలో నవజ్యోత్ సింగ్ (కాంగ్రెస్) రూ.9కోట్లు, అమన్  ఆరోరా (ఆప్) రూ.4కోట్లు, రాణా గుర్జీత్ సింగ్ రూ.2కోట్లు వార్షిక ఆదాయం వస్తున్నట్లు ప్రకటించారు. రూ.కోటి పైగా ఆదాయం ఉన్న జగదేవ్ సింగ్(ఆప్), సుఖ్జిత్ సింగ్(కాంగ్రెస్), దర్శన్ సింగ్లు తమ ఆదాయ వివరాలు తెలపలేదు. మొత్తం 117 మంది ఎమ్మెల్యేలలో 45మంది 5- 12 తరగతి మధ్య చదివినవారు ఉండగా, 70 మంది డిగ్రీ, ఆపై చదువులు చదివారు.  25-50 ఏళ్ల వయస్సు ఉన్నవారు 51 మంది ఉన్నారు. 65 మంది 51-80 మధ్య వయస్సు వాళ్లు ఉన్నారు. 2012లో 14 మంది మహిళలు ఎమ్మెల్యేలు ఉండగా 2017లో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement