సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తరచూ మహిళలు, చిన్న పిల్లలపై చోటుచేసుకుంటున్న అత్యాచార, హత్యా ఘటనలు ఓవైపు కలవరపెడుతుండగా.. వాటన్నింటిపై తక్షణ చర్యలు తీసుకుని బాధితుల పక్షాన నిలవాల్సిన శాసన కర్తలే నిందితులైతే వారి గోడు వినే వారెవ్వరు... చట్టాలు చేసి మృగాళ్ల పీచమణిచే దిక్కెవ్వరు..! దేశవ్యాప్తంగా గత అయిదేళ్లలో 45 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మహిళలపై అత్యాచార, హత్యా ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో పేర్కొంది.
అత్యాచార ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న12 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, 11 మందితో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ చెరో 5 మందితో తరువాతి స్థానాల్లో ఉన్నాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ 48 మందిలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాగా, 7గురు శివసేన , 6గురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఏడీఆర్ వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా గత అయిదేళ్ల కాలంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న 327 మందికి ప్రముఖ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీచేయడానికి టికెట్లు ఇచ్చాయని ఏడీఆర్ తెలిపింది. ఈ మొత్తం సభ్యుల్లో 40 మంది లోక్‌సభ, రాజ్యసభలకు, మిగతా 287 మంది రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో పోటీచేయడానికి టికెట్ పొందారని పేర్కొంది. మరో 118 మంది స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేశారని తన రిపోర్టులో వెల్లడించింది.
వీరిలో 18 మంది పార్లమెంటుకు, మిగతా 100 మంది అసెంబ్లీలకు పోటీ పడ్డారని బయటపెట్టింది. ఎన్నికల్లో టికెట్లు పొందిన ఈ మొత్తం నేతల్లో అత్యధికంగా 65 మంది మహారాష్ట్ర నుంచి ఎన్నికల్లో పోటీ చేయగా.. బిహార్ నుంచి 62 మంది, పశ్చిమ బెంగాల్ నుంచి 52 మంది పోటీ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 327 మందిలో బీజేపీ 47 మంది అభ్యర్థులకి టికెట్ ఇచ్చి మొదటి స్థానంలో నిలవగా, బీఎస్పీ 35 మందికి, కాంగ్రెస్ 24 మందికి టికెట్లు కేటాయించి తరువాతి స్థానాల్లో ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment