సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. బీజేపీలోకి వచ్చేందుకు వారు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్.. తామే బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఎన్డీఏలో చేరబోతున్నామంటూ అబద్ధాలు చెబుతున్నారని, ఎవరూ పార్టీ వీడకుండా డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీయేలో చేర్చుకోలేదని, ఇప్పుడు మునిగిపోయే నావ, ఒక్కసీటు కూడా రాని ఆ పార్టీ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం పార్టీ నేతలతో సమావేశమైన సంజయ్, మలిదశ ప్రజాహిత యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
అవినీతిపరులను రానీయం
‘కేసీఆర్ భాషలో చెప్పాలంటే మెడమీద తలకాయ ఉన్నోడెవ్వడూ బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోడు. ఒకవేళ అదే జరిగితే బీజేపీలో సగం మంది అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా వెనుకాడతారు. కేసీఆర్ వెళ్లి కలిసినా ఎన్డీఏలో చేర్చుకునేది లేదని మోదీ తెగేసి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన బహిరంగంగానే చెప్పారు. బీజేపీకి సొంతంగానే 400 సీట్లు రాబోతున్నాయి. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించే వాళ్లు, బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వంపై నమ్మకం ఉన్నోళ్లు ఎవరు వచి్చనా పార్టీ లోకి స్వాగతిస్తాం. అవినీతిపరులను మాత్రం రానీయం. ఇది మోదీ విధానం.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు బహిష్కరించబోతున్నారు
కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా ఏమీ లేదని ప్రజలు గ్రహించారు. ఈసారి బీజేపీకి ఓటేయాలనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీ వైపు రాముడున్నాడు.. నరేంద్రమోదీ ఉన్నాడు..కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వైపు రజకార్లున్నరు..ఎంఐఎం నేతలున్నరు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బహిష్కరించబోతున్నరు.
బీఆర్‌ఎస్ అవినీతిపై కళ్ల ముందు ఇన్ని ఆధారాలున్నా కేసీఆర్, అప్పటి మంత్రులు, బాధ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదు? ఎన్నికలకు ముందు కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు మాట తప్పుతోంది? సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ తేలి్చన తరువాత కూడా సీబీఐతో విచారణను ఎందుకు కోరడం లేదు? బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్, కేటీఆర్‌ను జైల్లో వేసి, వాళ్ల ఆస్తులు జప్తు చేసే వాళ్లం..’అని సంజయ్ అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ
‘తొలిదశ ప్రజాహిత యాత్రకు మంచి స్పందన లభించింది. ఈనెల 25 నుంచి మలి విడత యాత్రను కొనసాగిస్తాం. మధ్యలో మూడురోజుల పాటు (ఈ నెల 20 నుంచి) రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు బస్సు యాత్రల్లో పాల్గొంటాం. తెలంగాణలో 17కు 17 ఎంపీ స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్ పార్లమెంట్‌లో బోగస్ ఓట్లు ఏరివేస్తే ఈసారి అక్కడ గెలుపు బీజేపీదే. బీఆర్‌ఎస్‌కు ఒక్కసీటు కూడా దక్కే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది..’అని సంజయ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment