దొంగల్లో కలిసేటోళ్ల గురించి బాధ వద్దు
ఆలోచించాల్సిన అవసరం అసలు లేదు
ఒక్కరు బయటకు వెళ్తే పది మందిని తీర్చిదిద్దుకునే సత్తా మనకుంది
పార్టీ నాయకులు, కార్యకర్తలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నుంచి వెళ్లి దొంగల్లో కలుస్తున్న నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, వారి గురించి బాధ పడొద్దని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సమైక్యవాదులతో నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్‌ఎస్ శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు ఎంతమాత్రం లెక్క కాదన్నారు. ఒక్కరు పార్టీ నుంచి బయటకు వెళ్తే పది మంది నాయకులను తీర్చిదిద్దుకునే సత్తా బీఆర్‌ఎస్‌కు ఉందని చెప్పారు.
‘తెలంగాణ ఉద్యమ సాధన కోసం నడుం కట్టినపుడు మనతో ఎవరున్నారు? నాడు, నేడు, ఏనాడైనా నాయకులను పార్టీయే తయారు చేసుకుంటుంది. పార్టీ తయారు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే దొంగల్లో కలిశాడు. భవిష్యత్తులో అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారు చేసుకుంటుంది. భవిష్యత్తులో కార్యకర్తల నుంచి మెరికల్లాంటి యువ నాయకులను సృష్టిస్తా..’అని కేసీఆర్ అన్నారు. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచి్చన నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో ఆయన భేటీ అయ్యారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీఆర్‌ఎస్సే
‘తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు అనేకం మిగిలి ఉన్నాయి. తెలంగాణ ఆకాంక్షలు, కలలు నెర వేర్చగలిగే అవగాహన బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంది. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకు ని పరిష్కరించగలిగే సత్తా ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన మన పారీ్టకే ఉంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అబద్ధపు ప్రచారాలకు లోనై కొన్నిసార్లు ప్రజలు బోల్తా పడుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో అలా జరిగినంత మాత్రాన నిరుత్సాహపడొద్దు. అధికారం ఉంటేనే పని చేస్తామనే పద్ధతిని వీడి ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాలి. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి బీఆర్‌ఎస్ అంతిమ లక్ష్యం. నెరవేరాల్సిన ప్రజల కలలను పూర్తి స్థాయిలో నెరవేర్చేది బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే..’ అని కేసీఆర్ చెప్పారు.
రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి
‘మనం రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజల కోసం పనిచేయాల్సి ఉంది. ప్రజలు పదేళ్లు అధికారమిస్తే కులమతాలకు అతీతంగా పనిచేసి వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ తదితర రంగాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి ప్రజా సమస్యలు పరిష్కరించాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాం..’అని బీఆర్‌ఎస్ అధినేత పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వైద్యుడిగా, ఎమ్మెల్యేగా ప్రజా సేవతో మన్ననలు పొందుతున్నారని అభినందించారు.
ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, జాజుల సురేందర్, గంప గోవర్దన్, హనుమంతు షిండే, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేశ్, పెద్దపెల్లి బీఆర్‌ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నేతలతో ప్రత్యేకంగా జరిపిన భేటీలో పార్టీ బలోపేతంపై కేసీఆర్ చర్చించారు.
సందడిగా ఎర్రవల్లి పరిసరాలు
కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లి నివాసానికి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తుండటంతో ఫామ్ హౌస్ పరిసరాలు సందడిగా మారాయి. వాహనాల రద్దీతో హడావుడి నెలకొంది. నినాదాలు చేస్తూ పోటెత్తుతున్న నేతలు, కార్యకర్తలు కేసీఆర్‌కు పుష్పగుచ్చాలు, మొమెంటోలు ఇచ్చి ఫోటోలు దిగేందుకు పోటీలు పడుతున్నారు.
ఆత్మియ సమావేశాలకు విరామం
మూడు రోజుల పాటు కేసీఆర్‌కు విశ్రాంతి
సాక్షి, హైదరాబాద్: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలకు మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. శని, ఆది, సోమవారాల్లో మూడు రోజుల పాటు కేసీఆర్‌కు విశ్రాంతి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఆత్మియ సమావేశాలు తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యేది వెల్లడిస్తామని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.
రెండు వారాలుగా కేసీఆర్ ఆత్మియ సమావేశాలు కొనసాగిస్తుండగా, పక్షం రోజుల్లో సుమారు 50 వేల మందికి పైగా మంది కార్యకర్తలు, ప్రజలు ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందస్తు సమాచారం అందుకుని కేసీఆర్‌ను కలుస్తున్నారు. ఎర్రవల్లి నివాసానికి వస్తున్న వారిని కేసీఆర్ పలకరిస్తూ వారితో ఫొటోలు, సెలీ్ఫలు దిగుతున్నారు. ఈ ఆత్మియ సమావేశాలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా షెడ్యూల్‌ను ప్రకటిస్తామని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment