వలసల అడ్డుకట్టపై బీఆర్‌ఎస్ అధిష్టానం ఫోకస్
అధికార పార్టీ వలలో నేతలు, ఎమ్మెల్యేలు
ఇప్పటికే కారు దిగిన అరడజను మంది ఎమ్మెల్యేలు
కేకే, కడియం, ఇంద్రకరణ్ లాంటి ముఖ్య నేతలూ జంప్
పదవులు అనుభవించిన నేతలే వెళుతుండటంతో శ్రేణుల్లో అయోమయం
ఎమ్మెల్సీలతో పాటు మరింత మంది నేతలపై కాంగ్రెస్ దృష్టి
కేసీఆర్ అప్రమత్తం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో లంచ్ భేటీలు
ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలతో వరుస సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో వలసల రాజకీయం జోరుగా సాగుతోంది. విపక్ష బీఆర్‌ఎస్ పారీ్టకి చెందిన నేతలకు అధికార కాంగ్రెస్ వల విసురుతోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కారు దిగి హస్తం గూటికి చేరగా, తాజాగా కాలె యాదయ్య చేరికతో ఇప్పటివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్న గులాబీ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. శాసనమండలిలో అధికార పారీ్టకి నామమాత్ర సంఖ్యాబలం మాత్రమే ఉండటంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు లక్ష్యంగా కూడా ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. పార్టీ బీ ఫామ్‌పై గెలిచిన నేతలు చేజారకుండా చూసేందుకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేసీఆర్.. వలసలకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సుదీర్ఘ భేటీలు జరుపుతూ బీఆర్‌ఎస్‌లో కొనసాగితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇస్తున్నారు. మరోవైపు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతోనూ ఎర్రవల్లి నివాసంలో వరుస భేటీలు జరుపుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకరొకరుగా కీలక నేతల నిష్క్రమణ
గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఒకరొకరుగా పార్టీ నుంచి నిష్క్రమించడం మొదలు పెట్టారు. వీరంతా పార్టీ అధికారంలో కొనసాగిన కాలంలో కీలక పదవులు అనుభవించిన వారే కావడం గమనార్హం. పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పార్టీని వీడిన ముఖ్య నేతల జాబితాలో ఉన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు అమిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పారీ్టతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్షి్మ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వజూపినప్పటికీ కడియం కూతురు కావ్య, ఎంపీలుగా ఉన్న రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, పి.రాములు తదితరులు ఇతర పారీ్టల్లో చేరి టికెట్లు దక్కించుకున్నారు.
ఇక బీఆర్‌ఎస్‌ను వీడిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పదుల సంఖ్యలోనే ఉన్నారు. కాగా అధికారంలో ఉండగా కీలక పదవులు అనుభవించిన నేతలు కూడా చడీ చప్పుడు లేకుండా రాత్రికి రాత్రే పార్టీ మారడం బీఆర్‌ఎస్‌కు మింగుడు పడని వ్యవహారంగా మారగా..పార్టీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
గ్రేటర్, చుట్టూ జిల్లాలపై కాంగ్రెస్ దృష్టి
అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్‌ఎస్ తరఫున గెలుపొందారు. అయితే ఇప్పటికే దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్‌రావు (భద్రాచలం), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), డాక్టర్ సంజయ్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్) గులాబీ పారీ్టకి గుడ్‌బై కొట్టారు. తాజాగా కాలె యాదయ్య (చేవెళ్ల) కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్‌ఎస్‌కు మెజారిటీ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి చేరికల కోసం కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో సన్నిహిత సంబంధాలు ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మినహా మిగతా వారు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి అనుబంధం ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు విముఖతతో ఉన్నారు. అయితే 2014, 2018 ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరి, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎందరు పారీ్టలో కొనసాగుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో చేరి ప్రత్యేక రాష్ట్రంలో కీలక పదవులు అనుభవించిన నేతలు కేకే, కడియం, పోచారం తదితరులు సైతం పార్టీని వీడటం, మరోవైపు పార్టీ సృష్టించిన నాయకుడు డాక్టర్ సంజయ్ కూడా ని్రష్కమించడంతో ఎవరుంటారో, వీడతారో తెలియని పరిస్థితి బీఆర్‌ఎస్‌లో ఉందనే చర్చ జరుగుతోంది.
భరోసా నింపుతున్న కేసీఆర్
పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఒకరొకరుగా పార్టీనీ వీడుతుండటంతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ఎర్రవల్లి నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేరుగా లంచ్ భేటీలు జరుపుతున్నారు. పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, తన వెంట నిలిచే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందంటూ భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమ సమయంలోనూ పార్టీని బలహీన పరిచేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు, అప్పట్లో ఎదురొడ్డి నిలిచిన తీరును విడమరిచి చెప్తున్నారు.
ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా పారీ్టలో కొనసాగాలని బుజ్జగింపు ధోరణిలో కోరుతున్నారు. మరోవైపు కింది స్థాయిలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతోనూ సమావేశమవుతున్నారు. దీంతో జిల్లాల నుంచి పార్టీ నేతలు కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లి నివాసానికి పోటెత్తుతున్నారు. అయితే కేసీఆర్‌తో భేటీ తర్వాత కూడా కాలె యాదయ్య పార్టీని వీడటం గమనార్హం.
కొత్త నాయకత్వానికి ప్రోత్సాహం
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. కానీ లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక, ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దీంతో సమీప భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసే ఔత్సాహికుల్లో ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న నాయకత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై కేసీఆర్ దృష్టి సారిస్తున్నారు.
ఉద్యమ సమయంలో క్రియాశీలంగా పనిచేసిన యువ నాయకులకు క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గ్యాదరి కిషోర్‌తో పాటు ఎర్రోల్ల శ్రీనివాస్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఆంజనేయ గౌడ్, తొట్ల స్వామి యాదవ్, తుంగ బాలు వంటి నేతలకు క్రియాశీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. పారీ్టలో సుదీర్ఘంగా కొనసాగుతున్న వారికి రాష్ట్ర, జిల్లా కమిటీల్లో కీలక స్థానం ఇచ్చే దిశలో కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment