
హైకోర్టుల సిబ్బంది 25 శాతం పెంపు
14 వేల సబార్డినేట్ కోర్టుల కంప్యూటరీకరణ: కేంద్రం
సాక్షి, బెంగళూరు: దేశంలోని హైకోర్టుల సిబ్బందిని 25 శాతం పెంచేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశంలో వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న 4,300కుపైగా జ్యుడీషియల్ అధికారి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన ఆదివారమిక్కడి నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ(ఎన్‌ఎస్‌ఐఎల్) 22వ వార్షికోత్సవంలో ప్రసంగించారు.
పెండింగ్ కేసుల వల్ల కోర్టులపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ కంప్యూటరీకరణలో భాగంగా 14వేల సబార్డినేట్ కోర్టులను కంప్యూటరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాజ్యాంగ విలువలు ప్రతిఫలించే న్యాయవ్యవస్థను ప్రజలకు అందజేయడానికి ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ బిల్లుకు సంబంధించిన రాజ్యంగ సవరణను రాష్ట్రాలు ఆమోదించాక న్యాయవ్యవస్థలో గణనీయ మార్పులు వస్తాయన్నారు. ఎన్‌ఎస్‌ఐఎల్ వార్షికోత్సవ కార్యక్రమానికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆర్.ఎం. లోథా, వర్సిటీ చాన్స్‌లర్‌లు అధ్యక్షత వహించగా, న్యాయవాదులు, జడ్జీలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.