ఐటీ కంపెనీలపై ఫిర్యాదుల క్యూ
చెన్నై: తమిళనాడులో పలు కంపెనీలపై కార్మికశాఖకు ఫిర్యాదులు అందాయి. దాదాపు 275 ఫిర్యాదులు సోమవారం అందినట్లు తమిళనాడు కార్మిక శాఖ వెల్లడించింది. ఒక పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఈ రోజు కూడా తమను కంపెనీలకు హాజరుకావాలని ఆదేశించారంటూ ఫిర్యాదు దారులు అందులో పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు, దుకాణాలు, హోటళ్లు తదితర సంస్థలు తమ ఉద్యోగస్తులను ఓట్ల సమయంలో కూడా పనిలోకి రావాలని ఇబ్బంది పెట్టినట్లు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
'కార్మిక శాఖ కంట్రోల్ రూంకు అందిన ఫిర్యాదుల్లో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలపైనే ఎక్కువగా ఉన్నాయి.. తర్వాత స్థానాల్లో దుకాణాలు, హోటళ్లు ఉన్నాయి. మొత్తం 275 కంప్లెయిట్స్ మాకు అందాయి. వీటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించాం' అని తమిళనాడు కార్మిక శాఖ తెలిపింది. ఎంతోమంది తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పని చేసే ప్రాంతాల నుంచి స్వస్థలానికి వెళ్లారని, సాయంత్రంలోగా ఓటు వినయోగించుకొని తిరిగి రావడం సాధ్యం కాదని, రాత్రి షిప్టులకు సైతం హాజరుకావడం కుదరదని, అయినా, తమకు అలాంటి ఆదేశాలే సదరు కంపెనీలు ఇచ్చాయంటూ వారు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.