చెన్నై: ఒకటి రెండూ కాదు ఏకంగా 16 గంటలపాటు విమానంలో బందీలుగా మారిన చేదు అనుభవాన్ని చెన్నై-రియాద్ విమానంలోని 292 మంది ప్రయాణికులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రియాద్ వెళ్లే సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ విమానం 292 మంది ప్రయాణికులతో ఆదివారం ఉదయం చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరింది.
కేరళ రాష్ట్రం కొచ్చికి చేరువవుతున్న సమయంలో తీవ్రమైన సుడిగాలులు వీచడంతో చెన్నైకి తిరిగి వచ్చేసింది. కొద్దిసేపు వేచిచూశాక ప్రయాణం ప్రారంభిస్తామని ప్రయాణికులు చెప్పి.. వారిని విమానంలోనే ఉంచేశారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో వాతావరణం అనుకూలంగా ఉందని సమాచారం అందింది. అప్పటికి విమాన పైలట్, కో-పైలట్ల డ్యూటీ సమయం పూర్తవడంతో వారు వెళ్లిపోయారు.
దీంతో రాత్రి 11 గంటలకు మరో విమానంలో రియాద్‌కు తీసుకెళ్తామని ఎయిర్‌హోస్టెస్‌లు ప్రకటించారు. 11 గంటలకు కూడా విమానం రాకపోవడంతో మరో విమానం ఒంటిగంటకు వస్తుందని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమను విమానం నుంచి బయటకు పంపించేయాలని, ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా గమ్యస్ధానానికి వెళ్లిపోతామని కోరారు. అయితే, ఎయిర్‌హోస్టెస్ అందుకు నిరాకరించారు.
దీంతో మరింత మండిపడిన ప్రయాణికులు గంటల తరబడి విమానంలో ఆకలితో అలమటిస్తున్నామని కేకలు వేయడంతో హాడావిడిగా ఆహారపొట్లాలు పంపిణీ చేశారు. తమను రిసీవ్ చేసుకునేందుకు కొచ్చిలో కాచుకుని ఉన్న తమ వారికి సైతం ఆహారం సరఫరా చేయాలని ప్రయాణికులు పట్టుబట్టగా సిబ్బంది అందుకు అంగీకరించలేదు. కొచ్చిలో పంపిణీ జరగకుంటే తాము కూడా తినేది లేదని ప్రయాణికులు భీష్మించారు.
కొన్ని గంటల పోరాటం తరువాత సోమవారం తెల్లవారుజామున 40 మంది స్పెషల్ క్లాస్ ప్రయాణికులను మాత్రం విమానం నుంచి దింపి గట్టి బందోబస్తుతో చెన్నైలోని ఒక హోటల్‌కు చేర్చారు. మిగతా ప్రయాణికులు గత్యంతరం లేక ఆహారం తీసుకుని విమానంలోనే గడిపారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ విమానం చెన్నైకి చేరుకోగా.. అందులోని ప్రత్యామ్నాయ పైలెట్లు విధుల్లో చేరారు. ఉదయం 10 గంటలకు ఈ విమానం కొచ్చికి బయలుదేరింది. సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ నిర్వాహణ లోపం 292 మంది ప్రయాణికుల పాలిట శాపంగా మారడంతో 16 గంటలపాటూ బందీలుగా నానాయాతన అనుభవించారు.
292 మంది.. 16 గంటల పాటు..
Published Mon, Aug 7 2017 9:11 PM | Last Updated on Mon, Aug 20 2018 7:33 PM
Advertisement