స్మగ్లింగ్ కేసులో 56 గాడిదల అరెస్ట్!
ముంబై: సాధారణంగా చర్చలు, వాదోపవాదాలతో ఎపుడూ హాట్హాట్గా ఉంటాయి చట్టసభలు. ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో దద్దరిల్లే సభల్లో అపుడపుడూ నవ్వులు పూయడం కూడా మామూలే. ఇలాగే మహారాష్ట్ర శాసనసభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఇసుక మైనింగ్ మాఫియాపై సీరియస్గా చర్చ నడుస్తుండగా మహారాష్ట్ర అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే చెప్పిన విషయం విన్న సభ్యులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారనే నెపంతో ఎవరిని అదుపులోకి తీసుకున్నారో తెలిస్తే మనం కూడా ఔరా అనాల్సిందే! ఇంతకీ ప్రభుత్వం అరెస్టు చేసింది గాడిదలను... అవును అక్షరాలా 56 గాడిదలను.
చంద్రభాగా నదీతీరంలోని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 56 గాడిదలను అదుపులోకి తీసుకున్నామని మంత్రి ప్రకటించారు. ఇసుక బస్తాలను మోసుకెళ్తున్నందుకే వాటిని అరెస్టు చేశామన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని హోమ్లో వాటి ఆలన పాలన చూస్తున్నామని తెలిపారు. వాటికి మంచి ఆహారాన్నందిస్తూ కాపాడుతున్నామని ప్రకటించారు.
ఇసుక మాఫియాను అడ్డుకునే క్రమంలో ఒక్క సాక్ష్యాన్ని కూడా విడిచిపెట్టకూడదు... మంచి పనిచేశారంటూ ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ సోపాల్ చమత్కరించారు. పాపం, గాడిదలకు ఏమి తెలుసు, తాము మోస్తోంది, బంగారమో లేక ఇసుకో.. అంటూ కామెంట్ చేశారు. వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది... అన్ని వసతులు కల్పించాల్సిందే అని కూడా వ్యాఖ్యానించారు. దీంతో సభ్యులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.
దీనికి మంత్రి సమాధానం చెబుతూ గాడిదల సంక్షేమం కోసం ఆదేశాలిచ్చాం... నిజానికి వాటి యజమానులమంటూ ఎవరూ ముందుకు రాకపోయినా వారికోసం వెతుకుతున్నాం. అంతేగానీ.. ఇక్కడ ఉన్నారన్నామా అంటూ విపక్షాల వ్యంగ్యాన్ని తిప్పికొట్టారు.