
కారులో భార్యను పొడిచి చంపిన భర్త
న్యూఢిల్లీ: కారులో గొడవపడి భార్యను కిరాతకంగా హత్య చేశాడో భర్త. దక్షిణ ఢిల్లీలోని ఆనంద్ నికేతన్ ప్రాంతంలో బుధవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో తీవ్ర వాగ్వాదం జరగడంతో విచక్షణ కోల్పోయిన భర్త కత్తితో ఆమెను పొడిచి చంపాడు.
కారులో వెళుతుండగా మంజు మోంగా(58)కు ఫోన్ వచ్చిందని, ఆమె ఎక్కువసేపు ఫోన్ లో మాట్లాడుతుండగా భర్త ముఖేశ్ అడ్డుచెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైందని పోలీసులు తెలిపారు. కోపోద్రిక్తుడైన ముకేశ్(60) కత్తితో పొడిచి భార్యను హతమార్చాడని చెప్పారు. కారులో పారిపోయేందుకు ప్రయత్నించిన ఆయనను ఛేజ్ చేసి పట్టుకున్నారు. 30 ఏళ్ల క్రితం ముకేశ్, మంజులకు పెళైందని.. కూతురు, కొడుకుతో కలిసి తూర్పు ఢిల్లీలోని హరినగర్ లో నివాసం ఉంటున్నారని పోలీసులు వెల్లడించారు.
మరో వ్యక్తితో మంజు చనువుగా ఉండడం, తన సమక్షంలోనే అతడితో ఫోన్ మాట్లాడుతుండడం తట్టుకోలేక ముకేశ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. భార్యను చంపాలని అతడు ముందుగా కుట్ర పన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడికి తాగుడు అలవాటు ఉందని, ఇంట్లోలోనూ భార్యను హించించేవాడని పొరుగింటివారు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.