75 వేల మంది చదువుకున్న బిచ్చగాళ్లు!
మన దేశంలో ఎంతమంది బిచ్చగాళ్లున్నారో తెలుసా.. అక్షరాలా 3.72 లక్షల మంది. వాళ్లలో 21% మంది.. అంటే, 75 వేల మంది శుభ్రంగా చదువుకున్నారు కూడానట. వీళ్లంతా ఇంటర్, డిప్లొమాలు చదివారని ఇటీవల విడుదలైన ఓ నివేదిక చెబుతోంది. వీరిలో ఎక్కువ శాతం మంది సరైన ఉద్యోగం దొరక్క, ఇంటి అవసరాలకు తగిన ఆదాయం లేక... భిక్షాటన చేపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. కొందరైతే డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి కూడా.. ఉద్యోగాలు దొరక్క బిచ్చగాళ్లుగా మారుతున్నారు.
ఇంటర్ చదివి, మంచి ఇంగ్లీష్ మాట్లాడగల్గిన దినేష్... కొన్నాళ్ల పాటు ఆస్పత్రిలో వార్డ్ బాయ్‌గా ఉద్యోగం చేశాడు. రోజుకు వంద రూపాయల వేతనంతో కుటుంబాన్ని ఈడ్చలేని పరిస్థితిలో అతడు భిక్షాటనను ఆశ్రయించాడు. ఇప్పుడు రోజుకు 200 రూపాయలు ఆర్జించగల్గుతున్నానని, పేదరికంలో ఉన్నా తాను నిజాయితీగా బతుకుతున్నానని చెబుతున్నాడు. అహ్మదాబాద్ భద్రకాళి దేవాలయం చుట్టుపక్కల ఉండే సుమారు 30 మంది బిచ్చగాళ్లలో దినేష్ ఒకడు. ఉదయం ఆ ప్రాంతంలోని ఓ వ్యక్తి ఉచితంగా అందించే ఓ కప్పు టీ తాగి... భిక్షాటన ప్రారంభిస్తాడట.
అలాగే 10 గంటల షిఫ్ట్ ఉద్యోగం చేసి కేవలం నెలకు రూ. 3 వేలు కూడా సంపాదించలేని సుధీర్ బాబూలాల్ కథ కూడా అలాంటిదే. చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకురాలేకపోవడంతో భార్య కూడా వదిలేసిందట. ఇక ఇంటితో అవసరం ఏముందనుకున్న సుధీర్... విజాపూర్ టౌన్ నుంచి అహ్మదాబాద్ వచ్చి... నదీతీరంలో భిక్షాటన చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. బీకాం రెండో సంవత్సరం వరకూ చదువుకున్నఅతడు భిక్షాటనతో రోజుకు 150 రూపాయలు సంపాదిస్తున్నాడట. అలాగే గుజరాత్ యూనివర్సిటీలో ఎంకాం పూర్తి చేసిన దశరథ్, ముంబైలో హైస్కూల్ వరకూ చదివిన అశోక్ జైసూర్ ఇలా ఎందరో భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు.
సులభంగా డబ్బు సంపాదనకు అలవాటు పడిన బిచ్చగాళ్ళకు పునరావాసం కల్పించడం కూడా కష్టమైన పనేనని ఈ రంగంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థ మానవ్ సాధనా సభ్యుడు బైరెన్ జోషి చెప్తున్నారు. డిగ్రీల వరకూ చదివిన వారు సైతం బిచ్చగాళ్ళుగా మారడం దేశంలో నిరుద్యోగానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోందని, వారికి సరైన ఉద్యోగాలు లభించకపోవడమే అందుకు కారణమని సామాజికవేత్త గౌరాంగ్ జాని అంటున్నారు.