beggars in india
-
హైటెక్ బిచ్చగాడు.. వీడు మాములోడు కాదు
గంగిరెద్దులు ఆడించే వ్యక్తి క్యూఆర్ కోడ్‌తో దానాలు స్వీకరించే వీడియోను గతంలో షేర్ చేశారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ వృద్ధికి ప్రతీకగా ఆ వీడియోను మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అభివృద్ధి పట్టికలో అట్టడుగున ఉండే బీహార్‌లో ఓ బిచ్చగాడు మెడలో క్యూఆర్ కోడ్ తగిలించుకుని అడుక్కుంటూ వార్తల్లో ట్రెండవుతున్నాడు. బీహార్ రాష్ట్రంలో బెట్టియా రైల్వే స్టేషన్ ఉంది. అక్కడే ఉన్నాడు హైటెక్ బిచ్చగాడు రాజు పటేల్ (40). రైల్వేస్టేషన్లు, రైళ్లలో అడుక్కుంటూ రాత్రి వేళ అక్కడే పడుకుంటూ కొన్నేళ్లుగా జీవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ఎవరిని ధర్మం అడిగినా చిల్లర లేదంటూ చెప్పడం కామన్ అయిపోయింది. దీంతో రాజు పటేల్‌కి బిచ్చం తగ్గిపోయింది. మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్డేట్ అయ్యాడు రాజు పటేల్. గతంలో బిచ్చం ఎత్తుకోగా వచ్చిన డబ్బులతో సమీపంలో బ్యాంకుకి వెళ్లి ఖాతా ఓపెన్ చేశాడు. బ్యాంకు అకౌంట్ ఆధారంగా ఓ డిజిటల్ పేమెంట్ సర్వీస్ అందించే సంస్థ నుంచి ఈ వాలెట్ - క్యూ ఆర్ కోడ్ సాధించాడు. అక్కడితో ఆగిపోలేదు.. తనకు బిచ్చం వస్తుందో రావట్లేదో తెలుసుకునేందుకు ఓ ట్యాబ్ కూడా కొనుక్కున్నాడు. ఎప్పటిలాగే స్టేషన్ ఆవరణలో బిచ్చం అడుక్కోవడం ప్రారంభించారు. అయితే కొత్త పద్దతిలో దీన్ని ప్రారంభించారు. మెడలో క్యూఆర్ కోడ్ ఉన్న ప్లకార్డు, చేతిలో ట్యాబ్‌తో.. ధర్మం చేయండి బాబు అని వేడుకుంటాడు. ఎవరైనా బిచ్చం వేయబోతే వెంటనే మెడలో క్యూఆర్ కోడ్ చూపిస్తాడు. ధర్మం వచ్చింది లేనిది ట్యాబ్‌లో చెక్ చేసుకుంటాడు. Bihar | Raju Patel, a beggar in Bettiah, goes digital; accepts PhonePe & puts a QR code around his neck "I accept digital payments, it's enough to get the work done & fill my stomach," said Raju Patel Visuals from Bettiah railway station pic.twitter.com/nbw83uXop6 — ANI (@ANI) February 8, 2022 రాజు పటేల్ బిచ్చం అడుక్కునే తీరుతో తోటి బిచ్చగాళ్లు అవాక్కవుతున్నారు. ఆ నోటా ఈ నోటా చివరకు రాజు పటేల్ స్టోరీ సోషల్ మీడియాకు చేరుకుంది. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ విస్త్రృతికి ఇదో ఉదాహరణగా కొందరు చెబుతుంటే మరికొందరు డిజిటల్ పేమెంట్స్ వచ్చినా పేదరికం మాత్రం పోవడం లేదంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. -
75 వేల మంది చదువుకున్న బిచ్చగాళ్లు!
మన దేశంలో ఎంతమంది బిచ్చగాళ్లున్నారో తెలుసా.. అక్షరాలా 3.72 లక్షల మంది. వాళ్లలో 21% మంది.. అంటే, 75 వేల మంది శుభ్రంగా చదువుకున్నారు కూడానట. వీళ్లంతా ఇంటర్, డిప్లొమాలు చదివారని ఇటీవల విడుదలైన ఓ నివేదిక చెబుతోంది. వీరిలో ఎక్కువ శాతం మంది సరైన ఉద్యోగం దొరక్క, ఇంటి అవసరాలకు తగిన ఆదాయం లేక... భిక్షాటన చేపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. కొందరైతే డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి కూడా.. ఉద్యోగాలు దొరక్క బిచ్చగాళ్లుగా మారుతున్నారు. ఇంటర్ చదివి, మంచి ఇంగ్లీష్ మాట్లాడగల్గిన దినేష్... కొన్నాళ్ల పాటు ఆస్పత్రిలో వార్డ్ బాయ్‌గా ఉద్యోగం చేశాడు. రోజుకు వంద రూపాయల వేతనంతో కుటుంబాన్ని ఈడ్చలేని పరిస్థితిలో అతడు భిక్షాటనను ఆశ్రయించాడు. ఇప్పుడు రోజుకు 200 రూపాయలు ఆర్జించగల్గుతున్నానని, పేదరికంలో ఉన్నా తాను నిజాయితీగా బతుకుతున్నానని చెబుతున్నాడు. అహ్మదాబాద్ భద్రకాళి దేవాలయం చుట్టుపక్కల ఉండే సుమారు 30 మంది బిచ్చగాళ్లలో దినేష్ ఒకడు. ఉదయం ఆ ప్రాంతంలోని ఓ వ్యక్తి ఉచితంగా అందించే ఓ కప్పు టీ తాగి... భిక్షాటన ప్రారంభిస్తాడట. అలాగే 10 గంటల షిఫ్ట్ ఉద్యోగం చేసి కేవలం నెలకు రూ. 3 వేలు కూడా సంపాదించలేని సుధీర్ బాబూలాల్ కథ కూడా అలాంటిదే. చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకురాలేకపోవడంతో భార్య కూడా వదిలేసిందట. ఇక ఇంటితో అవసరం ఏముందనుకున్న సుధీర్... విజాపూర్ టౌన్ నుంచి అహ్మదాబాద్ వచ్చి... నదీతీరంలో భిక్షాటన చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. బీకాం రెండో సంవత్సరం వరకూ చదువుకున్నఅతడు భిక్షాటనతో రోజుకు 150 రూపాయలు సంపాదిస్తున్నాడట. అలాగే గుజరాత్ యూనివర్సిటీలో ఎంకాం పూర్తి చేసిన దశరథ్, ముంబైలో హైస్కూల్ వరకూ చదివిన అశోక్ జైసూర్ ఇలా ఎందరో భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. సులభంగా డబ్బు సంపాదనకు అలవాటు పడిన బిచ్చగాళ్ళకు పునరావాసం కల్పించడం కూడా కష్టమైన పనేనని ఈ రంగంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థ మానవ్ సాధనా సభ్యుడు బైరెన్ జోషి చెప్తున్నారు. డిగ్రీల వరకూ చదివిన వారు సైతం బిచ్చగాళ్ళుగా మారడం దేశంలో నిరుద్యోగానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోందని, వారికి సరైన ఉద్యోగాలు లభించకపోవడమే అందుకు కారణమని సామాజికవేత్త గౌరాంగ్ జాని అంటున్నారు.