
కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన విమాన ఛార్జీలను తగ్గించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమర్‌నాథ్ యాత్రను నిలపివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యటకులను, యాత్రికులను ఉన్నపలంగా వెనక్కి తిరిగి రావాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఎయిర్ ఇండియాలో ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలో విమాన రేట్లు తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిథి ధనుంజయ కుమార్ ఆదివారం ప్రకటించారు.
శ్రీనగర్ నుంచి ఢిల్లీకి సాధారణ ఛార్జ్ 9500 కాగా, ప్రస్తుత తగ్గింపుతో రూ.6715గా, అలాగే ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు రూ.6,899 కానుంది. ఈ తగ్గింపు ఆగస్ట్ 15 వరకు ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఎయిర్ ఇండియ అథారిటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 6,200 మంది ప్రయాణికులు శ్రీనగర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తమ వద్ద నమోదు చేసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విమాన సంస్థలు ప్రత్యేక సర్వీసులను కూడా నడుపుతున్నాయి. విమాన ఛార్జీల తగ్గింపుపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment