
లక్నో: ప్రముఖ కట్టడం తాజ్‌మహల్ ఎదుట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ ఫొటో దిగితే చూడాలని ఉందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. తాజ్‌మహల్ విషయంలో తాజా వివాదం నేపథ్యంలో దానిముందు యోగి ఎలా ఫొటో దిగుతారన్నది ఆసక్తి కలిగిస్తున్నదని చెప్పారు. ఈ నెల 29న సీఎం యోగి తాజ్‌మహల్‌ను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.
తాజ్‌మహల్ వివాదంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన అఖిలేశ్.. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు దానిని సందర్శించానని, తాజ్‌మహల్ గొప్ప కట్టడమని ప్రశంసించారు. 'నా భార్య డింపుల్‌తో కలిసి నేను తాజ్‌మహల్‌ను సందర్శించాను. అక్కడ మేం ప్రారంభించిన బెంచ్ మీద కూర్చుని ఫొటోలు దిగాం. ఇప్పుడు ముఖ్యమంత్రి తాజమహల్‌ను సందర్శించడానికి వెళ్తున్నారు. అప్పుడు ఆయన తాజ్‌మహల్ ముందు ఫొటో దిగుతారు. ఆ ఫొటో ఎలా ఉంటుందో చూడాలని వేచిచూస్తున్నా' అని అఖిలేశ్ అన్నారు. తాజ్‌మహల్ హిందూ సంస్కృతిపై మచ్చ, తాజ్‌మహల్ శివాలయం అన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అసలు తాజ్‌మహల్ ఏమిటో మొదట బీజేపీ నేతలు తేల్చుకోవాలని సూచించారు.