‘అనుమానం వద్దు.. అఖిలేశే సీఎం’
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు మళ్లీ అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాల్లేవని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ మూడో దశ ఎన్నికల సందర్భంగా సఫాయ్ నియోజకవర్గంలో తన కోడలు అపర్ణాయాదవ్‌తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మళ్లీ అఖిలేశ్ సీఎం అన్నారు.
తన సోదరుడు శివపాల్ యాదవ్ కూడా భారీ మెజార్టీతో గెలుస్తాడంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. మరోపక్క అఖిలేశ్ కూడా తాజా ఎన్నికలపై స్పందిస్తూ ఈసారి కూడా విజయం తమకే వస్తుందని చెప్పారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి భారీ విజయం సాధించనుందని అన్నారు. బీజేపీ దెబ్బతినడం ఖాయమని తెలిపారు. తన తండ్రి ములాయం ఆశీస్సులు తనకు నిండుగా ఉన్నాయని, మళ్లీ అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.