లక్నో : ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పాలక బీజేపీ సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగుతోందని ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. తాను సైనిక స్కూల్‌లో చదివినప్పటికీ సైన్యాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే స్ధాయికి తమ పార్టీ ఎన్నడూ దిగజారదని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపొందేందుకు ఏం చేసేందుకైనా బీజేపీ వెనుకాడదని అఖిలేష్ ధ్వజమెత్తారు.
భారత సైన్యాన్ని బీజేపీ రాజకీయాల్లోకి లాగిందని యావత్ దేశానికీ తెలుసునని ఆయన మండిపడ్డారు. ఓట్ల కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని, ఈ క్రమంలో వారు గోవులు, గంగా నదిని సైతం విడిచిపెట్టలేదని అన్నారు. కాగా, సైనిక సిబ్బంది ఫోటోలను హోర్డింగ్‌లు, ఇతర ప్రచార సామాగ్రిలో వాడరాదని ఈసీ రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీలపై ధ్వజమెత్తడం గమనార్హం.
మరోవైపు పాక్ చెర నుంచి ఇటీవల విడుదలైన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఫోటోతో కూడిన హోర్డింగ్‌లను బీజేపీ నేతలు ప్రదర్శించిన నేపథ్యంలో ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment