‘అక్షర్‌ధామ్’లో షౌకతుల్లాకు విముక్తి
{పాసిక్యూషన్ అభియోగాలు తోసిపుచ్చిన ప్రత్యేక పోటా కోర్టు
నిందితుడు హైదరాబాద్ వాసి
అహ్మదాబాద్ హైదరాబాద్: గుజరాత్‌లోని అక్షర్‌ధామ్ దేవాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వాసి షౌకతుల్లా ఘోరీకి జైలు జీవితాన్నుంచి విముక్తి లభించింది. ఇతడితో పాటు మాజిద్ పటేల్ అలియాస్ ఉమర్జీ అనే మరో నిందితుడినీ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ అహ్మదాబాద్‌లోని ప్రత్యేక పోటా (ప్రివెన్షన్ ఆఫ్ టైస్ట్ యాక్టివిటీస్ యాక్ట్) కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా వీరి పాత్రపై ప్రాసిక్యూషన్ అభియోగాలను కోర్టు తోసిపుచ్చింది. మూడు వారాలక్రితం సుప్రీం కోర్టు ఆరుగురు నిందితులకు స్వేచ్ఛ కల్పించిన విషయం తెలిసిందే. ఇపుడు మిగిలిన ఇద్దరు నిందితులకు పోటా కోర్టు విముక్తి కల్గించింది. కాగా, షౌకతుల్లాను రాష్ట్ర నిఘా వర్గాల సాయంతో గుజరాత్ పోలీసులు 2009 జూలై 18న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అప్పటి నుంచీ అతను సబర్మతి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అక్షర్‌ధామ్ దేవాలయం (స్వామి నారాయణ్ టెంపుల్)పై 2002 సెప్టెంబర్ 24న పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు చెందిన ఇద్దరు సాయుధులు విచక్షణారహితంగా బాంబులు, ఏకే-47లతో దాడి చేసి 30 మందికి పైగా పౌరుల్ని పొట్టనపెట్టుకున్నారు.
50 మంది భక్తులను బందీలుగా చేసుకున్నారు. వారిని విడిపించడానికి ఎన్‌ఎస్‌జీ కమాండోలు ‘ఆపరేషన్ వజ్ర శక్తి’ నిర్వహించారు. కేసు దర్యాప్తు చేసిన గుజరాత్ పోలీసులు ఈ కుట్ర మొత్తం సౌదీలోని రియాద్‌లో జరిగినట్లు గుర్తించి, దాడిలో పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన జైషేమహ్మద్, లష్కరేతోయిబా ప్రమేయం ఉన్నట్లు కనుగొన్నారు. రియాద్, ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, హైదరాబాద్, అహ్మదాబాద్‌ల్లో ఉన్న ఉగ్రవాద మాడ్యూల్స్ ఇందుకు సహకరించాయని నిర్ధారించారు. ఈ దాడిలో హైదరాబాద్‌కు చెందిన ‘ఉగ్ర’ సోదరులు ఫర్హాతుల్లా ఘోరీ, సైదాబాద్‌లోని కూర్మగూడ వాసి షౌకతుల్లా ఘోరీల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నిందితులిద్దరూ తమ మకాంను సౌదీ అరేబియాలోని జెడ్డాకు మార్చారు. రాష్ట్ర నిఘా అధికారులకు షౌకతుల్లా దుబాయ్ నుంచి వస్తున్నట్లు సమాచారం అందడంతో 2009లో అతడిని అరెస్టు చేశారు. ఇతడి సోదరుడు ఫర్హాతుల్లాతో పాటు మేనల్లుడు గిడ్డా అజీజ్ సైతం హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు.