కష్టం ఫలించింది...
ముంబై: వయసులో చిన్నదే గానీ ఆలియా భట్ సాధించిన విజయాలు మాత్రం పెద్దవి. ఈ 21 ఏళ్ల బ్యూటీ నటించిన సినిమాలన్నీ హిట్లు కొట్టాయి. తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తోపాటు హైవే, హంప్టీ శర్మా కీ దుల్హానియా, 2 స్టేట్స్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. కష్టపడడంతోపాటు అదృష్టం కలసి రావడం వల్లే విజయాలు సాధ్యమయ్యాయని ఆలియా చెప్పింది. నాలుగైదు హిట్లు దక్కినంత మాత్రాన గర్వం నెత్తికి ఎక్కడకూడదంది. ‘విజయాన్ని ఎలా కొలుస్తారో నాకు తెలియదు.
నా అదృష్టం కొద్దీ మంచి అవకాశాలు దొరికాయి. సత్తా ఉన్న దర్శకులతో పని చేసే భాగ్యం దక్కింది. వీళ్లు నా నుంచి మంచి నటనను రాబట్టుకున్నా రు. పరిశ్రమలో మంచి స్థానం సంపాదించుకోవడానికి కారకుడైన కరణ్ జోహార్‌కు కృతజ్ఞతలు. శ్రమించే తత్వం, అదృష్టం వల్లే విజయాలు దక్కాయి’ అని వివరించింది. ఆలియా మొదటి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌కు కరణ్ నిర్మాతగా వ్యవహరించాడు. అయితే కెరీర్‌లో ఎన్ని మార్పులు వచ్చినా, తన వ్యక్తిత్వంలో మార్పేమీ లేదని ఈ యువతి చెప్పింది.
ప్రస్తుతం హిట్లు ఖాతాలో ఉన్నా, భవిష్యత్‌లో అపజయాలు ఉంటాయోమోనన్న భయం కూడా వెన్నాడుతోందని తెలిపింది. హిందీ పరిశ్రమలో ఎప్పు డు ఏం జరుగుతుందనేది చెప్ప డం కష్టమని స్పష్టం చేసింది. ఇక ఆలియా తదుపరి సినిమా షాన్‌దార్ కాగా, ఇందులో షాహిద్ కపూర్ హీరో. రణ్‌బీర్ కపూర్‌తోనూ మరో సినిమా లో అవకాశం దక్కించుకుంది. ఇవన్నీ ఇలా ఉంటే.. ఆలియా అందంపైనా బాగా దృష్టి పెట్టింది. బరువు తగ్గడం, మంచి ఆహారంపై శ్రద్ధ చూపుతోంది. మరీ బక్కపల్చగా ఉండడం తనకు ఇష్టముండదని, ఫిట్‌గా కనిపిస్తే చాలన్నది ఆలియా అభిప్రాయం. డబ్బు పెట్టి థియేటర్లకు వచ్చే వారికి ఆహ్లాదం కలిగించేలా నటులు ఉండాలని చెప్పింది.